తెలంగాణ

telangana

Minister Gangula: భాజపా నేతల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తాం : మంత్రి గంగుల

By

Published : Nov 11, 2021, 1:26 PM IST

Updated : Nov 11, 2021, 3:22 PM IST

వర్షాకాలం వరి ధాన్యం సేకరించమని చెప్పలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌(Minister Gangula Kamalakar) స్పష్టం చేశారు. భాజపా ధర్నాలను తప్పుపట్టిన మంత్రి.. రైతులను మభ్యపెట్టేందుకే ధర్నాలు చేస్తుందని విమర్శించారు. యాసంగి పంటను కొనుగోలు చేస్తామని కేంద్రంతో చెప్పించాలన్నారు.

gangula kamalakar
మంత్రి గంగుల కమలాకర్

ధాన్యం కొనుగోళ్లు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నేడు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామని భాజపా చేసిన (BJP Dharnas in Telangana) ప్రకటనపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. వర్షాకాలం వరి ధాన్యం సేకరించబోమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి స్పష్టం చేశారు. భాజపా ధర్నాలను తప్పుపట్టిన ఆయన.. యాసంగి పంటను కొనుగోలు చేస్తామని కేంద్రంతో చెప్పించాలన్నారు.

రైతులను మభ్య పెట్టేందుకే భాజపా ధర్నాలు. ధర్నాలు తెలంగాణలో కాదు.. దిల్లీలో చేయాలి. ఇప్పటికే వానాకాలం పంట కొనుగోలు చేస్తున్నాం. 3వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. యాసంగి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పింది. అందుకే యాసంగి ధాన్యం కేంద్రం కొనాలనే శుక్రవారం మేము ధర్నాలు చేస్తున్నాం. ధాన్యం కొనుగోలుపై రైతులను భాజపా మభ్యపెడుతోంది. అందుకే ధర్నాలు చేస్తోంది. బండి సంజయ్ గ్రామాల్లో తిరిగితే ధాన్యం కొనుగోలు జరుగుతుందో లేదో తెలుస్తుంది.

నేడు భాజపా ఎందుకు ధర్నా చేస్తుందో రైతులే నిలదీయాలి. రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం పంట కొనుగోలు ఇప్పటికే కొనసాగిస్తుంటే.. ధాన్యం కొనాలని భాజపా ధర్నా చేయడం హాస్యాస్పదం. కొనుగోలు అయిపోయినా భాజపా ధాన్యం కొనాలని ధర్నా చేస్తుందేమో. మేము ఇప్పుడు వానాకాలం పంట కొనుగోలు చేస్తున్నాం. వీటిని బియ్యం చేసిన తర్వాత ఎఫ్​సీఐ ద్వారా కొనుగోలు చేయించాలి. లేకపోతే భాజపా నాయకుల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తాం.

-పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌

ధాన్యం ఆరబెట్టుకునేందుకు కల్లాలు లేకపోవడం వల్ల రైతులు మార్కెట్‌కు తీసుకువస్తున్నారని గంగుల కమాలకర్‌ తెలిపారు. అక్కడే ఆరబెట్టుకుంటున్న వాళ్ల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం కొనడం లేదని దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనని రైతులందరికీ తెలిసిపోయిందన్న మంత్రి.. అదే డిమాండ్‌తో రేపు తెరాస ధర్నాలు చేపడుతోందని వెల్లడించారు. రైతుల పక్షాన ఉండి కేంద్రంతో పోరాటం చేయండని భాజపా నేతలకు సూచించారు.

మంత్రి గంగుల కమలాకర్
Last Updated : Nov 11, 2021, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details