ETV Bharat / bharat

లోక్​సభ ఎన్నికల్లో మోదీ మ్యాచ్​ ఫిక్సింగ్- ఆ ఐదుగురితో కలిసి!: రాహుల్​ - Rahul Gandhi Fires On BJP

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 3:02 PM IST

Updated : Mar 31, 2024, 4:20 PM IST

Rahul Gandhi Fires On BJP : సార్వత్రిక ఎన్నికల్లో మ్యాచ్​ ఫిక్సింగ్ చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్ బ్యాంక్​ ఖాాతాలను ఫ్రీజ్​ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు దిల్లీలోని రామ్​లీలా మైదానంలో జరిగిన ఇండియా కూటమి సభలో ప్రసంగించారు.

Rahul Gandhi Fires On BJP
Rahul Gandhi Fires On BJP

Rahul Gandhi Fires On BJP : మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. విపక్షాల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌, నేతలను అరెస్టు చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. ఇలాంటి నిర్ణయాలు మోదీ ఒక్కరే తీసుకోవడం లేదు. ఐదుగురు ధనిక మిత్రులతో కలసి ఈ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈవీఎంలు వాడకుండా, మీడియాను కొనుగోలు చేయకుండా ఉంటే బీజేపీకి 180 సీట్లకు మించి రావన్నారు. మద్యం కేసులో కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ దిల్లీ రామ్‌లీలా మైదానంలో ఆప్ ఆధ్వర్యంలో జరిగిన సభలో రాహుల్​ ప్రసంగించారు. పారదర్శకంగా ఎన్నికలు జరిగితే బీజేపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.

"అంపైర్లు, కెప్టెన్​పై ఒత్తిడి తెచ్చినప్పుడు, ఆటగాళ్లను కొనుగోలు చేసినప్పుడు, మ్యాచ్​ గెలవడాన్ని క్రికెట్​ మ్యాచ్​ ఫిక్సింగ్ అంటారు. ఎన్నికల నేపథ్యంలో అంపైర్లను ఎవరు ఎంపిక చేశారు? మ్యాచ్​ ప్రారంభం కాకముందే ఇద్దరు ప్లేయర్ల (ఇద్దరు సీఎంలు)ను అరెస్టు చేశారు. నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు ప్రయత్నం చేస్తున్నారు. 400 స్థానాల నినాదం ఏదైతే ఉందో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడకుండా, ఈవీఎంలు, సోషల్‌ మీడియా వాడకుండా, మీడియాపై ఒత్తిడి, కొనుగోలు చేయకుండా సాధ్యం కాదు. వారికి అన్నికలిపి 180సీట్లకు మించి రావు. ఒకవేళ బీజేపీ తన ప్రయాత్నాల్లో సఫలం అయితే, దేశ రాజ్యాంగాన్ని మారుతుంది. దాంతో ప్రజల హక్కులు హరిస్తారు. ఇది మామూలు ఎన్నికలు కావు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించే ఎన్నికలు."
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు

రాజ్యాంగం ప్రజల గొంతుక అన్న రాహుల్​, ఏ రోజైతే అది అంతం అవుతుందో అప్పుడు దేశం కూడా అంతమవుతుందని అన్నారు. రాజ్యాంగం పోతే పేద ప్రజల హక్కులు, రిజర్వేషన్లు కూడా పోతాయని విమర్శించారు. బెదిరింపులతో దేశాన్ని నడిపించొచ్చని వారు భావిస్తున్నారని, మీడియాను కొని అణచివేయవచ్చని కానీ దేశం గొంతుకను అణచివేయలేరని అన్నారు. ఈ ప్రపంచంలో ఏ శక్తి ప్రజల గొంతుకను అణచివేయలేదని చెప్పారు.

