తెలంగాణ

telangana

నాబార్డుతో కలసి పని చేయడం వల్ల మంచి ఫలితాలు: హరీశ్​రావు

By

Published : Dec 22, 2022, 4:20 PM IST

Minister Harish rao on NABARD Cooperation : ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు కింద 10వ విడత సొమ్ము జమ అవుతుందని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. హైదరాబాద్​లోని ఓ హోటల్​లో నాబార్డ్​ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రణాళిక సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

minister Harish Rao
మంత్రి హరీశ్​రావు

Minister Harishrao on NABARD Cooperation: రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగి సీజన్​కు సంబంధించి ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం కింద 10వ విడత పెట్టుబడి సొమ్ము జమ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇప్పటి వరకు 9 విడతల్లో రూ.52 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. హైదరాబాద్​లోని అమీర్‌పేట మ్యారీ గోల్డ్‌ హోటల్​లో నాబార్డ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రణాళిక సదస్సుకు మంత్రి హరీశ్​రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందనరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇతర బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 2023-24 నాబార్డ్ క్రెడిట్ ప్లాన్ మంత్రి హరీశ్​రావు​ ఆవిష్కరించారు. కరోనా సమయంలో మంత్రుల జీతాలు ఆపినా.. రైతుబంధు మాత్రం ఆపలేదని మంత్రి గుర్తు చేశారు. రైతుబంధు చూసిన తర్వాత కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తున్న నాబార్డుకు కృతజ్ఞతలు తెలిపారు. తాను మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గోదాంల నిర్మాణం కోసం నాబార్డు అండగా నిలిచిందని హరీశ్​రావు కొనియాడారు. రాష్ట్రంలో గోదాం నిర్మాణం పూర్తి చేసి సామర్థ్యం పెంచామని.. ఎరువుల బస్తాల నిల్వలకు ఇబ్బంది లేకుండా ఉందని తెలిపారు.

ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు సహా మిషన్ కాకతీయ, ఇరిగేషన్ ప్రాజెక్టులకు నాబార్డుతో కలిసి పని చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. వ్యవసాయంలో పెద్ద ఎత్తున యాంత్రీకరణ ప్రోత్సహించడం వల్ల 3 లక్షల 82 వేల ట్రాక్టర్లు అందుబాటులోకి వచ్చాయని ప్రకటించారు. కేవలం నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కోసం రూ.35 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. వ్యవసాయ రంగంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం కాబట్టే దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నామని తెలిపారు. జీఎస్డీపీలో వ్యవసాయ రంగం 19 శాతం వాటా సాధించగా.. రాష్ట్ర వ్యవసాయ వృద్ధి రేటు 10 శాతం సాధించినట్లు తెలిపారు. నాబార్డు, ప్రభుత్వం అందిస్తున్న అనేక కార్యక్రమాలతోనే ఇంతటి వృద్ధి రేటు సాధించామని మంత్రి అభిప్రాయపడ్డారు. వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంగా సీఎం ఆయిల్ పామ్ పంట సాగుకు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details