maize farmers problemes : దిగుబడి 40 క్వింటాళ్లు.. కొనేది 26 క్వింటాళ్లు.. మక్కలపై సర్కార్ రూల్

author img

By

Published : May 17, 2023, 9:04 AM IST

maize farmers

maize farmers problemes in Warangal : మక్క రైతులు అధిక దిగుబడులతో పంటను పండించటమే వారి పాలిట శాపంగా మారింది. ఎకరాకు 26 క్వింటాళ్లే కొనుగోలు చేస్తామంటున్న అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల పేరిట రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందంటూ.. మండిపడుతున్నారు. అకాల వర్షాలకు ఇబ్బందులుపడ్డ తమను సర్కారు ఇరకాటంలోకి ఎందుకు నెడుతోందంటూ ప్రశ్నిస్తున్నారు.

26 క్వింటాళ్ల నిబంధనపై భగ్గుమంటున్న అన్నదాతలు

maize farmers problemes in Warangal : అకాల వర్షాల తిప్పలు ఎదుర్కొన్నా మక్కరైతుకు.. పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌లోనూ కష్టాలు తప్పడం లేదు. హనుమకొండ జిల్లా పరకాల డివిజన్‌ వ్యాప్తంగా పత్తి పంట తీసేసిన తర్వాత ఎక్కువ మొత్తంలో రైతులు మొక్కజొన్నసాగు చేశారు. పంట దిగుబడి కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ అమ్ముకోవాలంటే ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై రోజులు గడుస్తున్నా.. కొనుగోలు కేంద్రాల నిర్వహణ లోపంతో కాంటాలు కావడం లేదు.

"మా దగ్గర రెండు ఎకరాలు పొలం ఉంది. కానీ యాప్​లో మాత్రం కేవలం 26క్వింటాళ్లు చూపిస్తోంది. పంట ఎంత తీసుకొస్తే అంత తీసుకొవాలి. ప్రభుత్వం మాత్రం అలా కాకుండా కేవలం 26 క్వింటాళ్లు మాత్రమే తీసుకుంటాం అంటే ఎలా.. రైతులు దొంగతనం చేసి పంట తీసుకొని రావడం లేదు కదా". - మొక్కజొన్న రైతు

మిగతా పంట ఏం చేయాలి: రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురు చూడాల్సిన పరిస్థితి. పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తుందని ప్రభుత్వం గొప్పలు చెప్తుంది తప్ప ఆచరణలో మాత్రం ఇబ్బందులకు గురిచేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఎకరాకు 26 క్వింటాళ్లే కొనుగోలు చేస్తామని మిగతా పంట తమకు సంబంధం లేదని చెప్పడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరకాల డివిజన్‌ వ్యాప్తంగా మొక్కజొన్న పంట ఎకరాకు సుమారు 40 క్వింటాలుకు పైగా దిగుబడి వచ్చింది.

ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్మితే ధర ఇష్టానుసారంగా పెట్టి మోసం చేసే పరిస్థితులు ఉన్నాయని మార్కెట్‌కు తీసుకువస్తే నిబంధనల పేరుతో వేధిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం ఇచ్చిన సూచనలకు అనుగుణంగానే కొనుగోలు చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటను సైతం ఎలాంటి నిబంధనలు పెట్టకుండా కొనుగోలు చేయాలని మక్క రైతులు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. మండిపోతున్న ఎండలకు మార్కెట్‌లో సరైన సౌకర్యాలు లేక మగ్గిపోతున్నామని కొనుగోళ్ల వేగాన్ని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

"ప్రభుత్వం నీళ్లు, నిధులు, రైతు బంధు ఇస్తున్నామని అంటున్నారు. రైతు పండించిన పంటను మాత్రం పూర్తిగా తీసుకొలేకపోతున్నారు. ప్రభుత్వం కేవలం 26 క్వింటాళ్లే తీసుకుంటామంటే ఎలా.. మిగతా మక్కలు ప్రైవేట్​ దళారులకు అమ్మితే మద్దతు ధర లేకుండా పోతుంది. దీంతో చాలా నష్టం ఏర్పడుతోంది."- మొక్కజొన్న రైతు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.