తెలంగాణ

telangana

T Congress: ఒకే వేదికపై ముగ్గురు ఎంపీలు.. ఈ అరుదైన సీన్ చూశారా..?

By

Published : Apr 29, 2023, 11:27 AM IST

T Congress Nirudyoga Nirasana Rally: నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా ఒకటై.. నిరుద్యోగ నిరసన ర్యాలీని విజయవంతం చేశారు. ఎడమొఖం పెడముఖంగా ఉండే ముగ్గురు ఎంపీలు.. సీనియర్ నేత జానారెడ్డిలు ఐక్యంగా నిలిచి... కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, పదోతరగతి ప్రశ్నాపత్రాలు బయటకురావడం.. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ధ్వజమెత్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కి పన్నెండు స్థానాలు గెలిపించి.. నల్గొండ కాంగ్రెస్ ఖిల్లాగా నిరూపించాలని పిలుపునిచ్చారు.

Telangana Congress
Telangana Congress

ముఖ్యమంత్రిని అయిన తర్వాతనే పోటీ చేస్తాను

T Congress Nirudyoga Nirasana Rally: నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీ నేతల ఐక్యతను చాటింది. మర్రిగూడ కూడలి నుంచి పెద్ద గడియారం వరకు కొనసాగిన నిరసన ర్యాలీలో.. పెద్ద సంఖ్యలో హస్తం కార్యకర్తలు, నాయకులు నిరుద్యోగులు పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ సీనియర్‌ నేత జానారెడ్డి నిరసనలో పాల్గొన్నారు.

12 సీట్లు గెలిపిస్తారన్న ధీమా: పెద్ద గడియారం సెంటర్‌లో మాట్లాడిన సీనియర్ నేత జానారెడ్డి.... కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలిపిస్తారన్న ధీమా కలుగుతోందన్నారు. జిల్లాలో నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా.. యుద్ధం వచ్చినప్పుడు అందరం ఐక్యంగా పోరాడతామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. నల్గొండకు జలకళ తీసుకొస్తామని జానారెడ్డి హామీ ఇచ్చారు.

దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా.. ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలను గెలిపించిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఎస్​ఎల్​బీసీ సొరంగం తొమ్మిదేళ్లలో ఇంచు కూడా ముందుకెళ్లలేదని ఆరోపించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ఉత్తమ్ నిలదీశారు. తెలంగాణ వచ్చిందే నిధులు, నీళ్లు, నియామకాల కోసమైనా.. కేసీఆర్ ప్రభుత్వం అవేమీ అమలు చెయ్యలేదని.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.

ఎందుకు చర్యలు తీసుకోలేదు: దళితబంధులో ఎమ్మెల్యేలు 30శాతం కమీషన్ తీసుకుంటున్న చిట్టా ఉందని చెబుతున్న కేసీఆర్... అలాంటి ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి నిలదీశారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు మంత్రులుగా పని చేసిన నల్గొండ జిల్లాలో.. ఇప్పుడు ఎలాంటి నాయకులను చూస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిపాలనను కేసీఆర్ గాలికొదిలేశారని విమర్శించారు.

బజార్లో ప్రశ్నపత్రాలు:ప్రశ్నపత్రాలు బజార్లో దొరుకుతున్నాయని రేవంత్​రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. నిరుద్యోగులకు అండగా నిలవడానికి.. ప్రియాంక గాంధీ మే మొదటివారంలో తెలంగాణ గడ్డకు రానున్నారని తెలిపారు. మే మొదటి వారంలో సరూర్‌నగర్‌ సభకు వేలాదిగా తరలిరావాలని పీసీసీ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. మరోవైపు తన ఇద్దరు కుమారులలో ఎవరు పోటీ చేసుకుంటారో వారే నిర్ణయించుకుంటారని.. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి... నల్గొండలోని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో విలేఖరుల ఇష్టాగోష్ఠిలో అన్నారు.

1978 నుంచి వరుసగా 11 సార్లు పోటీ చేశానని... ప్రజలు తనను ఆశీర్వదించారని జానారెడ్డి తెలిపారు. ఈ దఫా తాను పోటీ చేయడం లేదని.. తన కుమారుల్లో ఇద్దరు పోటీచేస్తారా లేక ఒక్కరు అనేది వారే నిర్ణయించుకుంటారని అన్నారు. ఇద్దరికీ టికెట్ల ఇచ్చే అంశం అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పారు. తాను సీఎం కావాలని రాష్ట్ర నేతలు, అధిష్ఠానం కోరిక అయితే... ముఖ్యమంత్రిని అయిన తర్వాతనే పోటీ చేస్తానని జానారెడ్డి వ్యాఖ్యానించారు.

"నల్గొండ జిల్లాలో చెప్పుకోవడానికి నాయకుడు లేడు. పనులు చెేసిపెట్టడానికి మంత్రి లేడు. బంగారు తెలంగాణ అని చెప్పి.. కేసీఆర్ కుటుంబమే దోచుకుంది." -రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:Etela Rajender: 'దళితబంధులో అవినీతి జరుగుతుందని కేసీఆర్​ స్వయంగా చెప్పారు'

సీఎం తల్లికి చేదు అనుభవం.. అసభ్యంగా ప్రవర్తించిన డాక్టర్! విచారణకు సీఎంఓ ఆదేశం

ABOUT THE AUTHOR

...view details