ETV Bharat / state

రైతుబంధు నిధుల కోసం మరో రూ.2 వేల కోట్ల అప్పు తీసుకోనున్న సర్కార్​..

author img

By

Published : Dec 22, 2022, 2:49 PM IST

Rythubandhu Funds : రైతుబంధు చెల్లింపులకు అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. యాసంగి సీజన్ పెట్టుబడి సాయాన్ని ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిధుల సమీకరణ విషయమై ఆర్థికశాఖ దృష్టి సారించింది. సొంత రాబడులతో పాటు రుణ పరిమితికి లోబడి తీసుకునే రుణాల ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.

Rythubandhu
Rythubandhu

మరో రెండు వేల కోట్ల వరకు అప్పు తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం

Rythubandhu Funds : యాసంగి సీజన్ పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు నిధులను ఈ నెల 28 నుంచి చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. ఈ సీజన్‌లో రైతుబంధు కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.7,600 కోట్ల నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కేంద్రం నుంచి వివిధ రూపాల్లో రావాల్సిన నిధుల్లో తగ్గుదల, రుణ పరిమితికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పుల్లో కోత నేపథ్యంలో రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇక్కట్లు ఎదురయ్యాయి. సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంచనాలకు అనుగుణంగానే ఉంది. సగటున ప్రతి నెలా రూ.10 వేల కోట్ల మార్కును అధిగమిస్తోంది. అయితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగినంతగా రాకపోవడంతో పాటు అప్పుల్లో కోతతో సర్కార్ ప్రణాళికకు ఇబ్బంది ఏర్పడింది.

ఎఫ్ఆర్​బీఎంకి లోబడి తీసుకునే రుణాల్లో కేంద్రం రూ.15 వేల కోట్లను కోత విధించింది. ఇతర రూపాల్లోనూ రావాల్సిన నిధుల్లోనూ కోత ఉందని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.40 వేల కోట్ల తగ్గుదల ఉందని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది. ఈ పరిస్థితుల్లో కేవలం 15 రోజుల్లో రూ.7,600 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయడం ఆర్థిక శాఖకు సవాలుగా మారింది. సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, ఆసరా పింఛన్లు, నిర్వహణ వ్యయం ఇతరత్రాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. మిగిలిన నిధులను ఇతర సంక్షేమ, అభివృద్ధి పథకాలకు వినియోగించుకుంటుంది. కొద్ది కాలంలోనే ఏకంగా రూ.7,600 కోట్లను సర్దుబాటు చేయాల్సి రావడంతో ఆర్థికశాఖ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఖజానాల్లో అందుబాటులో ఉన్న మొత్తంతో పాటు రుణాల ద్వారా కొంత మొత్తాన్ని సమకూర్చుకొని రైతుబంధు కోసం అవసరమైన నిధులను సర్దుబాటు చేసుకునే పనిలో పడింది. 28న ఒక్కో ఎకరం భూమి ఉన్న వారితో రైతుబంధు సాయాన్ని ప్రారంభించి... రోజుకు ఎకరం చొప్పున పెంచుకుంటూ పోయి సంక్రాంతి నాటికి చెల్లింపులు పూర్తి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు, అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా అవసరమైన నిధులను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్​ఆర్​బీఎం పరిధికి లోబడి ఇప్పటి వరకు రూ.26 వేల కోట్లు అప్పుగా తీసుకుంది.

ప్రస్తుత త్రైమాసికంలో మరో రూ.2 వేల కోట్ల వరకు అప్పు తీసుకునే అవకాశం ఉంది. దీంతో రేపు రిజర్వు బ్యాంకు ద్వారా ఆ మొత్తానికి బాండ్లు జారీ చేసి మంగళవారం వేలం వేయనున్నారు. జనవరి ఒకటో తేదీన నాలుగో త్రైమాసికం ప్రారంభం కానుంది. దీంతో రుణ పరిమితికి లోబడి తీసుకునే అప్పులో మిగిలిన మొత్తాన్ని కూడా తీసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి కలుగుతుంది. జనవరి మొదటి రెండు వారాల్లో మరికొంత మొత్తాన్ని రుణాల ద్వారా సేకరించుకొని రైతుబంధు చెల్లింపులను పూర్తి చేయాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.