ETV Bharat / state

వేడెక్కిన 'వరి' రాజకీయం... భాజపా, తెరాస సవాళ్లు, ప్రతి సవాళ్లు!

author img

By

Published : Oct 28, 2021, 9:39 PM IST

వరి ధాన్యం కొనుగోళ్లపై తెరాస, విపక్ష భాజపా మధ్య సవాళ్లపర్వం కొనసాగుతోంది. కేంద్రానిదే తప్పంటూ గులాబీ పార్టీ, రాష్ట్రం చేష్టలుడిగి చూస్తోందంటూ కమలం పార్టీ పరస్పరం చేసుకున్న ఆరోపణలతో 'వరి రాజకీయం' వేడెక్కింది. వరి వేస్తే ఉరే అంటూ రైతులను పాలకపక్షం భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ బండి సంజయ్ దీక్ష చేపట్టారు. భాజపా చిల్లర రాజకీయాలు చేస్తోందంటూ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలతో బదులిచ్చారు.

paddy poru
paddy poru

రాష్ట్రంలో వేడెక్కుతోన్న "వరి రాజకీయం" .. నేతల పరస్పర ఆరోపణలు

రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ గందరగోళానికి గురిచేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వరి సాగుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ 'వరి-ఉరి... ప్రభుత్వ వైఖరి' నినాదంతో బండి సంజయ్ దీక్ష చేపట్టారు. ఏ ఉద్దేశంతో వరి సాగు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం అంటోందని ప్రశ్నించిన సంజయ్.... రైతులను తెరాస నేతలు గంరగోళంలోకి నెడుతున్నారంటూ ఆక్షేపించారు.

ఒక కలెక్టర్​ ఏమో వరి వేయొద్దంటాడు.. వరి విత్తనాలు అమ్మితే సీజ్​ చేస్తామంటారు.. ఇంకో కలెక్టర్​ వరి వేయమంటాడు. ఇంకో మంత్రేమో వరి కొనమంటాడు.. మరో మంత్రి వరి కొంటామంటాడు... ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడడు. ముఖ్యమంత్రే సందిగ్ధంలో ఉంటాడు. ఆయనకే క్లారిటీ ఉండదు. వాళ్లకు కేంద్రం కొంటలేదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైనా లెటర్​ ఇచ్చిందా..? ఉంటే బయటపెట్టు.. లేకుంటే రాజీనామా చేసి ఇంట్లో పడుండు. రైతులు వాళ్ల పనేదో వాళ్లు చేసుకుంటారు. - బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.

కేంద్రం నుంచి లేఖ తెప్పించండి..

బండి సంజయ్‌ దీక్షను తప్పుపట్టిన వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి.... యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం నుంచి లేఖ తెప్పించాలని భాజపాకు సవాల్‌ విసిరారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు చేసిందన్న నిరంజన్ రెడ్డి.... ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు పెట్టామని వివరించారు.

సెప్టెంబరు నెలలోనే లేఖ ఇచ్చారు. తెలంగాణ నుంచి బాయిల్డ్​ రైస్​కూడా మేము కొనమని. మీ ప్రభుత్వమే.. సాక్ష్యాత్తు కేంద్ర మంత్రే ఆ మాట చెప్పారు. మేము కొనమని చెప్పిన తర్వాత.. తెలంగాణ ప్రభుత్వం కొననట్లు... రైతులపై తెలంగాణ ప్రభుత్వానికి రైతులపై ప్రేమలేనట్లు వీళ్లు డ్రామాలు కట్టడం ఏమిటి..? ప్రతి గింజా కొంటామని కేంద్ర చెప్పే వరకు మీరు దీక్ష చేయండి... అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష ప్రకటించు బండి సంజయ్​... - నిరంజన్​ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి.

శ్వేతపత్రం విడుదల చేయాలి

వరి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రం ముడి బియ్యం కొనడానికి సిద్ధంగా ఉందని బండి స్పష్టం చేశారు.

లక్షల కోట్లు ఖర్చు పెట్టారంట.. శ్వేతపత్రం విడుదల చెయ్యి.. మంత్రులు, తెరాస పార్టీ నేతలు చేసిన స్కాంను బయటపెడతాం. వరి బంద్​ అని చెప్పి.. వరి వేస్తే ఉరి అని ఎందుకు అన్నావు.. నీవళ్ల నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎదుటి పార్టీలు మాట్లాడితే దీన్ని రాజకీయ కోణం అంటావు. కేంద్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది. -బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.

అలా చేయకపోతే రాజీనామా చేస్తారా..?

ధాన్యం కొనలేమని కేంద్రం లేఖ పంపిందని మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. వానాకాలం 59.7 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసేందుకు ఎఫ్​సీఐ అంగీకరించిందన్నారు. కేంద్రం నుంచి ధాన్యం కొనుగోలుకు హామీ తేకుంటే.... భాజపా నేతలు పదవులకు రాజీనామా చేయాలని చురకలంటించారు.

ఎవర్ని గోల్​మాల్​ చేయడానికి చేస్తారీ థర్డ్​క్లాస్​ రాజకీయాలు. మీ ప్రభుత్వం మేము కొనమని చెప్పిన కాగితాన్ని మీ ముందు పెడుతున్నాను.. తెప్పియ్యలేదో..మీకు చేతకాలేదో పదవులకు రాజీనామా చేయండి. బండి సంజయ్​ కావొచ్చు.. కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్​ రెడ్డి కావొచ్చు.. మేం మాట్లాడింది తప్పంటే.. వ్యవసాయశాఖ మంత్రిగా రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఛాలెంజ్​ను స్వీకరించండి దమ్ముంటే... -నిరంజన్‌ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి.

మొత్తానికి ధాన్యం కొనుగోళ్ల అంశం తెరాస, భాజపా నేతల మధ్య మాటలయుద్ధానికి తెరలేపింది.

ఇదీ చూడండి: Errabelli Dayakar Rao: భాజపా స్టేట్​చీఫ్​ బండి సంజయ్​పై మంత్రి ఎర్రబెల్లి సీరియస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.