తెలంగాణ

telangana

అడ్డంకులను ఫుట్​బాల్​ ఆడేసి.. రాష్ట్రానికి తొలి కోచ్​గా రాణిస్తున్న యువతి

By

Published : Nov 25, 2022, 11:03 AM IST

Football Coach
Football Coach

Special story on Young Woman as Football Coach: ఫుట్‌బాల్‌ అంటే అబ్బాయిల ఆట అనుకుంటాం. కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే అమ్మాయిలూ రాణించగలరని నిరూపించింది ఆ యువతి. అంతేకాదు.. తనలాంటి ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలవాలనుకుంది. ఫుట్‌బాల్‌ కోచ్‌ కావాలని కలలు కంది. అడ్డంకులెన్ని ఎదురైనా, సూటిపోటి మాటలు ఈటెల్లా గుచ్చుకుంటున్నా.. తన గురి మాత్రం తప్పలేదు. తనే మాసవేని వనిత. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా ఫుట్‌బాల్‌ కోచ్‌గా ఎంపికై నవ్విన నోళ్లతోనే శభాష్‌ అనిపించుకుంటోందీ ఆ యువతి.

ఫుట‌‌్‌బాల్‌ కోచ్‌గా రాణిస్తోన్న మంచిర్యాల యువతి

Special story on Young Woman as Football Coach: నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈ యువతి చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్‌పై మక్కువ పెంచుకుంది. తల్లి, కోచ్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో క్రీడలో మేటిగా రాణించింది. ఫలితంగా 8 నేషనల్స్‌ ఆడి ప్రతిభ కనబరిచింది ఈ క్రీడాకారిణి. ఆర్థిక ఇబ్బందులు, హేళన మాటల్ని ధైర్యంగా ఎదుర్కొని రాష్ట్ర తొలి మహిళ ఫుట్‌బాల్‌ కోచ్‌గా అందరి మన్ననలు పొందుతోంది. క్రీడకారులకు శిక్షణ ఇస్తున్న ఈ యువతి మాసవేని వనిత. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ కార్మిక కుటుంబంలో జన్మించింది. వనిత చిన్నతనంలోనే తండ్రి గని ప్రమాదంలో చనిపోయాడు. వనితతో సహా నలుగురు ఆడపిల్లలున్న ఆ కుటుంబ బాధ్యతలు అన్ని తల్లే చూసుకునేది. అలా ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కోంది ఈ యువతి.

ఆడపిల్లలకు ఆటలెందుకన్న వారి నుంచే మన్ననలు : చదువుల్లో రాణిస్తూనే.. క్రీడలపై ఆసక్తి కనబరిచింది వనిత. చెల్లెలు ఆసక్తిని గమనించిన మూడో సోదరి జ్యోతి వెన్నుతట్టి ప్రోత్సహించింది. ఆమె కూడా మంచి ఫుట్‌బాల్‌ క్రీడకారిణి కావడంతో వనితకు సూచనలు, సలహాలు ఇచ్చింది. సోదరి సలహాతో మెుదట రన్నింగ్‌ ప్రాక్టిస్‌ చేసింది. అలా పరుగుపై పట్టుసాధించడంతో పీఈటీ రోజా వరకుమారి వనితను గర్తించి ఫుట్‌బాల్ టీమ్‌లోకి తీసుకున్నారు. ఓ వైపు వనిత క్రీడల్లో ప్రతిభ కనబరుస్తుంటే... ఆడపిల్లలకు ఆటలెందుకని బంధువులు, ఇరుగుపొరుగు సూటిపోటి మాటలతో హేళన చేసేవారు. ఆ సమయంలో తల్లి, శిక్షకులు అండగా నిలిచి ప్రోత్సహించారు. దాంతో కళాశాల రోజుల నుంచే రాష్ట్ర, జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో పాల్గొని అద్భుత ప్రతిభతో జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించింది ఈ క్రీడకారిణి.

క్రీడకారిణిగా మొదలుపెట్టి ఫుట్‌బాల్‌ శిక్షణకురాలిగా : ఆటలపై ఉన్న ఇష్టంతో డిగ్రీ అయ్యాక బీపీడీ, ఎంపీడీ చేసింది వనిత. ఆపై వివిధ పాఠశాలల్లో శిక్షకురాలిగా పని చేసింది. కానీ తెలియని ఏదో అసంతృప్తి. మరెంతో మంది ఆడపిల్లలు ఈ ఆటల్లో రాణించాలంటే ఫుట్‌బాల్‌ కోచ్‌గా మారాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా కోల్‌కతాలో డిప్లొమా కోచింగ్‌ ఇన్‌ ఫుట్‌బాల్‌లో శిక్షణ పూర్తి చేసుకుంది. 2020లో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి శిక్షకురాలిగా గుర్తింపు పొందింది ఈ యువతి. క్రీడకారిణిగా, ఫుట్‌బాల్‌ శిక్షణకురాలిగా వనిత ప్రయాణం సులువుగా ఏం జరగలేదు. కోల్‌కతా సెలక్షన్‌కి వెళ్లిన సమయంలో సోదరి వివాహం.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా సరే.. అనుకున్న లక్ష్యం కోసం జరిగే సెలక్షన్స్‌కు చోటు సంపాదించాలనుకుంది. అలాంటి కఠిన పరిస్థితిలో తన ప్రతిభ గుర్తించిన ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆర్థికంగా అండగా నిలబడిందని వనిత చెబుతోంది.

తొలి మహిళా ఫుట్‌బాల్‌ కోచ్‌గా గుర్తింపు : అద్భుత ప్రతిభ, నైపుణ్యాలకు.. శిక్షకులు ఇచ్చిన ప్రోత్సాహం, అమ్మ నేర్పిన ఓర్పు, ధైర్యం తోడవ్వడంతో వనిత మార్గం సుమగం అయ్యింది. హేళన చేసిన నోళ్లతోనే మన్ననలు, ప్రశంసలు పొందింది. ఇప్పుడు అందరూ వనిత కోచ్‌ అయ్యిందంటగా... ఎంత కష్టపడిందో అంటుంటే అమ్మ ఆనందంతో పాటు గర్వంగా ఫీల్‌ అవుతుంది. దాంతో పడ్డ కష్టం అంతా మర్చిపోయాను అంటుంది ఈ ఫుట్‌ బాల్‌ కోచ్‌. తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా ఫుట్‌బాల్‌ కోచ్‌గా గుర్తింపు పొందింది వనిత. ఇప్పటి వరకూ 8 నేషనల్స్‌ ఆడి ప్రత్యేకత చాటుకుంది. జాతీయస్థాయి కోచ్‌గా నిలబడాలంటే తప్పనిసరైన లైసెన్స్‌ కోర్సులు పూర్తిచేసే పనిలో ఉంది. భారత ఫుట్‌బాల్‌ జట్టుకు కోచ్‌గా మారడమే లక్ష్యంగా సాధన చేస్తోంది. ప్రస్తుతం కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ ఏకలవ్య మోడల్‌ పాఠశాలలో ఫుట్‌బాల్‌ కోచ్‌గా పనిచేస్తోంది. నేను మాత్రమే గెలిస్తే సరిపోదు. ప్రతి అమ్మాయీ స్ఫూర్తి పొందాలి అంటుంది ఈ యువతి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details