తెలంగాణ

telangana

86 ఏళ్ల వయసులో.. గిన్నిస్ రికార్డు సాధించిన బామ్మ

By

Published : Jul 3, 2022, 4:58 AM IST

Bette Nash: సాధారణంగా 60 ఏళ్లు దాటగానే చాలా మంది రిటైర్మెంట్ తీసుకుని విశ్రాంత జీవితం గడపాలనుకుంటారు. కానీ ఈ బామ్మ ఎనిమిది పదుల వయసులోనూ ఎంతో చలాకీగా ఉద్యోగం చేస్తోంది. అది ఏ చిన్నా చితకా సంస్థలో మామూలు ఉద్యోగం కాదండోయ్‌.. ఓ పేద్ద విమానయాన సంస్థలో ఎయిర్‌హోస్టస్‌గా. గత ఆరు దశాబ్దాలుగా ఒకే కంపెనీలో సుదీర్ఘంగా సేవలందిస్తోన్న ఈ బామ్మ.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కులైన ఫ్లైట్‌ అటెండెంట్‌గా గిన్నిస్‌ రికార్డు కూడా సాధించేసింది. ఇంతకీ ఆమె ఎవరంటే.. అమెరికాకు చెందిన బెట్టె నాష్‌. వయసు అక్షరాలా 86 ఏళ్లు.

Bette Nash
Bette Nash

మసాచుసెట్స్‌లోని బాస్టన్‌ ప్రాంతానికి చెందిన బెట్టె నాష్‌ 1957లో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ లో ఎయిర్‌ హోస్టెస్‌గా తన కెరీర్‌ ఆరంభించారు. అప్పటి నుంచి అదే సంస్థలో కొనసాగుతూ వస్తున్నారు. సాధారణంగా అమెరికాలో పైలట్లు 65ఏళ్లకు రిటైర్‌ అవుతారు. కానీ కమర్షియల్‌ అటెండెంట్లకు ఎలాంటి సర్వీసు పరిమితి నిబంధన ఉండదు. దీంతో వారు ఎంతకాలమైనా ఉద్యోగంలో కొనసాగొచ్చు. అలా.. బెట్టె నాష్‌ ఇప్పటికీ ఎయిర్‌హోస్టెస్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది చివరితో ఆమె తన కెరీర్‌లో 65ఏళ్లు పూర్తిచేసుకోనున్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కురాలైన ఫ్లైట్‌ అటెండెంట్‌గా బెట్టె నాష్‌ను గత వారం గిన్నిస్‌ రికార్డు గుర్తించింది. అంతేగాక, ప్రపంచ వ్యాప్తంగా సుదీర్ఘకాలంలో ఒకే కంపెనీలో పనిచేసిన అత్యంత తక్కువ మందిలో బెట్టె నాష్‌ ఒకరిగా నిలిచారు.

బెట్టె నాష్ ఎక్కువగా కొలంబయా - బాస్టన్ విమానంలో సేవలందిస్తుంటారు. ఎందుకంటే నాష్‌ కుమారుడు డౌన్‌ సిండ్రోమ్‌ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో రాత్రివేళ ఇంటికెళ్లి కొడుకును చూసుకునేందుకు వీలుగా ఉంటుందని ఎప్పుడూ ఈ మార్గంలో విధులు నిర్వహిస్తుంటారు. కొలంబియా -బాస్టన్‌ విమానంలో తరచూ ప్రయాణించే వారికి నాష్‌ సుపరిచితమే. చిరాకు పడకుండా అందర్నీ చిరునవ్వుతో పలకరించడంతో ప్రయాణికులు ఆమెను ఎంతగానో ఇష్టపడతారు. ‘‘నాష్ విమానంలో ఉంటే అంతా బాగున్నట్లే’’ అంటూ ఆమెపై అభిమానాన్ని చాటుకుంటారు.

కెరీర్‌లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ ఆమె ను జలఫిరంగుల సెల్యూట్‌తో సత్కరించింది. సాధారణంగా రిటైర్‌ అవుతున్న అధికారులకు ఇలాంటి గౌరవం కల్పిస్తారు. ఈ ఏడాది 65 ఏళ్లు సర్వీస్‌ పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఆమెను మరోసారి సత్కరించాలని విమానయాన సంస్థ ఏర్పాట్లు చేస్తోందట. నిజంగా ఈ బామ్మ చాలా గ్రేట్‌ కదా..!

ABOUT THE AUTHOR

...view details