తెలంగాణ

telangana

ముందస్తు ఉండదు.. షెడ్యూల్ ప్రకారమే శాసనసభ ఎన్నికలు: సీఎం కేసీఆర్‌

By

Published : Nov 15, 2022, 3:04 PM IST

Updated : Nov 15, 2022, 9:04 PM IST

TRS Executive Meeting: భాజపాను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టేది లేదని తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలతో అన్నారు. భాజపా వికృత రాజకీయ చేష్టలకు తెలంగాణ నుంచే చరమగీతం పాడాలన్నారు. ఎమ్మెల్యేలపై కూడా ఈడీ దాడులు జరగొచ్చునని.. భయపడాల్సిన అవసరం లేదన్నారు. తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పార్టీలో చేరమని అడిగారని.. ఇంతకన్నా ఘోరం ఉంటుందా అన్నారు. దేశంలో కాంగ్రెస్​ది ముగిసిన అధ్యాయమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో చట్టం తన పని తాను చేస్తుందని.. త్వరలో మరిన్ని అరెస్టులు ఉండొచ్చునని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ముందస్తు వెళ్లే ఆలోచనే లేదని.. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని.. కనీసం 95 సీట్లు గెలుస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

KCR
KCR

TRS Executive Meeting: భాజపా నిజ స్వరూపాన్ని తెలంగాణ బయటపెట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేయాలని భాజపా చూసిందని... ఆ కుట్రలకు సంబంధించి సుమారు 5లక్షల పేజీల సమాచారం ఉందన్నారు. భాజపాను ఎట్టిపరిస్థితుల్లో వదిలి పెట్టేది లేదని కేసీఆర్ పేర్కొన్నారు. భాజపా వద్ద 2 లక్షల కోట్ల రూపాయలున్నాయని సింహయాజీ అన్నారని... ఒక రాజకీయ పార్టీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలన్నారు. ఎనిమిదేళ్లుగా ఈడీ ఎన్నో కేసులు పెట్టినప్పటికీ.. ఒక్కటి కూడా రుజువు కాలేదన్నారు.

ఎమ్మెల్యేలపై కూడా ఈడీ దాడులు జరగొచ్చునని... భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నారు. ధర్మంగా, న్యాయంగా పోరాడుతున్నామని.. ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో చట్టం తన పని తాను చేస్తోందని.. త్వరలో మరిన్ని అరెస్టులు జరగొచ్చునని కేసీఆర్ వ్యాఖ్యానించారు. భాజపా గూండాగిరి, దాదాగిరి చేస్తోందని.. మునుగోడు ఎన్నికల్లో ఆ పార్టీ ప్రసాదాలు పంచిందా అని ఎద్దేవా చేశారు. భాజపా వికృత రాజకీయ చేష్టలకు తెలంగాణ నుంచే చరమగీతం పలకాలన్నారు.

కవితను పార్టీలో చేరమని భాజపా అడిగింది.. దేశానికి భాజపా రూపంలో పట్టిన చెదలును తొలగించే బాధ్యతను తెరాస శ్రేణులు తీసుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరూ తనలా పని చేయాలని తెరాస నేతలకు కేసీఆర్ సూచించారు. తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీలో చేరమని భాజపా అడిగిందని.. ఇంతకన్నా ఘోరం ఉంటుందా అన్నారు. ఎవరైనా ఫోన్ చేసి పార్టీ మారమని చెబితే చెప్పుతో కొడతామని సమాధానం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్‌ది ముగిసిన అధ్యాయమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా ఉండవని.. షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని స్పష్టతనిచ్చారు. తెరాస నేతలు, ప్రజా ప్రతినిధులు వచ్చే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.

సిట్టింగులకు మళ్లీ అవకాశం ఇస్తాం.. ఎమ్మెల్యేలను మార్చే ఉద్దేశం లేదని... సిట్టింగులకు మళ్లీ అవకాశం ఇస్తామన్నారు. మునుగోడులో పార్టీ నేతలందరూ సమష్టిగా పనిచేసి విజయం సాధించారని అభినందించారు. మునుగోడు తరహాలోనే పటిష్టమైన ఎన్నికల వ్యూహాలను నియోజకవర్గస్థాయిలో రూపొదించుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు, నేతలందరూ ప్రజల్లోనే ఉండాలన్నారు. పది గ్రామాలకోసారి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో 95 సీట్లు అవలీలగా గెలుస్తాం..నియోజకవర్గంలోని సంక్షేమ పథకాల లబ్ధిదారులతో నిరంతరం కలవాలని కేసీఆర్ సూచించారు. కార్యకర్తల బలాన్ని ఉపయోగించుకోవాలని.. ఓటర్లందరితో టచ్‌లో ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఎన్ని సర్వేలు చేసినా అనుకూలంగానే వస్తాయని.. కనీసం 95 సీట్లతో వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి 500 మందిని దళిత బంధుకు ఎంపిక చేయాలన్న ఆయన.. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్నారు. త్వరలో జిల్లా పర్యటనలకు వెళ్లనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

రక్షణ కోసమే ప్రగతిభవన్​లో ఉన్నాం..తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ సమావేశానికి ఎమ్మెల్యేలకు ఎర కేసుకు చెందిన నలుగురు శాసనసభ్యులు హాజరయ్యారు. రాష్ట్రాన్ని రక్షించడం, రాజ్యాంగం పరిరక్షణ కోసం, కుట్రదారుల ఎత్తులను చిత్తు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని.. సమావేశం అనంతరం ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. రక్షణ కోసమే తాము ప్రగతిభవన్​లో ఉన్నామన్న ఆయన... మమ్మల్ని ఎవరు నిర్బంధించలేదన్నారు. చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. సీఎంకు అందుబాటులో ఉండటానికే అక్కడే ఉన్నామని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు.

సీఎంకు అందుబాటులో ఉండటానికే అక్కడే ఉన్నాం: ఎమ్మెల్యే గువ్వల

'ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారమే రక్షణలో ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే వారధులుగా ఉన్నాం. సీఎంకు అందుబాటులో ఉండటానికే అక్కడే ఉన్నాం. మేము ప్రజలకు అందుబాటులోనే ఉన్నాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టే ఎవరిని వదిలిపెట్టం. మా మీద వాడే సంస్థలతోనే వారిని అంతం చేస్తాం. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్న భాజపాను దోషిగా నిలబెడతాం. కేసీఆర్ వదిలిన బాణంగా పనిచేస్తాం. మమ్మల్ని బెదిరించే వారిపై ఎంతకైనా తెగిస్తాం.'-గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే

తెలంగాణ భవన్​లో జరిగిన తెరాస విస్తృతస్థాయి సమావేశంలో తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు జిల్లా కమిటీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 15, 2022, 9:04 PM IST

ABOUT THE AUTHOR

...view details