"రాముడు సత్యం కోసం పోరాడారు. అప్పుడు ఆయన వద్ద అధికారం లేదు. వనరులు లేవు. కనీసం రథం కూడా లేదు. కానీ రావణుడి రథం వద్ద ఉంది. వనరులు, సైన్యం, బంగారం ఉన్నాయి. రావణుడు బంగారం లాంటి లంకలో ఉండేవాడు. రాముడి వద్ద సత్యం ఉంది. ఆశ, నమ్మకం, ప్రేమ, పరోపకారం, వినయం, ధైర్యం, సాహసం ఉన్నాయి."
--ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి

BJP, RSS​ విషం- వాటిని రుచి చూడొద్దు : ఖర్గే
రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం, ప్రధాని మోదీ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. మోదీ, భావజాలాన్ని తొలగించేంత వరకు దేశంలో ముందుకు సాగదని ధ్వజమెత్తారు. బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ విషం వంటివి, వాటిని రుచి చూడవద్దని ఘాటు వ్యాఖ్యలతో విమర్శించారు. వారు (బీజేపీ) దేశాన్ని నాశనం చేశారన్నారు. ఈ ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు లేవన్న ఖర్గే, ప్రధాని మోదీ మైదానాన్ని తవ్వి, అక్కడ ప్రతిపక్షాలను క్రికెట్​ ఆడమని అడుగుతున్నారని మండిపడ్డారు.

'మనందరం ఏకం కావాలి (మిత్రపక్షాలను ఉద్దేశించి), అప్పుడే మనం పోరాడగలం. పరస్పరం దాడులు చేసుకుంటే విజయం సాధించలేం. మా పార్టీ నిధులు ఇప్పటికే దోచుకున్నారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటం కోసం జరుగుతున్నాయి. మనం కచ్చితంగా ఐక్యంగా పోరాడాలి.' అని మల్లికార్జున ఖర్గే అన్నారు.

దేశంలో ఎమర్జెన్సీ అమలవుతోంది : తేజస్వీయాదవ్‌
ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొన్న ఆర్జేడీ అగ్రనేత తేజస్వీయాదవ్‌, దేశంలో అనధికార అత్యయిక పరిస్థితి అమలవుతోందని ఆరోపించారు. ఈడీ కేసులకు తాము భయపడబోమని తేల్చిచెప్పారు. దేశాన్ని విడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, ఈడీ, ఐటీ, సీబీఐ ఆ పార్టీ అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలు ఈ ఎన్నికల్లో మోదీ సర్కార్‌ను గద్దె దింపనున్నారని తేజస్వీ యాదవ్‌ పేర్కొన్నారు.

"హేమంత్‌ సోరెన్‌, కేజ్రీవాల్‌ను బీజేపీ నేతలు అరెస్ట్‌ చేయించే పనిచేశారు. వారికి ఒకటే విషయం చెబుతున్నా ఇలాంటి గాండ్రింపులకు తాము భయపడబోం. మేం పోరాటం చేసే వ్యక్తులం. బోనులో సింహాన్నే బంధిస్తారు. అందరూ సింహాలే. మీరు(ప్రజలు) ఇచ్చిన బలంతో మీ (ప్రజల) పోరాటం మేం చేస్తున్నాం."
--తేజస్వీయాదవ్‌, ఆర్జేడీ అగ్రనేత

'అవినీతి, నిరుద్యోగం నుంచి విముక్తి కల్పిస్తాం'
భారత రాజకీయాల్లో సరికొత్త శక్తి నేడు పుట్టిందని, దేశ రాజ్యాంగం, గణతంత్ర భావాన్ని రక్షించడమే నిజమైన స్వాతంత్ర్యం అని సీపీఐ-ఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. తాము దానిని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నుంచి విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు.

'ఈ ఇంటికి మీరు యజమానులా?'
బీజేపీ ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించిన వారిని జైళ్లలో వేసిందని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ అన్నారు. 'కాంగ్రెస్‌ నిధులను స్తంభింపజేసింది. వారిని వారు ఏమనుకొంటున్నారు. హేమంత్‌ సోరెన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ను కారాగారంలో బంధించింది. ఇంటికి మీరు యజమానులా? కాదు 140 కోట్ల మంది ప్రజలది ఈ ఇల్లు' అని భగవంత్​ మాన్​ బీజేపీపై మండిపడ్డారు.

Last Updated :Mar 31, 2024, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.