తెలంగాణ

telangana

గుండెపోటు లక్షణాలను గుర్తించడం ఇలా!

By

Published : Aug 14, 2019, 1:05 PM IST

నడి వయసుకి ముందే గుండె గుభేల్‌ అంటోంది. గుండె జబ్బుల బాధితుల్లో 30 శాతం మంది 35 ఏళ్ల లోపువారేనని గణాంకాలు చెబుతున్నాయి. గత దశాబ్ద కాలంలో ఈ తరహా సమస్యలు రెట్టింపైనట్టు వెల్లడైంది. ప్రధానంగా జీవనశైలిలో వచ్చిన మార్పులే ఇందుకు కారణమని వైద్యులు విశ్లేషిస్తున్నారు. గుండెపోటు లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించలేకపోవడం, సకాలంలో వైద్యుల్ని సంప్రదించక ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది.

గుండెపోటు లక్షణాలను గుర్తించడం ఇలా!

గుండెపోటు లక్షణాలను గుర్తించడం ఇలా!

లక్ష్యాలు, ర్యాంకుల వెంట పరుగు... ఇంటి వంటే మానేశాం... వేళకు తినడం అంతంతమాత్రమే. ఫలితం పాతికేళ్ల లోపే మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం చుట్టుముడుతున్నాయి. కేవలం ఉన్నత వర్గాల్లో, 50ఏళ్లు దాటితేనే గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయనే ఇప్పటి వరకూ భావించేవారు. ఇప్పుడు ఇవన్నీ పటాపంచలైపోయాయి. జీవనశైలిలో వచ్చిన మార్పు కారణంగా గుండెపోటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. పేద, దిగువ తరగతుల్లోనూ ముఖ్యంగా 35 ఏళ్ల వయస్కుల్లోనే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఏటా 1500 వరకూ గుండె సంబంధిత శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. 30 శాతం గుండె రక్తనాళాల్లో పూడికలకు సంబంధించినవే. బాధితుల్లో 40-50 శాతం మంది 40 ఏళ్లలోపు వారే. గుండె జబ్బులకు చికిత్సలు పొందిన వారిలో 33 శాతం మంది 15-45 ఏళ్ల మధ్య వారేనని ఆరోగ్యశ్రీ గణాంకాలు చెబుతున్నాయి. జీవీకే ఈఎంఆర్‌ఐ విశ్లేషణలోనూ.. 19.78 శాతానికిపైగా గుండెపోటు బాధితులు 15-34 ఏళ్ల మధ్య వయస్కులేనని వెల్లడైంది. ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే ఉంటున్నారట.

లక్షణాలను గుర్తించడమెలా?

గుండెపోటు రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్న ప్రమాదకర జాబితాలోకి వచ్చే వారిలో కనిపించే లక్షణాలు చూస్తే... ఛాతీ మధ్య, పై భాగంలో తరచూ నొప్పి వస్తుంటుంది. దవడ లాగినట్లుగా ఉండడం, ఛాతీ నుంచి ఎడమ, కుడి చేతుల వైపు, గొంతు వైపు నొప్పి వ్యాపించడం జరుగుతుంది. చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఛాతీ పట్టేసినట్లుగా బరువుగా ఉంటుంది.

వీరు అప్రమత్తంగా ఉండాలి..

మధుమేహం, అధిక రక్తపోటు బాధితులు, శారీరక వ్యాయామానికి దూరంగా ఉండేవారు - ధూమపానం చేసేవారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిల్వ ఆహారాలు, వేపుళ్లను ఎక్కువగా తినేవారు, స్థూలకాయులు, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌), ట్రైగ్లిసరైడ్‌లు ఎక్కువగా ఉన్నవారు ఆరోగ్యాన్ని గమనిస్తూ ఉండాలి. నిత్యం ఒత్తిడిని ఎదుర్కొనేవారు... నిద్రలేమితో బాధపడుతున్నవారు మరింత ప్రమాదంలో ఉన్నట్టు. కుటుంబంలో గుండెజబ్బు చరిత్ర ఉన్నవారు తరచూ వైద్యులను సంప్రదించాలి. 30 ఏళ్ల వయసులో, ఏడాదికి ఒకసారైనా గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి.

ఇదీ చూడండి: వామ్మో..! ఆ ఇంటికి 75 గదులు... 101 దర్వాజలు...

ABOUT THE AUTHOR

...view details