తెలంగాణ

telangana

2024 ఎన్నికలే టార్గెట్​.. 'భారత్ జోడో యాత్ర-2.0'కు రాహుల్ రెడీ.. ఆ తేదీ నుంచే స్టార్ట్!

By

Published : Jul 28, 2023, 7:41 PM IST

Updated : Jul 28, 2023, 7:56 PM IST

Bharat Jodo Yatra 2 : 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీ ఓటమే లక్ష్యంగా శాయశక్తులా పని చేస్తోంది కాంగ్రెస్. ఇందుకోసం పార్టీలో ఎంతో జోష్ నింపిన భారత్​ జోడో యాత్ర రెండో విడతను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది హస్తం పార్టీ. సెప్టెంబర్​ 5న గుజరాత్​లోని పోర్​బందర్​ నుంచి ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

bharat jodo yatra 2
bharat jodo yatra 2

Bharat Jodo Yatra 2.0 Start Date : కాంగ్రెస్​లో నూతన ఉత్సాహాన్ని నింపిన భారత్ జోడో యాత్ర 2.0ను ప్రారంభించేందుకు ప్లాన్​ చేస్తోంది హస్తం పార్టీ. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని ఈ యాత్రను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ యాత్రను సెప్టెంబర్​లో ప్రారంభించాలని భావిస్తోంది. ఈ అంశంపై సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర సమన్వయ కమిటీ గతవారం సమావేశమైంది. ఈ సమావేశంలో ముఖ్యంగా యాత్ర ప్రారంభ తేదీతో పాటు స్థలం ఎంపికపై తీవ్రంగా చర్చించారు నేతలు. అంతకుముందు దక్షిణాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన కశ్మీర్​ వరకు పాదయాత్ర సాగగా.. తాజాగా దేశ పశ్చిమం నుంచి తూర్పునకు యాత్ర చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది కాంగ్రెస్​. గుజరాత్​లోని పోర్​బందర్ నుంచి త్రిపురలోని అగర్తలా వరకు భారత్ జోడో యాత్ర 2.0ను చేపట్టాలని భావిస్తోంది హస్తం పార్టీ. సెప్టెంబర్​ 5న గుజరాత్ పోర్​బందర్​లోని మహాత్మ గాంధీ స్మారకం వద్ద నివాళులు అర్పించి పాదయాత్రను ప్రారంభించునున్నట్లు సమాచారం.

"పాదయాత్ర చేపడితే.. పూర్తి కావడానికి సుమారు 6 నెలల సమయం పడుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు నవంబర్​లో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరగనున్నాయి. కాబట్టి ఈ ఆరు నెలల సమయం పార్టీకి ఎంతో ముఖ్యమైనది. గతేడాది యాత్రలో మాకు చాలా సమయం ఉంది. అప్పుడు యాత్ర రూట్​లో లేని గుజరాత్, హిమాచల్ ప్రదేశ్​లో మాత్రమే ఎన్నికలు ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదు."
--ఏఐసీసీ సీనియర్​ నాయకుడు

Bharat Jodo Yatra Rahul Gandhi : అయితే, పూర్తి స్థాయి భారత్​ జోడో యాత్రకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రాల వారీగా యాత్రలు చేపట్టే ప్లాన్​ను హస్తం పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సమయాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ఆలోచన చేస్తున్నట్లు పార్టీ సీనియర్ నేత వెల్లడించారు. "ఈ రాష్ట్ర యాత్రలు చిన్న ప్రాంతాలతో పాటు తాము గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న పార్లమెంట్ స్థానాల మీదుగా వెళ్లేలా ప్లాన్ చేస్తాం. నవంబర్​లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సెప్టెంబర్​, అక్టోబర్​ నెలల్లో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం" అని చెప్పారు.

"భారతదేశ దక్షిణం నుంచి ఉత్తరానికి రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర అద్భుతంగా సాగింది. ఈ యాత్ర విజయంతో ప్రధాని మోదీని ఎదుర్కొనే బలమైన నేతగా రాహుల్​ కనిపించారు. ఇది ప్రతిపక్షాల ఐక్యతకు కూడా ఎంతో సహకరించింది."
-అమిత్​ ఛడ్వా, గుజరాత్​ సీఎల్​పీ నేత

మరోవైపు కొంతమంది నేతలు యాత్రను స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రారంభించాలని కోరుతున్నారు. ఆ రోజు ప్రారంభిస్తే దేశవ్యాప్తంగా భారీ ప్రచారం దక్కుతుందని చెబుతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందులు తలెత్తే అవకాశముందని భావించిన అధిష్ఠానం.. సెప్టెంబర్​కే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అప్పటికి వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల యాత్ర సాఫీగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

12 రాష్ట్రాల్లో తొలి విడత యాత్ర
కాగా, తొలి విడత భారత్ జోడో యాత్ర 2022 సెప్టెంబర్‌ 7న కన్యాకుమారిలో మొదలైంది. సుమారు 12 రాష్ట్రాల్లో సాగిన ఈ యాత్ర.. 2023 జనవరి 30న కశ్మీర్‌లోని లాల్‌చౌక్‌లో ముగిసింది. ఈ సుదీర్ఘ యాత్ర 145 రోజుల (దాదాపు 5 నెలలు)పాటు 3970 కి.మీ మేర సాగింది.

ఇవీ చదవండి :'భారత్ జోడో'తో కాంగ్రెస్​లో జోష్.. ఎన్నికల్లో జైత్రయాత్ర చేస్తుందా?

'భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్​ ముగిసింది'.. రాజకీయాలకు సోనియా గుడ్​బై?

Last Updated :Jul 28, 2023, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details