తెలంగాణ

telangana

NEET Exam 2023 : రాష్ట్రవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్.. నిమిషం ఆలస్యమైనా అనుమతించని అధికారులు​

By

Published : May 7, 2023, 6:41 AM IST

Updated : May 7, 2023, 2:15 PM IST

NEET Exam 2023 : వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నేడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరుగుతోంది. రాష్ట్రం నుంచి సుమారు 70 వేల మంది అభ్యర్థుల కోసం.. 22 పట్టణాలు, నగరాల్లో 115 కేంద్రాలను సిద్ధం చేశారు. రాత పరీక్షకు కేంద్రంలోనే పెన్ను ఇస్తారు.. అందువల్ల పెన్ను ఎగ్జామ్ హాల్​లోకి అనుమతి లేదు. మధ్యాహ్నం 2గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ప్రారంభమైంది.

NEET Exam 2023
NEET Exam 2023

NEET Exam 2023 : నీట్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 499 నగరాలు, పట్టణాలతో పాటు.. విదేశాల్లో 14 నగరాల్లో పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా 20,87,449 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో తెలంగాణ నుంచి దాదాపు 70 వేల మంది ఉన్నారు. రాష్ట్రంలో 115 పరీక్ష కేంద్రాలను జాతీయ పరీక్షల సంస్థ వెల్లడించింది. పరీక్షలో 200 ప్రశ్నలకు 200 నిమిషాలు కేటాయించారు. 200లో 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ప్రారంభమైంది.

ఎన్ని భాషల్లో పరీక్ష జరగనుందంటే..: ఈ రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు నీట్ పరీక్ష జరగనుంది. ఉదయం పదకొండు నుంచే లోనికి అనుమతించనున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదని ఎన్​టీఏ స్పష్టం చేసింది. ఆంగ్లంతో పాటు తెలుగు, హిందీ వంటి 13 భాషల్లో పరీక్ష రాసే సౌలభ్యం కల్పించింది. నిబంధనలు అతిక్రమిస్తే మూడేళ్ల వరకు డిబార్ చేయనున్నట్లు తెలిపింది. అడ్మిట్ కార్డుతో పాటు పాస్ పోర్టు సైజు ఫొటో, ఆధార్, ఓటరు గుర్తింపు, పాన్ కార్డు వంటి ఏదైనా గుర్తింపు పత్రం తీసుకెళ్లాలి.

వీటికి అనుమతి లేదు..: పారదర్శకమైన మంచి నీళ్ల బాటిల్, చిన్న శానిటైజర్ తీసుకెళ్లవచ్చు. ఉంగరాలు, బ్రాస్ లెట్లు, చెవి పోగులు, ముక్కు పుడకలు, గొలుసులు, నెక్లెస్​లు, హెయిర్ పిన్, హెయిర్ బ్యాండ్, తాయిత్తులు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, బూట్లు, పొడవు చేతుల చొక్కాలు, చేతి గడియారాలు, పెన్ను, పెన్సిల్, రబ్బరు, కాగితాలు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని ఎన్​టీఏ స్పష్టం చేసింది. పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నును కేంద్రంలోనే ఇస్తారని పేర్కొంది.

నెగెటివ్ మార్కులు..: ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. అందువల్ల కచ్చితంగా తెలిసిన సమాధానాలే రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరికైనా సమాన మార్కులు వస్తే నెగెటివ్ మార్కులు తక్కువ ఉన్న అభ్యర్థికే ర్యాంకులో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఈ ఏడాది ఎన్​టీఏ నిర్ణయించింది. నీట్ ర్యాంకు ద్వారా దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీవీఎస్, ఏహెచ్ సీట్లతో పాటు ఎయిమ్స్, జిప్‌మర్ సీట్లను భర్తీ చేయనున్నారు.

రాష్ట్రంలో 6,615 సీట్లు అందుబాటులో..: రాష్ట్రంలో 17 ప్రభుత్వ, 24 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 2,815.. ప్రైవేట్ కళాశాలల్లో 3,800 కలిపి రాష్ట్రంలో ప్రస్తుతానికి 6,615 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశాల నాటికి మరికొన్ని సీట్లకు అనుమతి వచ్చే అవకాశం ఉంది. గతేడాది తెలంగాణ నుంచి 35,148 మంది విద్యార్థులు నీట్‌లో అర్హత సాధించారు.

ఇవీ చదవండి:

Last Updated : May 7, 2023, 2:15 PM IST

ABOUT THE AUTHOR

...view details