తెలంగాణ

telangana

'ఉగ్రదాడులు చేస్తూ.. సంబరాలా?'.. ఐరాస వేదికగా పాక్, చైనాలకు జైశంకర్ చురకలు

By

Published : Dec 15, 2022, 6:38 AM IST

ఐరాస భద్రతా మండలి వేదికగా పాకిస్థాన్, చైనాలకు పరోక్షంగా చురకలు అంటించారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ వంటి తీవ్రవాదులను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలనే ప్రతిపాదనలకు వీటో అధికారంతో చైనా పదేపదే అడ్డుపడడంపై అభ్యంతరం తెలిపారు.

UN INDIA UNSC
UN INDIA UNSC

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బహిరంగ చర్చ వేదికగా చైనా, పాకిస్థాన్‌లపై విదేశాంగమంత్రి జైశంకర్ పరోక్ష విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదులను సమర్థించడం, రక్షించడం కోసం బహుముఖ వేదికలను కొన్ని దేశాలు దుర్వినియోగం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ శాంతి, భద్రత నిర్వహణ, బహుపాక్షికత కొత్త ధోరణిపై ఐక్యరాజ్య సమితిలో బహిరంగ చర్చకు.. భారత్‌ తరఫున జైశంకర్ అధ్యక్షత వహించారు. పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ వంటి తీవ్రవాదులను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలనే ప్రతిపాదనలకు వీటో అధికారంతో చైనా పదేపదే అడ్డుపడడంపై జైశంకర్ పరోక్షంగా చురకలు అంటించారు. ఐక్యరాజ్యసమితిలో పదేపదే కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్‌ ప్రస్తావించడంపై.. జైశంకర్ మండిపడ్డారు. లాడెన్‌కు ఆతిథ్యం ఇవ్వడం, పొరుగు దేశ పార్లమెంటుపై దాడి సంబరాలు చేసుకోవడానికి యోగ్యతలుకావని ఘాటుగా బదులిచ్చారు.

"ఉగ్రవాదం సవాలుపై సమష్టి ప్రతిస్పందనతో ప్రపంచం కలిసి వస్తున్నప్పటికీ, నేరస్థులను సమర్థించడానికి, రక్షించడానికి బహుపాక్షిక వేదికలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, అభివృద్ధి చెందుతున్న దేశాలు, భద్రతామండలిలో విశ్వసనీయమైన ప్రాతినిధ్యం కొనసాగించాలి. వారు పాలు పంచుకోకపోతే భవిష్యత్తుకు సంబంధించిన పలు అంశాలపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేము."
-ఎస్ జైశంకర్, విదేశాంగశాఖ మంత్రి

అంతకుముందు, ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌తో కలిసి బుధవారం ఆయన ఐరాస కార్యాలయ ఆవరణలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు జైశంకర్. హింస, సాయుధ ఘర్షణ, ఇతరత్రా అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్న ప్రపంచంలో శాంతి, సుస్థిరత నెలకొనడానికి మహాత్మాగాంధీ సిద్ధాంతాలు దోహదం చేస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. దీనిని భారతదేశం ఐరాసకు బహుమతిగా పంపింది. 'అహింస, శాంతి, నిజాయతీలకు ప్రతిరూపం గాంధీ మహాత్ముడు. ఐరాసలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పడం ద్వారా ఈ ఆదర్శాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకొంటున్నట్లవుతుంది' అని జైశంకర్‌ అన్నారు. సామ్రాజ్యవాదంపై మహాత్మా గాంధీకి ఉన్న వ్యతిరేకతే ఐరాసకు పునాది అని గుటెరస్‌ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details