ETV Bharat / bharat

'బంగాల్​లో మమత కుంభకోణాల ఫ్యాక్టరీ- కాంగ్రెస్‌కు 'యువరాజు' ఏజ్ కన్నా తక్కువ సీట్లు!' - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 5:10 PM IST

Modi On Opposition Parties : బంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కుంభకోణాలను పనిగా మార్చుకుందని ప్రధాని మోదీ ఆరోపించారు. వామపక్షాలు లేదా కాంగ్రెస్‌ లేదా ఇండి కూటమిలోని ఏపార్టీ అయినా అవినీతి వారి లక్షణమని ఎద్దేవా చేశారు. ఇండి కూటమిలోని చాలా పార్టీలు గోప్యంగా అవినీతికి పాల్పడితే టీఎంసీ మాత్రం ఏకంగా కుంభకోణాల పరిశ్రమను తెరిచిందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఈసారి కాంగ్రెస్‌ పార్టీకి యువరాజు వయసు కంటే కూడా తక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పిన ప్రధాని మోదీ, బంగాల్‌కు ఐదు గ్యారంటీలు ప్రకటించారు.

Modi
Modi (Source : ANI)

Modi On Opposition Parties : బంగాల్‌లో భారతీయ జనతా పార్టీ 2019ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ స్థానాలు గెలుపొందనుందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. టీఎంసీ సర్కార్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ గెలుపును ఆపలేదన్నారు. లోక్‌సభ ఎన్నికలప్రచారంలో భాగంగా ఉత్తర 24 పరగణాల జిల్లా బారక్‌పుర్‌, హూగ్లీ, ఆరంబాగ్‌ తదితర బహిరంగ సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, టీఎంసీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పనితీరు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిందని, ఆ పార్టీకి ఈసారి రాహుల్‌గాంధీ వయసు కంటే తక్కువ సీట్లు రాబోతున్నాయని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. సందేశ్‌ఖాలీ మహిళలపై టీఎంసీ గూండాల నిర్వాకాలను దేశమంతా చూసిందన్నారు. పోలీసులు మొదట నిందితులను కాపాడే ప్రయత్నం చేయగా ఇప్పుడు టీఎంసీ కొత్త డ్రామా మొదలుపెట్టిందని ధ్వజమెత్తారు. టీఎంసీ పాలనలో బెంగాల్‌ అవినీతి కుంభకోణాలకు అడ్డాగా బాంబుల తయారీకి కుటీర పరిశ్రమగా మారిందన్నారు. దీదీ ప్రభుత్వం కుంభకోణాలు చేయటమే పనిగా పెట్టుకుందని ప్రధాని మోదీ ఆరోపించారు.

"బంగాల్‌లోని బారక్‌పుర్‌ చరిత్ర లిఖించిన గడ్డ. స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖపాత్ర పోషించింది. కానీ టీఎంసీ హయాంలో పరిస్థితి పూర్తిగా మారింది. ఒక సమయంలో బంగ్లాదేశ్‌ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయటంలో కీలకపాత్ర పోషించేది. ఇప్పుడు టీఎంసీ...కుంభకోణాలకు అడ్డాగా మార్చింది. ఒక సమయంలో బంగాల్‌లో ఒకదాని మించి ఒక శాస్త్రీయ ఆవిష్కరణలు జరిగేవి. టీఎంసీ పాలనలో బాంబుల తయారీ కుటీరపరిశ్రమగా మారింది. ఒక సమయంలో చొరబాట్లకు వ్యతిరేకంగా పోరాటం జరిగేది. కానీ టీఎంసీ సంరక్షణలో చొరబాట్లు పెరిగిపోయాయి."

- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

శ్రీరాముడి పేరు ఎత్తలేరు!
టీఎంసీ ప్రభుత్వం ఓటు బ్యాంక్‌ రాజకీయాల ముందు తలొగ్గిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఎందుకంటే ఇక్కడ శ్రీరాముడి పేరు ఎత్తలేరని, శ్రీరామ నవమి వేడుకలు జరుపుకోలేరన్నారు. బంగాల్​లో హిందువులు ద్వితీయశ్రేణి పౌరులుగా మారారని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

"బంగాల్‌కు ఐదు గ్యారంటీలు ఇస్తున్నాను. మొదటి గ్యారంటీ మోదీ ఉన్నంత వరకు మతపరమైన రిజర్వేషన్లకు అవకాశం లేదు. రెండోది గ్యారంటీ మోదీ ఉన్నంత వరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు. మూడోది శ్రీరామ నవమి వేడుకలు జరుపుకోవటాన్ని, భగవాన్‌ రాముడిని పూజించటాన్ని ఎవరూ ఆపలేరు. నాలుగో గ్యారంటీ మోదీ ఉన్నంత వరకు రామ మందిరంపై సుప్రీంకోర్టు తీర్పును ఎవరూ మార్చలేరు. ఐదో గ్యారంటీ మోదీ ఉన్నంత వరకు ఎవరూ కూడా సీఏఏను రద్దు చేయలేరు. మీకు తెలుసు కదా మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీ పూర్తి కావటానికి గ్యారంటీ."

- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

మూడుదశల ఓటింగ్‌ తర్వాత బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 400 సీట్లు కచ్చితంగా దాటుతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. 4వందలకుపైగా సీట్లు అనేది నినాదం కాదని, దేశ ప్రజల సంకల్పమన్నారు. టీఎంసీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవటమే కాకుండా ప్రతిపక్షంగా కూడా ఏమీ చేయలేదన్నారు. కేవలం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మాత్రమే సుస్థిర, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని ప్రధాని మోదీ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.