ETV Bharat / city

A Woman Story: ఆమె అతనికి వెన్ను... ఆ కుటుంబానికి దన్ను

author img

By

Published : Mar 10, 2022, 1:48 PM IST

A Woman Real Story
చింతా కుమారి

A Woman Real Story : క్షణక్షణం కుటుంబంపైనే ఆమె దృష్టి...! బంధం నిలబడాలన్నా... బాధ్యత నెరవేరాలన్నా... కష్టపడాల్సిందే..! పిల్లలను పేగుబంధంతో... అనారోగ్యంతో ఉన్న భర్తను ప్రేమబంధంతో... జాగ్రత్తగా చూసుకుంటోంది. కష్టాలను పంటిబిగువున అదిమిపట్టి ఉంచుతోంది. గుండెల్లోని బాధల అగ్నిపర్వతం బద్దలవకుండా... కంటి నుంచి సుడులు సుడులుగా ఉబుకుతున్న కన్నీళ్లను... రెప్పల చాటున దాచేస్తోంది. ఇదంతా... ఎనిమిదేళ్లుగా ఓ మహిళ ఎదుర్కొంటున్న కష్టాల కథ..!

ఆమె అతనికి వెన్ను...ఆ కుటుంబానికి దన్ను

A Woman Real Story : బాధకు ఓదార్పుగా, సహనానికి సాక్ష్యంగా, ప్రేమకు బానిసగా నిలుస్తోందీమె. కుటుంబ భారం మోస్తూనే.. భర్త భవిష్యత్తుకు భరోసా ఇస్తోంది. అనిర్వచనీయమైన స్త్రీ శక్తికి... నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది ఏపీలోని విజయవాడకు చెందిన చింతా కుమారి.

కుమారి, శివప్రసాద్‌ పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వేర్వేరు మతాలు కావడం వల్ల.. 2 కుటుంబాలూ తిరస్కరించాయి. నెలకు రూ.20 వేల జీతం, మరో ఐదు వేల రూపాయల వరకు ఇతర భత్యాలూ వచ్చేవి. అంతా సాఫీగా ఉన్న సమయంలో.. శివప్రసాద్‌ కూర్చున్న పిట్టగోడ విరిగి పడిపోవడం వల్ల.. ఆయన వెన్నెముక దెబ్బతింది. తీవ్రగాయాలతో కాళ్లు చచ్చుబడిపోయి.. మంచానికే పరిమితమయ్యారు. ఏమీ చదువుకోని కుమారి.. అప్పటినుంచి.. మొత్తం కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది.

భర్తను భుజాన ఎత్తుకుని కుమారి ఆస్పత్రులకు తిరిగింది. వైద్యం కోసం అప్పులూ చేసింది. ఆరేళ్లుగా ఇంటి దగ్గరే పానీపూరి బండి నిర్వహిస్తోంది. ఆ వచ్చే మొత్తంతో...ఆస్పత్రులు, మందుల ఖర్చులు భరిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.

వాటిలోనే అన్ని ఖర్చులూ

"ఒక్కపూట బండి పెట్టకపోతే ఇంట్లో తినడానికి కూడా ఉండదు. రోజుకు వెయ్యి రూపాయల వరకూ బేరం అవుతుంది. అందులో 600-700 రూపాయలు పెట్టుబడికి పోగా..రూ. 200-300 మిగులుతాయి. ఆ డబ్బులోనే ఇంటి అద్దెలు, ఆయన వైద్యం, పిల్లలకు కావల్సినవి అన్ని ఖర్చులు వాటిలోనే. ఆయన నన్ను ఇష్టపడి చేసుకున్నారు. అప్పుడు బాగానే ఉన్నాం. నాకోసం అందరినీ వదిలిన ఆయన్ని ఇలా ఉందని వదిలి వెళ్లలేను. చంటిపిల్లవాడిలా అన్ని సేవలూ చేయాలి. పిల్లలిద్దరిలో ఒకరు నాకు పానీపూరీ బండి దగ్గర సాయం అందిస్తే, మరొకరి ఇంటి వద్ద ఆయన దగ్గర ఉంటారు. ఖరీదైన వైద్యం చేయించే స్థోమత లేక పెద్దాసుపత్రిలో ఇంకా చూపించలేదు." - చింతా కుమారి, విజయవాడ

శివప్రసాద్ కూర్చునేందుకూ వెన్నెముక సహకరించకపోవడం వల్ల... భార్య చల్లని ఒడిలోనే సేదతీరుతున్నారు. భార్య త్యాగాలు మరవలేనివంటూ కన్నీటిపర్యంతం అవుతున్నారు.

కూర్చునే అవకాశమే లేదు

"నాకు లోపల మొత్తం డొల్ల తీసేసి మడత పెట్టి కుట్లు వేసి ఆపరేషన్ చేశారు. కూర్చొనే దగ్గర ఏమీ లేదు. అందువల్ల కూర్చున్నా మళ్లీ పడే అవకాశాలున్నాయని వైద్యులు తెలిపారు. నా భార్య తెల్లవారి లేచింది మొదలు మా ఇద్దరు బిడ్డలతో సమానంగా నన్ను కూడా ఓ బిడ్డలా చూసుకుంటూ...సేవలు చేస్తూ...సాకుతుంది. నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. నాకోసం భగవంతున్ని ప్రార్థిస్తోంది. మేము చాలా బాధలు పడుతున్నాం. మాకు సాయం అందిచాలని భావించిన వాళ్లు దయచేసి సహాయం అందించండి. నా ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం సాయం అందించగలరని అర్థిస్తున్నాను." -శివప్రసాద్‌, కుమారి భర్త

ఎనిమిదేళ్లుగా భర్తను భుజాలపై మోస్తున్న కుమారికి వెన్నునొప్పి సమస్యతో... ఆస్పత్రిలో చూపించుకుంది. భర్తను 3 చక్రాల బండిపై కూర్చోబెట్టి తీసుకెళ్లాలనుకున్నా... శివప్రసాద్‌ పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు. భర్త వైద్యం కోసం... ఈమె లక్షల రూపాయలు అప్పులు చేసింది. ఇప్పటికీ.. అప్పులోళ్లు ఒత్తిళ్లు చేస్తున్నా.. బాధను దిగమింగుకుంటూ...అవహేళనలను భరిస్తోంది.

ఇదీ చదవండి : 15 రోజుల ముందు అప్లై చేసుకుంటే.. పెళ్లి రోజుకు కల్యాణలక్ష్మి చెక్​: మంత్రి గంగుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.