తెలంగాణ

telangana

కరోనా ఎఫెక్ట్​: 'సైకిల్​'కు ఇక స్వర్ణ యుగమే!

By

Published : Jul 18, 2020, 5:27 PM IST

కరోనాతో ప్రపంచం మళ్లీ వెనక్కి వెళ్తోంది. సైకిల్​కు పూర్వ వైభవం వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన పెరిగి.. మళ్లీ సైకిల్​ ట్రెండ్ మొదలవుతోంది. ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహకాలు అందించడం వల్ల ఎన్నడూ లేని డిమాండ్ సైకిళ్లకు ఏర్పడింది.

Bicycle to act as instrument of change in post-COVID-19 era
కరోనా ఎఫెక్ట్​- 'సైకిల్​'కు ఇక స్వర్ణ యుగమే!

  • 'సమీప భవిష్యత్తు సైకిళ్లకు స్వర్ణ యుగం కావాలి' ఇటీవల బ్రిటన్ ప్రధాని పార్లమెంట్​లో చేసిన వ్యాఖ్య.
  • 'రోడ్​పే దిఖేగీ.. తబీతో చలేగీ' ప్రముఖ సైకిల్ తయారీదారు హీరో సైకిల్స్ రెండేళ్ల నాటి ప్రచార నినాదం.

ఇవన్నీ రోడ్లపై సైకిళ్లను పరిగెత్తించి వాటికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నాలే. రోడ్లపై ప్రత్యేక సైకిల్ మార్గం ఉండాలని 'హీరో' సంస్థ నొక్కి చెప్పిన సందర్భమూ అదే.

అయితే ఇప్పుడు ప్రపంచం ఈ రెండు చక్రాల రథం వంకే చూస్తోంది. కరోనా నేపథ్యంలో ఎలాంటి ప్రచారాలు లేకుండానే సైకిల్ ట్రెండ్ ఊపందుకుంది.

స్వర్ణయుగం వచ్చినట్లేనా!

కరోనా వల్ల వ్యక్తిగత దూరం పాటించాల్సి వస్తోంది కాబట్టి ఉద్యోగాలకు వెళ్లేందుకు చాలా మంది ప్రజా రవాణా కంటే ద్విచక్ర వాహనాలవైపే మొగ్గుచూపుతున్నారు. పలు దేశాల ప్రభుత్వాలు ఉద్యోగులకు ఇలాంటి అభ్యర్థనలే చేస్తున్నాయి. 'నడక, ద్విచక్ర వాహనాలకే ప్రాధాన్యం ఇవ్వండి... చివరి ప్రయత్నంగా మీ ప్రైవేట్ కార్లను ఉపయోగించండి' అంటూ యూరోపియన్ పార్లమెంట్ ఉద్యోగులకు మెమో జారీ చేసింది. భౌతిక దూరం పాటించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం సైక్లింగ్​ను సిఫార్సు చేసింది.

ఇదీ చదవండి-సామాన్యుని రథం 'సైకిల్'తో ఇన్ని లాభాలా?

సైక్లింగ్​ వల్ల ఆర్థికంగా, పర్యావరణ పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కాలుష్యం తగ్గించడానికి సైకిళ్లను ఉపయోగించాలని గతంలో ప్రభుత్వాలే అభ్యర్థించిన దాఖలాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం మార్పు దానికదే రాబోతోంది. ఒకరికొకరు దూరం పాటిస్తూ సురక్షితమైన ప్రయాణం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి రవాణా తీరు కనీసం కొంతవరకైనా మారే అవకాశం ఉంది.

ప్రజా రవాణాలో భౌతిక దూరం?

కరోనా కట్టడికి భౌతిక దూరం ప్రధాన ఆయుధం. కానీ... ప్రజారవాణాలో భౌతిక దూరం చాలా కష్టం. ఒకవేళ నిజంగా సాధ్యం కావాలంటే...

  • దిల్లీ మెట్రో సర్వీసులు ఆరు రెట్లు పెరగాలి.
  • ముంబయి సబర్బన్ రైల్వే 14-16 రెట్లు విస్తరించాలి.
  • బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్​పోర్ట్ కార్పొరేషన్​కు అదనంగా 24 వేల బస్సులు కావాలి.

