ETV Bharat / bharat

Pegasus: పెగాసస్‌ జాబితాలో దలైలామా సలహాదారులు!

author img

By

Published : Jul 23, 2021, 1:09 AM IST

పెగాసస్​ జాబితాలో ఉన్న ప్రముఖుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా ముఖ్య సలహాదారులతో పాటు బౌద్ధ మతాధికారుల నంబర్లు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.

pegasus target list
పెగాసస్​

పెగాసస్‌ హ్యాకింగ్‌ వ్యవహారం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, కీలక అధికారులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు కూడా ఈ స్పైవేర్‌ లక్షిత జాబితాలో ఉన్నట్లు బయటపడుతోంది. తాజాగా ఇందులో టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా ముఖ్య సలహాదారులతో పాటు బౌద్ధ మతాధికారుల నంబర్లు కూడా ఉన్నట్లు వెల్లడైంది. అయితే, అవి హ్యాకింగ్‌కు గురైనట్లు నిర్ధారణ కాలేదని 'ది వైర్‌' వెల్లడించింది.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌, మాజీ సీఈసీ అశోక్‌ లావాసాతో పాటు వందల మంది భారతీయ ప్రముఖులు ఈ స్పైవేర్‌ లక్షిత జాబితాలో ఉన్నట్లు ది వైర్‌ ఇదివరకే వెల్లడించింది. అటు కర్ణాటకలో కాంగ్రెస్‌ - జేడీఎస్‌ ప్రభుత్వానికి చెందిన కొందరు కీలక నేతల ఫోన్‌ నంబర్లు కూడా టార్గెట్ జాబితాలో ఉన్నట్లు ఇదివరకే పేర్కొంది. ఈ వ్యవహారంపై ఎన్‌డీఏ వ్యతిరేక పక్షాలు వివిధ రాష్ట్రాలతో పాటు పార్లమెంట్‌లోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. వీటిని దీటుగా తిప్పికొడుతోన్న కేంద్ర ప్రభుత్వం, ఈ వ్యవహారానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తోంది.

ఇదిలాఉంటే, పెగాసెస్‌ స్పైవేర్‌ వ్యవహారం భారత్‌ సహా పలు దేశాలను కుదిపేస్తున్న వేళ ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది. దీనిపై ఇజ్రాయెల్‌ మంత్రుల బృందం ఒకటి దర్యాప్తు జరపనుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఇజ్రాయెల్‌ ప్రభుత్వం చేపట్టబోయే దర్యాప్తును తాము స్వాగతిస్తున్నామని ఎన్​ఎస్​ఓ కూడా ఇప్పటికే వెల్లడించింది. తమ సంస్థ కార్యకలాపాల్లో ఎటువంటి లోపాలూ లేవని పునరుద్ఘాటించింది. భారత్‌ సహా 50 దేశాలకు చెందిన దాదాపు 50వేల మంది ప్రముఖుల ఫోన్‌ నంబర్లు పెగాసస్‌ స్పైవేర్‌ లక్షిత జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:పెగాసస్​పై ఆగని రగడ- టీఎంసీ ఎంపీ తీరుపై దుమారం

పెగాసస్​పై కేంద్రం కీలక ప్రకటన- రాజ్యసభలో హైడ్రామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.