తెలంగాణ

telangana

అఫ్గానీలకు అభయం- తాలిబన్ల కొత్త వ్యూహం

By

Published : Aug 18, 2021, 7:13 AM IST

అఫ్గానిస్థాన్‌లో మహిళల హక్కులను గౌరవిస్తామని తాలిబన్లు హామీ ఇచ్చారు. యావత్‌ దేశానికి క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించారు. అయితే.. వారి మాటలు అఫ్గాన్​ ప్రజల్లో ఏమాత్రం విశ్వాసం నింపడం లేదు. త్వరలోనే వారి నిజస్వరూపాన్ని బయటపెట్టి, ఒకప్పటి అరాచక పాలనను మళ్లీ తీసుకొస్తారనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Taliban promise
తాలిబన్ల హమీలు

ముష్కర చెరలో చిక్కిన అఫ్గానిస్థాన్‌లో తాజాగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. యావత్‌ దేశానికి క్షమాభిక్ష పెడుతున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. మహిళల హక్కులను గౌరవిస్తామని హామీ ఇచ్చారు. స్త్రీలు ప్రభుత్వంలో భాగస్వాములు కావాలంటూ తమ సహజ స్వభావానికి విరుద్ధంగా పిలుపునిచ్చారు. మంగళవారం కూడా ఎక్కడా విధ్వంసాలకు తెగబడకుండా శాంతిమంత్రం జపించారు. అయితే వారి మాటలు ప్రజల్లో ఏమాత్రం విశ్వాసం నింపడం లేదు. త్వరలోనే వారి నిజస్వరూపాన్ని బయటపెట్టి, ఒకప్పటి అరాచక పాలనను మళ్లీ తీసుకొస్తారనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల నుంచి అఫ్గాన్‌కు సహాయక నిధులు నిలిచిపోకుండా ఉండేందుకే ముష్కరులు మితవాదులుగా నటిస్తున్నారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరోవైపు- కాబుల్‌ నుంచి పలువురు అఫ్గానీలను అమెరికా తమ విమానాల్లో కతర్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా అగ్రరాజ్యానికి చెందిన ఓ విమానమెక్కిన 640 మంది అఫ్గాన్‌ పౌరులు కతార్‌లో దిగిపోయారు. అఫ్గాన్‌లో తాలిబన్‌ సర్కారు 1-2 రోజుల్లో ఏర్పడే అవకాశముందని, తాలిబనేతర నేతలకూ అందులో చోటుదక్కుతుందని వార్తలొస్తున్నాయి.

సెలైన్​ సీసాతో తమ బంధవును తీసుకోస్తున్న పౌరులు

తాలిబన్ల పడగ నీడలో అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌లో మంగళవారం గంభీర వాతావరణం కనిపించింది. నగర వీధుల్లో ముష్కరులు తుపాకులు చేతపట్టుకొని గస్తీ తిరిగారు. అధిక శాతం ప్రజలు భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు. కొంతమంది మహిళలు స్వల్ప సమయంపాటు నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్త్రీల స్వేచ్ఛకు సంకెళ్లు విధించొద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రెండు దశాబ్దాలుగా తాము అనుభవిస్తున్న హక్కులన్నీ ఇకపై అందని ద్రాక్షే అవుతాయన్న ఆందోళన దేశవ్యాప్తంగా మహిళల్లో కనిపిస్తోంది. మరోవైపు- కాబుల్‌లోని పలు పార్కులు, వ్యాయామశాలల్లో చిన్నపిల్లల తరహాలో కేరింతలు కొడుతూ తాలిబన్లు సరదాగా గడుపుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

అమెరికా వాయుసేన విమానంలో 640 మంది అఫ్గాన్​ పౌరులు

మహిళా యాంకర్‌కు ఇంటర్వ్యూ

స్త్రీల హక్కులను పూర్తిగా కాలరాసేవారిగా పేరున్న తాలిబన్లు తాజాగా ఓ మహిళా యాంకర్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఓ ప్రైవేటు వార్తాసంస్థకు చెందిన మహిళా టీవీ యాంకర్‌తో వారు ముఖాముఖి మాట్లాడారు. ఒకప్పటి తాలిబన్‌ సర్కారు అరాచక పాలనలోనైతే ఊహకైనా అందని విషయమది. తాము మారిపోయామని.. పాలనలో ఒకప్పటిలా క్రూర విధానాలను అనుసరించబోమని ప్రజలకు తెలియజెప్పేందుకు తాలిబన్లు ఇలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