ప్రస్తుతం తక్కువ సామర్థ్యంతో ప్రజారవాణా నడుస్తోంది కాబట్టి రహదారులపై ప్రత్యామ్నాయం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో సైకిల్​ ఆదర్శవంతమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.

సైకిల్​పై సురక్షితంగా దూసుకుపోండి..

ఆదర్శమే కానీ..

సైకిల్ ఆదర్శవంతమే కానీ వీటిని పెద్ద ఎత్తున వాడేలా చేయడం సులభం కాదు. సురక్షితంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా సైకిల్ చోదకులు రోడ్లపై వెళ్లాలంటే.. మోటార్ వాహనాలతో సంబంధం లేకుండా ప్రత్యేకమైన రహదారి వ్యవస్థను ఏర్పాటుచేయాల్సి ఉంటుంది.

సైకిల్​తో ఆరోగ్యం- ఆహ్లాదం

ఇదీ చదవండి-కరోనా కాలంలో సైకిల్​తో సావాసమే నయం!

డెన్మార్క్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో విస్తృతమైన ఇంటర్​సిటీ సైకిల్ దారులు ఉన్నాయి. ఫియెట్స్​పాడ్​ పేరుతో నెదర్లాండ్స్ పగడ్బందీగా సైకిల్ మార్గాన్ని ఏర్పాటు చేసింది. దుకాణాలు, ఇళ్లు, పాఠశాలలు, కార్యాలయాలను అనుసంధానిస్తూ వీటిని నిర్మించింది.

సైకిల్​ చోదకులకు ప్రత్యేక దారి

వేగంగా సైకిల్​ వైపు

ఇప్పుడు కొవిడ్-19 వల్ల ప్రపంచం మరింతగా సైకిళ్లవైపు మొగ్గుచూపుతోంది. 'తబీతో చలేగీ' అనే పంథా అవలంబిస్తోంది. నగరాలన్నీ సైకిల్ మార్గాలను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నాయి.

  • మే నెలలో న్యూయార్క్​లో 40 మైళ్ల సైకిల్ దారులను ఏర్పాటు చేశారు.
  • బొగొటా(కొలంబియా రాజధాని)లో 76 కిలో మీటర్ల మార్గాన్ని సైక్లింగ్​ కోసం నిర్మించారు.
  • ఆక్లాండ్​లో కార్ పార్కింగ్ స్థలాన్ని తొలగించి ఆ ప్రాంతంలో 17 కి.మీల తాత్కాలిక బైక్​ లేన్​ను ఏర్పాటు చేశారు.
  • మిలాన్​లో ఉన్న 35 కి.మీ. వీధి రహదారులను పాదచారులు, సైకిల్​ చోదకుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు అక్కడి యంత్రాంగం సిద్ధమైంది.
  • 650 కి.మీ 'పాప్​ అప్​ సైకిల్ వేస్'ను నిర్మించేందుకు పారిస్ నిర్ణయం తీసుకుంది.
  • నడక, సైక్లింగ్ కోసం 2 బిలియన్ పౌండ్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది.​

ఇలా భూమి మీద ఉన్న ప్రతి దేశం పాదచారులు, సైకిల్ చోదకుల కోసం తాత్కాలిక మార్గాలు ఏర్పాటు చేయడమో, ఉన్నవాటిని అభివృద్ధి చేయడమో మొదలుపెట్టాయి.

దేశంలో

భారత్​లోనూ కొద్దికొద్దిగా మార్పులు ప్రారంభమయ్యాయి. మోటారేతర వాహనాలు, పర్యావరణ హితమైన రవాణా కోసం బెంగళూరు, తిరువనంతపురం, చెన్నై, దిల్లీ వంటి నగరాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.

స్మార్ట్​ సిటీలో భాగంగా సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించే ప్రాజెక్టులు చేపట్టాలని 'సైకిల్స్​4ఛేంజ్​ ఛాలెంజ్​' రూపొందించింది గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. తొలి దశలో భాగంగా 10 నగరాల్లో ఈ ప్రాజెక్టు చేపట్టనుంది.

