తెలంగాణ

telangana

Pegasus Software 'మా సాఫ్ట్​వేర్ దుర్వినియోగం నిజమే'

By

Published : Jul 24, 2021, 7:18 AM IST

కొంత మంది వినియోగదారులు పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను(Pegasus Software) దుర్వినియోగం చేసిన మాట వాస్తవమేనని దాని రూపకర్త షలీవ్ హులియో అంగీకరించారు. నాయకులపై నిఘా వ్యవహారం కొందరు చేసిన చెత్తపనిగా అభివర్ణించారు. తమ సాఫ్ట్‌వేర్‌ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ప్రాణాలు కాపాడిందో చెప్పగలమని... కానీ, ఆ విషయాలను ప్రస్తావించదలుచుకోలేదని షలీవ్‌ పేర్కొన్నారు.

Israeli firm NSO founder responce after Pegasus row
పెగాసస్ వ్యవస్థాపకుడు

భారత్‌ సహా ప్రపంచ దేశాల్లోని నాయకుల ఫోన్లపై నిఘా పెట్టిన వ్యవహారంపై పెగాసస్‌(Pegasus Software) రూపకర్త ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ వ్యవస్థాకుడు షలీవ్‌ హులియో స్పందించారు. ఆయన 'ది వాషింగ్టన్‌ పోస్టు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ కంపెనీ ఎంతో మంది జీవితాలను కాపాడిందని చెప్పుకొచ్చారు. నాయకులపై నిఘా వ్యవహారం కొందరు చేసిన చెత్తపనిగా ఆయన అభివర్ణించారు. జాతీయ భద్రత, నిఘా సంస్థల రోజువారీ పనిపై మరింత అవగాహన రావాల్సి ఉందన్నారు. ఈ విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన గురించే మాట్లాడటం తనను బాధపెడుతోందన్నారు.

దుర్వినియోగం నిజమే

తమ సాఫ్ట్‌వేర్‌ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ప్రాణాలు కాపాడిందో చెప్పగలమని... కానీ, ఆ విషయాలను ప్రస్తావించదలుచుకోలేదని షలీవ్‌ వెల్లడించారు. కొంత మంది వినియోగదారులు తమ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కానీ, ఆయన ఎవరి పేరును వెల్లడించలేదు. సౌదీ, దుబాయ్‌, మెక్సికోలోని కొన్ని ఏజెన్సీలకు సహా ఐదుగురు కస్టమర్లకు ఈ సాఫ్ట్‌వేర్‌ విక్రయించడం ఆపేశామన్నారు.

'పెగాసస్​ను మూసేస్తా!'

అసాంఘిక శక్తుల ఆటకట్టించడానికే దీనిని తయారు చేసినట్లు వెల్లడించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను వాడి మెక్సికో మాదకద్రవ్యాల ఎగుమతిదారు ఎల్‌ ఛాపోను రెండు సార్లు అరెస్టు చేసిందన్నారు. "క్రిమినల్స్‌, ఉగ్రవాదుల సమాచారం సంపాదించి వారి ఆటకట్టించేందుకు ఇంతకంటే మంచి మార్గం ఎవరైనా సూచిస్తే.. నా కంపెనీని, పెగాసస్‌ను పూర్తిగా మూసివేస్తాను" అని షలీవ్‌ పేర్కొన్నారు.

ఎన్‌ఎస్‌వో కంపెనీని స్మార్ట్‌ఫోన్లలో సమస్యలు పరిష్కరించేందుకు తొలుత ఏర్పాటు చేశారు. ఆ తర్వాత షలీవ్‌, కంపెనీలో మరో భాగస్వామి ఒమ్రి లావిని ఇజ్రాయిల్‌ అధికారులు కలిసి.. వారికి అవసరమైన ఒక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయించుకొన్నారు. ఆ తర్వాత మెల్లగా ఎన్‌ఎస్‌వో కంపెనీ ఎదగడం మొదలైంది. ప్రస్తుతం ఈ కంపెనీలో 750 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 1.5 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను సాధించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details