తెలంగాణ

telangana

క్షిపణి పరీక్షతో కిమ్ న్యూఇయర్ వేడుక... ఈ ఏడాది మరింత దూకుడు!

By

Published : Jan 1, 2023, 12:45 PM IST

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్... నూతన సంవత్సరానికి తనదైన శైలిలో స్వాగతం పలికారు. ప్రపంచ దేశాలు బాణసంచా పేలుళ్లతో కొత్త ఏడాదిలో అడుగుపెడితే కిమ్ మాత్రం క్షిపణి ప్రయోగంతో నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. ఈ ఏడాదిలో అణ్వస్త్రాల తయారీని గణనీయంగా పెంచుతామని కిమ్ ప్రతిజ్ఞ చేశారు. అమెరికా సహా ప్రత్యర్థి దేశాలను ఎదుర్కొనేందుకు సైనిక శక్తిని మరింత పటిష్ఠం చేస్తామని ప్రకటించారు. మరోవైపు కిమ్ చేపట్టిన తాజా క్షిపణి ప్రయోగంపై అమెరికా, దక్షిణ కొరియా దేశాలు మండి పడ్డాయి.

north korea missile test 2023
కిమ్

ప్రపంచమంతా బాణాసంచా వెలుగులతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మాత్రం.. క్షిపణి ప్రయోగంతో నూతన ఏడాదిలోకి అడుగుపెట్టారు. 2022లో రికార్డు స్థాయిలో ఆయుధ ప్రయోగ పరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా.. ఆదివారం కూడా తూర్పు జలాల్లోకి ఓ బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. తద్వారా ఈ ఏడాది కూడా ఆయుధ పరీక్షలు భారీ ఎత్తునే ఉంటాయని పరోక్షంగా సంకేతాలిచ్చింది. మరోవైపు, కొత్త సంవత్సరం సందర్భంగా అధికార పార్టీ సమావేశంలో మాట్లాడిన కిమ్‌.. అణ్వస్త్రాల తయారీని గణనీయంగా పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు. మరింత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణులను తయారు చేస్తామని ప్రకటించారు. అమెరికా సహా ఇతర ప్రత్యర్థి దేశాలను ఎదుర్కొనేందుకు సైనిక శక్తిని మరింత పటిష్ఠ పరుస్తామన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే... సైనిక శక్తిని మరింత బలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని కిమ్‌ అభిప్రాయపడ్డారు. వ్యూహాత్మక అణ్వస్త్రాల తయారీ గణనీయంగా పెంచాల్సిన పరిస్థితులు సృష్టిస్తున్నారని పరోక్షంగా అమెరికా, దక్షిణ కొరియాలను విమర్శించారు.

ఉత్తరకొరియా అణ్యాయుధ ప్రయోగం

వేగవంతమైన, ప్రతీకార దాడి సామర్థ్యంతో కూడిన కొత్త రకం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని తయారు చేయాలని అధికారులను కిమ్ ఆదేశించినట్లు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్‌ఏ పేర్కొంది. అలాగే, తొలి మిలిటరీ గూఢచార ఉపగ్రహాన్ని సైతం త్వరలో ప్రయోగించాలని కిమ్‌ యోచిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు, తాజా క్షిపణి ప్రయోగాలను దక్షిణ కొరియా, అమెరికా ఇండో-పసిఫిక్‌ కమాండ్‌ తీవ్రంగా ఖండించాయి. ఉత్తర కొరియా తీవ్రమైన కవ్వింపు చర్యలకు దిగుతోందని దక్షిణ కొరియా జాయింట్‌ ఛీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ అన్నారు. కొరియా ద్వీపకల్ప శాంతి భద్రతలకు, ఇది విఘాతం కల్గించే చర్య అని పేర్కొన్నారు. అమెరికాతో కలిసి ఉత్తర కొరియా చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చట్టవిరుద్ధమైన ఆయుధ కార్యకలాపాల ద్వారా ఉత్తర కొరియా అస్థిర పరిస్థితులకు దారితీస్తోందని అమెరికా ఇండో-పసిఫిక్‌ కమాండ్‌ తెలిపింది. దక్షిణ కొరియా, జపాన్‌ను రక్షించేందుకు అమెరికా కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.

ఉత్తరకొరియా అణ్యాయుధ ప్రయోగం

ABOUT THE AUTHOR

...view details