తెలంగాణ

telangana

BBL Playoff Match: ఆఖరి బంతికి ఇలా కూడా చేస్తారా?

By

Published : Jan 27, 2022, 4:11 PM IST

BBL Playoff Match: ఆస్ట్రేలియాలో నిర్వహించే బిగ్​బాష్​ లీగ్​ తుది అంకానికి చేరుకుంది. అయితే.. ప్లేఆఫ్స్‌లో బుధవారం అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, సిడ్నీ సిక్సర్స్‌ జట్ల మధ్య మ్యాచ్​లో ఓ అనూహ్య ఘటన జరిగింది. చివరి బంతికి ముందు సిడ్నీ సిక్సర్స్​ ఆటగాడిని మార్చడం చర్చనీయాంశమైంది.

sydney
సిడ్నీ

BBL Playoff Match: క్రికెట్‌లో అప్పుడప్పుడు భిన్నమైన సంఘటనలు చోటుచేసుకోవడం పరిపాటే. అవి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేయడమూ సహజమే. ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకొంది. ఆస్ట్రేలియాలో నిర్వహించే బిగ్‌బాష్‌ లీగ్‌ తుది అంకానికి చేరింది. ప్లేఆఫ్స్‌లో బుధవారం అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, సిడ్నీ సిక్సర్స్‌ జట్లు ఫైనల్‌ బెర్తు కోసం తలపడ్డాయి. ఈ సందర్భంగా మ్యాచ్‌ చివరి బంతికి ముందు సిడ్నీ సిక్సర్స్‌ జట్టు అనూహ్య రీతిలో ప్రవర్తించింది. దీంతో ఇప్పుడది చర్చనీయాంశంగా మారింది.

బిగ్‌బాష్‌లో ఫైనల్‌ చేరాలంటే ఈ మ్యాచ్‌ ఆఖరి బంతికి సిడ్నీ జట్టు రెండు పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పటికి ఓపెనర్‌ హేడెన్‌ కెర్ర్‌ (94; 57 బంతుల్లో 9x4, 2x6), జోర్డాన్‌ సిల్క్‌ (1; 1 బంతికి) పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే, హేడెన్‌ చివరి బంతిని ఎదుర్కోవాల్సి ఉండగా నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న జోర్డాన్‌ను ఆ జట్టు రిటైర్డ్‌ హార్ట్‌గా వెనక్కి పిలిచింది. అతడికి బదులు జే లెంటన్‌ను నాన్‌స్ట్రైకింగ్‌కు పంపించింది. కాగా, లెంటన్‌ సిడ్నీ జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా సేవలందిస్తుండటం గమనార్హం. జట్టులో పలువురికి కోవిడ్‌ సోకడంతో అక్కడి నియమాల ప్రకారం లెంటన్‌ను ఆడించింది సిడ్నీ జట్టు. చివరికి హేడెన్‌ బౌండరీ సాధించి ఆ జట్టును గెలిపించాడు.

అయితే, ఆఖరి బంతికి సిడ్నీ జట్టు అలా బ్యాట్స్‌మన్‌ను మార్చడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. తాము క్రికెట్‌ నిబంధనల మేరకే ప్రవర్తించామని సిడ్నీ జట్టు చెబుతుండగా.. అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పలువురు క్రికెట్‌ అభిమానులు వాదిస్తున్నారు. 'గాయంతో ఇబ్బంది పడే ఆటగాడిని మార్చడం నిబంధనల ప్రకారమే అయినా అది క్రీడాస్ఫూర్తికి తగినట్లుగా లేదు' అని ఆసీస్‌ మాజీ ఆటగాడు మార్క్‌వా పేర్కొన్నాడు. కాగా, అంతకుముందు కూడా సిడ్నీ జట్టు ప్లేఆఫ్స్‌లో స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ను ఆడించాలని చూసింది. అయితే, అది నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. దీంతో ఇప్పుడు చాలా మంది ఆ జట్టు తీరును ప్రశ్నిస్తున్నారు. ఇక శుక్రవారం పెర్త్‌ స్కార్చర్స్‌తో సిడ్నీ సిక్సర్స్‌ ఫైనల్లో తలపడనుంది.

ABOUT THE AUTHOR

...view details