Crop loss due to rains: అన్నదాతల ఆశలపై వాన జల్లు.. చేతికొచ్చిన పంట వర్షార్పణం

author img

By

Published : Oct 18, 2021, 4:27 PM IST

Crop loss due to rains, farmers problems

బతుకమ్మ, దసరా పండుగ సంబరాల్లో అందరుంటే.. అన్నదాతలు మాత్రం పంట చేనులో దీనంగా ఉండాల్సిన పరిస్థితి. కళ్ల ముందే ఏడాది కష్టం.. నీటిపాలు కావడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పంట ఉత్పత్తులు ఇంటికి రాకముందే.. కురిసిన వర్షాలు అన్నదాతలను అతలాకుతలం(Crop loss due to rains) చేశాయి. ఈ ఏడాది వరుస వర్షాలతో సోయాలో ఆశించిన దిగుబడి రాలేదు. వచ్చినా అరకొర దిగుబడి ఇంటికి చేరకముందే తడిసిపోవడంతో వాటిని ఆరబెట్టుకునే పనిలో రైతులు ఉన్నారు.

అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు పడే కష్టం అంతా ఇంతా కాదు. చెమటలు ధారపోసి ఆరుగాలం కష్టపడినా... తీరా పంట చేతికొచ్చే సమయంలో అన్నదాతల ఆశలపై(Crop loss due to rains) వాన జల్లు కురుస్తోంది. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పంట కోతలు ప్రారంభంకాగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు రైతన్నకు నష్టాలే మిగుల్చుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా 70 వేల ఎకరాల్లో రైతులు సోయా పంట సాగు చేస్తున్నారు . ఇప్పటికే కొంతమంది రైతులు పంట కోత కోసి ధాన్యం ఇంటికి తీసుకురాగా... మరికొంతమంది స్థానికంగా ఉన్న మార్కెట్ యార్డులకు తరలించి పంటను ఆరబెడుతున్నారు. అకాల వర్షాలతో పంట తడిసి బూజు పడుతోంది. మొలకలు రావడం, రంగు మారడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

ఇప్పటికే దాదాపుగా 10 వేల ఎకరాలకు పైగా సోయా పంటకు నష్టం(Crop loss due to rains) వాటిల్లినట్లు తెలుస్తోంది. వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి... తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో కురిసిన వర్షాల వల్ల చాలా వరకు పంట నష్టం జరగ్గా... ప్రస్తుతం చేతికొచ్చిన పంట బూజు పట్టి, కుళ్లి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

నాకున్న 6 ఎకరాల భూమిలో సొయా పంట వేశాను. 50 క్వింటాళ్లు దిగుబడి రాగా... పంటను ఇచ్చోడ మార్కెట్ యార్డులో ఆరబెట్టాను. గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి 20 క్వింటాళ్ల సోయా తడిసిముద్దయింది. మొత్తం బూజు పట్టింది.

-గుమ్మడి భీంరెడ్డి, రైతు

నాకున్న 10 ఎకరాల్లో సోయా పంట వేశాను. 80 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. పంటను ఆరబెట్టేందుకు ఇచ్చోడ మార్కెట్ యార్డుకు తీసుకురాగా... వర్షం కురవడంతో 30 క్వింటాళ్ల సోయా తడిసి బూజు పట్టింది. పెట్టుబడి అంతా వర్షార్పణం అయింది.

-మహేష్, రైతు

జిల్లాలో ఇటీవల కురిసిన వర్షానికి 10 వేల ఎకరాలకు పైగా సోయా పంటకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ప్రకటించిన ధరకే పంటను కొనుగోలు చేయాలి. రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలి. మార్కెట్ యార్డుకు పంటను తీసుకొచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు.

-సంగెం బొర్రన్న, రైతు వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు

వర్షపాతం ఇలా..

జిల్లాలో ఇప్పటికే సాధారణం కంటే 36 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఆదివారం నాటికి సాధారణ వర్షపాతం 1065.9 మిల్లీమీటర్లు కాగా.. 1447.4 మి.మీలు కురిసింది. జిల్లాలోని నాలుగు మండలాల్లో 60శాతానికి మించి ఎక్కువ కురిసింది. 8 మండలాల్లో అధికంగా వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తంలో ఆదివారం సగటున 18మి.మీలు కురవగా.. అత్యధికంగా తాంసిలో 58.5మిమీలు పడింది. బజార్‌హత్నూర్‌లో 40.7, నేరడిగొండలో 35.2, ఇచ్చోడలో 30.3, బోథ్‌లో 26.4మిమీలు కురిసింది.

అధికారుల స్పందన కరవు

జిల్లాలో కురుస్తున్న వర్షాలతో జరుగుతున్న పంట నష్టాన్ని(Crop loss due to rains) ఇప్పటి వరకు అధికారులు గుర్తించనేలేదు. రెండేళ్లుగా పంటలకు జరిగే నష్టానికి సంబంధించి ఎలాంటి పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీలు ఇవ్వలేదు. ఈ వానాకాలంలో సీజన్‌లోనూ ప్రభుత్వం పంట నష్టంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో.. అధికారులు సర్వే చేయలేదు. గతంలో అమలు చేసిన వాతావరణ ఆధారిత బీమా లేకపోవడంతో అన్నదాతలకు బీమా పరిహారం రాని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పంట నష్టం సర్వేపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోవడంతో.. పరిహారం వచ్చేలా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

అన్నదాతల ఆశలపై వాన జల్లు

ఇదీ చదవండి: Need financial help: మంచానికే పరిమితమైన తండ్రీకొడుకు.. ఆమె రెక్కల కష్టమే ఆధారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.