ETV Bharat / bharat

కాంగ్రెస్​కు బిగ్ షాక్​- ఆ రాష్ట్ర మాజీ సీఎం రాజీనామా- బీజేపీలో చేరే అవకాశం

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2024, 1:40 PM IST

Updated : Feb 12, 2024, 3:18 PM IST

Ashok Chavan Quits Congress : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ నేత అశోక్​ చవాన్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేశారు.

Ashok Chavan Quits Congress
Ashok Chavan Quits Congress

Ashok Chavan Quits Congress : లోక్​సభ ఎన్నికల ముందు కాంగ్రెస్​ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ నేత అశోక్​ చవాన్ ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్ రాహుల్‌ నర్వేకర్​​కు లేఖను పంపించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నానా పటోల్‌కు రాసిన లేఖలో అశోక్‌ చవాన్‌ పేర్కొన్నారు.

బీజేపీలో చేరుతారా?
ఈ నేపథ్యంలో అశోక్​ చవాన్‌ బీజేపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. చవాన్​కు రాజ్యసభ ఎంపీగా పార్లమెంట్​లోకి పంపించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై చవాన్ స్పందించారు. తన భవిష్యత్ కార్యాచరణపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. బీజేపీలో చేరే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. బీజేపీ పని విధానం తనకు తెలియదని అన్నారు.

అశోక్​ చవాన్​తోపాటు మరో 12మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ స్పందించారు. అశోక్ చవాన్​ రాజీనామా గురించి విన్నానని, ఏం జరుగుతుందో వేచి చూద్దామన్నారు. అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు బీజేపీతో టచ్​లో ఉన్నారని చెప్పారు. అయితే, తాను ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేతోనూ మాట్లాడలేదని అశోక్ చవాన్ స్పష్టం చేశారు.

"మహారాష్ట్ర కాంగ్రెస్​లో ఐక్యత లేదు. ఆ పార్టీలో అంతర్గత గొడవలు ఉన్నాయి. మాజీ సీఎం అశోక్ చవాన్ కూడా రాజీనామా చేశారు. ఆ పార్టీకి నాయకుడు కూడా లేడు. కాంగ్రెస్​ పార్టీ నేత రాహుల్ గాంధీ తరచుగా ఓబీసీ వర్గానికి చెందిన ప్రధానిని దూషిస్తుంటారు. అందుకే ఆయనతో ఉండేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ప్రజలు కూడా ఆయనను వదలిపెడుతున్నారు. ఎవరైనా సరే బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం."
--చంద్రశేఖర్ బవాంకులే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

కాంగ్రెస్​కు వరుస ఎదురుదెబ్బలు
అశోక్ చవాన్​ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ​2008 డిసెంబర్ నుంచి 2010 నవంబర్​ వరకు పనిచేశారు. ఈయన మాజీ ముఖ్యమంత్రి శంకర్​ రావ్ చవాన్​ కుమారుడు. మరోవైపు ఇటీవల హస్తం పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు బాబా సిద్దిక్‌, మిలింద్‌ దేవ్‌ర ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు. తాజాగా అశోక్‌ చవాన్‌ రాజీనామా చేయడం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.

Last Updated :Feb 12, 2024, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.