కర్ణాటక సీఎం రేసులో మరో కీలక నేత.. మద్దతుగా భారీ ర్యాలీ.. ఎవరంటే?

🎬 Watch Now: Feature Video

thumbnail

Karnataka CM : కర్ణాటక సీఎం రేసులో మరో కీలక నేత పేరు తెరపైకి వచ్చింది. తుమకూరు జిల్లా కొరటగెరె ఎమ్మెల్యే పరమేశ్వర్‌ను సీఎం చేయాలంటూ భారీ నిరసన ర్యాలీ చేపట్టారు ఆ జిల్లా కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తలు. దళిత వర్గానికి చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. ముఖ్యమంత్రి పదవికి పరమేశ్వర్‌ పేరును కూడా పరిశీలించాలంటూ కాంగ్రెస్​ హైకమాండ్​ను డిమాండ్​ చేశారు. జిల్లాలో పార్టీని పటిష్ఠం చేసేందుకు ఆయన అన్ని విధాలా కృషి చేశారని కార్యకర్తలు తెలిపారు. తుమకూరు నగరంలోని కాంగ్రెస్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ భద్రమ్మ సర్కిల్‌ వరకు కొనసాగింది. ఇప్పటికే ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు పరమేశ్వర్​. ఈయన ఇటీవలే జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కొరటగెరె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

నేను సిద్ధంగా ఉన్నా..
ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే పరమేశ్వర్​ స్పందించారు. సీఎం పగ్గాలు చేపట్టమని పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే తాను ఆ బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం తాను ఏ విధంగా కృషి చేశానో అధిష్ఠానానికి తెలుసునని.. సీఎం పదవి కోసం లాబీయింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.

100% సిద్ధరామయ్యే సీఎం: ఎమ్మెల్యే కేఎన్ రాజన్న
కర్ణాటక సీఎం కుర్చీలో కూర్చునేందుకు సిద్ధరామయ్యకే పూర్తి అవకాశాలు ఉన్నాయని.. 100 శాతం ఆయనే ముఖ్యమంత్రి అవుతారని మధుగిరి ఎమ్మెల్యే కేఎన్ రాజన్న విశ్వాసం వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య వైపే హైకమాండ్ మొగ్గు చూపుతోందని ఆయన అన్నారు. అధిష్ఠానం అందరి ఆలోచనలు పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటుందని.. ఇందుకు శివకుమార్ కూడా సహకరిస్తారనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. మంగళవారం సీఎం అంశంపై పూర్తి స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు. మే 18న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయవచ్చని అన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.