ETV Bharat / international

అప్పట్లో 70% పిల్లలకు కరోనా ముప్పు!

author img

By

Published : Jan 1, 2023, 8:27 AM IST

covid child
అప్పట్లో 70% పిల్లలకు కరోనా ముప్పు!

ఒమిక్రాన్​ ఉద్ధృతికి ముందు 50 నుంచి 70% మంది పిల్లలు కరోనా వైరస్ బారిన పడే ముప్పు ఎదుర్కొన్నారని ఓ అధ్యయనంలో తేలింది. మరింత సమర్థమైన టీకాలను రూపొందించి, ఇంకా ఎక్కువమందికి ఇవ్వాల్సిన అవసరాన్ని ఇది చాటుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా 19 ఏళ్లలోపు వయసువారిలో 50 నుంచి 70% మంది 2021 చివరినాటికి.. ఒమిక్రాన్‌ ఉద్ధృతికి ముందు.. కరోనా వైరస్‌ బారిన పడే ముప్పును ఎదుర్కొన్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. మరింత సమర్థవంతమైన టీకాలను ఆవిష్కరించి, ఇంకా ఎక్కువమందికి వాటిని ఇవ్వాల్సిన అవసరాన్ని ఇది చాటుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల రక్త నమూనాలను పరిశీలిస్తే కొవిడ్‌-19 తొలి ఉద్ధృతిలో 7.3% మంది కరోనా బారిన పడితే ఆరో ఉద్ధృతికి వచ్చేసరికి అది 56.6 శాతానికి చేరిందని గుర్తించారు. అత్యధికంగా ఆగ్నేయాసియా ప్రాంతంలో (17.9 నుంచి 81.8% వరకు), అత్యల్పంగా పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలో (0.01%-1.01%)ని నమూనాల్లో కరోనా కనిపించినట్లు చెప్పారు. అధ్యయనం వివరాలు 'ఇ-క్లినికల్‌ మెడిసిన్‌'లో ప్రచురితమయ్యాయి.

వెనుకబడిన ప్రాంతాల్లో ఎక్కువ అవకాశం
పిల్లల్లో ఎక్కువ వయసున్నవారు, వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నవారు, అల్పసంఖ్యాక జాతుల నేపథ్యం నుంచి వచ్చినవారిలో ఎక్కువగా యాంటీబాడీలు కనిపించాయి. 2019 డిసెంబరు 1 నుంచి 2022 జులై 10 మధ్య చేసిన పరీక్షల వివరాలను శాస్త్రవేత్తలు క్రోడీకరించి అంచనాలు రూపొందించారు. 70 దేశాలకు చెందిన 7.57 లక్షల మంది పిల్లల వివరాలను వారు పరిశీలించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా కేసులు గణనీయంగా పెరగడంతో పాటు అనేకమంది, ముఖ్యంగా పిల్లలు కూడా ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చిందని గుర్తించారు. 'పిల్లలకు కరోనా ముప్పు తక్కువని ఒమిక్రాన్‌ వెలుగు చూడడానికి ముందు భావించేవారు. టీకా ఎంతవరకు సురక్షితమనే భయాలూ తల్లిదండ్రుల్లో ఉండేవి. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా 12 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు చాలా నెమ్మదించాయి. ఇప్పటికీ ప్రపంచంలో వ్యాక్సిన్లు పొందని పిల్లల సంఖ్యే ఎక్కువ' అని అధ్యయనం వివరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.