తెలంగాణ

telangana

Paddy Procurement in TS : వర్షాలకు పడ్డ తిప్పలు చాలవా స్వామి.. అమ్మకానికి అవస్థలు పడాలా..?

By

Published : May 20, 2023, 2:19 PM IST

Crop Loss In Telangana

Paddy Procurement Issues in Telangana : రాష్ట్రంలో రైతులను కష్టాలు వీడటం లేదు. వర్షాలు తగ్గినా.. ఈదురు గాలులు, అకాలవర్షాల భయాలు రైతుల్లో ఇంకా తొలగిపోలేదు. ఎప్పుడు వర్షం కురుస్తుందో..? ఏ సమయాన ఈదురు గాలులు వస్తాయో? తెలియక బిక్కుబిక్కు మంటు రైతన్నలు రోజులు గడుపుతున్నారు. చేతికొచ్చిన పంట ఏం అవుతుందో అనే భయం కొందరిదైతే.. కల్లాల్లో, కొనుగోలుకేంద్రాల్లో ధాన్యం రాశులు పోసి అమ్మకం కోసం రోజుల పాటు నిరీక్షిస్తున్న వారు మరికొందరు. దీనికి తోడు పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణ కొరవడంతో అన్నదాతలు ధాన్యం అమ్మడానికి నానా అవస్థలు పడుతున్నారు.

ధాన్యం అమ్మకానికి నానా కష్టాలు పడుతున్న రైతులు

Paddy Procurement Issues in Telangana : దుక్కిదున్ని, నీరుపెట్టి, నాటు వేసి, కలుపుతీసి, కోతకోసి.. వరిపంటను పండించే రైతు ఆ ధాన్యాన్ని అమ్ముకోవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ధాన్యాన్ని అమ్ముకోవడానికి ప్రతి సీజన్‌లోనూ కష్టాలు తప్పడం లేదు. ఈ ఏడాది వానాకాలం మార్కెటింగ్ సీజన్‌ ఒకఎత్తైతే.. తాజా యాసంగి సీజన్‌ మరోఎత్తుగా మారింది. ఈ క్రమంలో ప్రత్యేకించి వరి పంట పరిస్థితి దారుణంగా మారింది. పంట చేతికొస్తుందనుకునే సమయంలో మార్చి 19 నుంచి వరుసగా పడిన అకాల వర్షాలు, ఈదురు గాలులు పంట, ధాన్యాన్ని దెబ్బతీశాయి.

Paddy Procurement Problems in Telangana : ఇక కొనుగోలు కేంద్రాల్లోకి వరిధాన్యాన్ని రాశిగా పోసి 15 నుంచి 20 రోజులు గడుస్తున్నా.. రైతులకు టోకెన్లు జారీ కావడం లేదు. కూలీల కొరత అధిగమించేందుకు హార్వెస్టర్లపై ఆధారపడితే వాటికి గంటకు రూ. 2100 నుంచి రూ.3500 ఖర్చు చేయాల్సి వస్తోంది. మరోవైపు కల్లాలోని వరిధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఒక్కోకూలీకి రూ. 500 నుంచి రూ.600వరకు రైతులు ఖర్చు చేస్తున్నారు. యాసంగి సీజన్‌లో 80 లక్షల 46 వేల 230 టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 25 లక్షల 35 వేల టన్నులే పౌరసరఫరాల సంస్థ సేకరించింది.

Crop Damage in Telangana : 32 జిల్లాల్లో మొత్తం 7వేల 183 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇందిరా క్రాంతిపథం, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు పీఏసీఎస్​లు కలిపి 6వేల 609 కేంద్రాలు ప్రారంభించారు. మొత్తంగా 3.75 లక్షల మంది రైతుల నుంచి సేకరిచిన ధాన్యం విలువ రూ.5వేల 211 కోట్లు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి తూకం వేయించిన తర్వాత కూడా రైతుల కష్టాలు తీరడం లేదు. తూకం వేసిన ధాన్యం లారీలో లోడింగ్ చేసేందుకు 5, 6 రోజులు సమయం పడుతోంది.

Crop loss compensation cheque : మార్చి నుంచి ఇప్పటి వరకూ పలుమార్లు కురిసిన వర్షాలతో 12 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరితో సహా మిగత పంటలు దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి ఒక్క వరి పంట 7.5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో భారీగా దెబ్బతిన్నట్లు సమాచారం. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం మొలకలు వస్తున్నా.. రైతులను పట్టించుకునే నాథుడే లేడు. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్​.. ఎకరాకు రూ.10 వేలు నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు.

కానీ నేటికి రాష్ట్రంలోని ఏ ఒక్క రైతుకు ఆ సొమ్ము అందలేదు. కనీసం ప్రధానమంత్రి పంటబీమా పథకం అమల్లో ఉన్నా రైతులకు కొంతలో కొంత అయినా నష్టపరిహారం అందేదని రైతు సంఘాలు చెబుతున్నాయి. అకాల వర్షాలతో ఇప్పటికే నష్టాల బారీన పడిన అన్నదాతకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details