సైకిల్​- సామాన్యుడి రథం!

అమ్మకాల జోరు- ప్రభుత్వ ప్రోత్సాహకాలు

ప్రపంచవ్యాప్తంగా అవగాహన సైతం పెరుగుతుండటం వల్ల సైకిల్ వాడకం అధికమవుతోందని స్పష్టమవుతోంది. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి సైకిల్ తయారీ సంస్థలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. కొందరు తయారీదారులైతే తమకు అపరిమిత డిమాండ్ ఉందంటూ చెబుతున్నారు.

దీనికి తోడు ప్రభుత్వాలు సైతం సైకిళ్లు కొనాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి.

  • ఉద్దీపన పథకంలో భాగంగా ఇటలీ ప్రభుత్వం సైకిళ్లపై 60 శాతం వరకు రిబేట్ ప్రకటించింది. 50 వేల నివాసితులున్న నగరాల్లోని ప్రజలకు ఈ సదుపాయం కల్పించింది.
  • సైకిల్ మరమ్మతు కోసం ఫ్రాన్స్​ ప్రభుత్వం 50 యూరోలను అందిస్తోంది.
  • స్థానిక సంస్థలు సైతం పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.
  • ఫ్రాన్స్​లోని లైయన్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ సైకిల్, ఫోల్డింగ్ బైక్, కార్గో బైక్​లను కొనుగోలు చేసేవారికి 500 యూరోల వరకు సబ్సిడీ కల్పిస్తోంది.
  • పోర్చుగల్ రాజధాని లిస్బన్​లో కొత్త సైకిల్ కొనేవారికి నగదు ప్రోత్సాహకాలను అందిస్తోంది ప్రభుత్వం.

సవాళ్లు- పరిమితులు

భారత్​లోని పట్టణ ప్రాంత రహదారుల్లో 60 శాతం 5 కి.మీల లోపే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ప్రాంతాల్లో సైకిళ్ల ఉపయోగం చాలా ఉంటుంది. అయితే సైకిల్ విప్లవం అనేది మరీ అంత సులభం కాదు. 20 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాల్లోనే సైకిళ్లు ఎక్కువగా వాడుతున్నారు. నగర జనాభాను బట్టి సైకిల్ ప్రయాణాల శాతం తగ్గుతూ వస్తోంది.

కోల్​కతా వంటి నగరాల్లో మొత్తం రహదారుల వాటా 7 శాతం మాత్రమే ఉంది. ఇందులో సైకిళ్ల కోసం ప్రత్యేకంగా మార్గం ఏర్పాటు చేయడం చాలా కష్టం. ఇంకో విషయమేంటంటే సరళమైన ఈ ట్రాఫిక్ నియమాలను కూడా ఇక్కడి సైకిల్ చోదకులు అర్థం చేసుకోలేరు. ట్రాఫిక్ నియమాలు తమకు వర్తిస్తాయని కూడా అనుకోరు.

ఫిట్​నెస్ మంత్ర- సైకిల్

ఇవేకాక ఇంకా చాలా పరిమితులు ఉన్నాయి. వార్విక్​ విశ్వవిద్యాలయంలో పనిచేసే ఓ ప్రొఫెసర్ రోజూ సైకిల్​ ఉపయోగించి ఉద్యోగానికి వెళ్తుంటారు. ఇంటి నుంచి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్​ వరకు సైకిల్​పై వెళ్తారు. సైకిల్​ను తనతోపాటే రైల్లో తీసుకెళ్తారు. గమ్యస్థానంలోని రైల్వే స్టేషన్​కు చేరిన తర్వాత అక్కడి నుంచి తన యూనివర్సిటీకి సైకిల్​పై వెళ్తారు. ఇలా మన రైళ్లలో సైకిళ్లను తీసుకెళ్లే అవకాశం ఉంటుందా?

అయినప్పటికీ సైకిళ్లకు ఇప్పుడున్నంత డిమాండ్, ప్రోత్సాహం ఇదివరకెన్నడూ లేకపోవచ్చు.

(రచయిత-అతాను బిశ్వాస్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్​స్టిట్యూట్ ఆచార్యులు)

ABOUT THE AUTHOR

...view details