విమానాశ్రయం వద్ద గాల్లోకి కాల్పులు

దేశం విడిచి వెళ్లేందుకు ప్రజలు పోటెత్తడంతో సోమవారం జనసంద్రాన్ని తలపించిన కాబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పరిస్థితులు మంగళవారం కొంత మెరుగుపడ్డాయి. అమెరికా బలగాల పహారాలో అక్కడి నుంచి మిలటరీ తరలింపు విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. కాబుల్‌లో తమ రాయబార కార్యాలయాన్ని ఇప్పటికే ఖాళీ చేసిన అమెరికా.. విమానాశ్రయం నుంచే ఆ కార్యాలయపు పనులను నడిపిస్తోంది. రాత్రివేళ తాలిబన్లు విమానాశ్రయం వద్దకు రావడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ ప్రజలు ప్రవేశించేందుకు నిర్దేశించిన మార్గం వద్ద వారు గాల్లోకి కాల్పులు జరిపారు. అక్కడున్న దాదాపు 500 మందిని వెనక్కి పంపించేశారు.

కాబుల్​ విమానాశ్రయం వద్ద రద్దీ

ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న చర్చలు

అఫ్గాన్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు చర్చలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌, మరో కీలక నేత అబ్దుల్లా అబ్దుల్లాలతో తాలిబన్‌ సీనియర్‌ నాయకుడు ఆమిర్‌ ఖాన్‌ ముత్తకీ ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యారు. తాలిబనేతర నేతలకూ కొత్త సర్కారులో చోటుకల్పించడం, గత 20 ఏళ్లలో అఫ్గానీలకు (ప్రధానంగా మహిళలకు) సంక్రమించిన హక్కులను పరిరక్షించడంపై ప్రధానంగా వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో చర్చలు కొలిక్కి వచ్చి, నూతన ప్రభుత్వం ఏర్పడే అవకాశముందని సమాచారం.

విదేశీ నిధుల కోసమే శాంతమా?

నిరంకుశత్వానికి మారుపేరైన తాలిబన్లు ప్రస్తుతం శాంతిమంత్రాలను వల్లె వేస్తుండటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విదేశాల నుంచి నిధులు నిలిచిపోకుండా ఉండేందుకే వారు మేక వన్నె పులిలా వ్యవహరిస్తున్నారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. తాజాగా మహిళా యాంకర్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. 'మహిళలు రాజకీయాల్లో చేరి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికవడం మీకు అంగీకారమేనా?' అన్న ప్రశ్నకు తాలిబన్‌ నేతలు ఫక్కున నవ్వేశారు! అది కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.

అఫ్గానిస్థాన్​ మహిళలు

'ఎక్కువగా నష్టపోయింది మహిళలే'

రాబోయే తమ పాలనపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించే ప్రయత్నాలను తాలిబన్లు కొనసాగించారు. ఇందులో భాగంగా తాలిబన్‌ సాంస్కృతిక కమిషన్‌ సభ్యుడు ఇనాముల్లా సమన్గనీ అఫ్గాన్‌ ప్రభుత్వరంగ టీవీ వేదికగా కీలక ప్రకటనలు చేశారు. "అఫ్గాన్‌ మొత్తానికీ ది ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ పూర్తి గౌరవం, నిజాయతీతో క్షమాభిక్ష ప్రకటించింది. కొన్నేళ్లుగా మాకు వ్యతిరేకంగా పోరాడినవారికి కూడా హాని తలపెట్టబోం. ప్రతీకారం తీర్చుకోబోం"అని ప్రకటించారు. దేశంలో 40 ఏళ్లుగా కొనసాగుతున్న సంక్షోభంలో మహిళలే ఎక్కువగా నష్టపోయారని సమన్గనీ పేర్కొన్నారు. ఇకపై వారు బలిపశువులుగా ఉండాలని తాము కోరుకోవట్లేదన్నారు. "ఇస్లామిక్‌ చట్టాలు, మన సాంస్కృతిక విలువలకు లోబడి మహిళలు చదువుకునేందుకు, పనిచేసేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ది ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ సిద్ధంగా ఉంది. ఆ చట్టాలకు అనుగుణంగా ప్రభుత్వంలో స్త్రీలు భాగస్వాములయ్యేందుకూ అనుమతిస్తాం" అని చెప్పారు. ప్రభుత్వంలో అందరూ చేరాలన్నదే తమ ఆకాంక్షగా పేర్కొన్నారు. సమన్గనీ హామీలు వినడానికి బాగానే ఉన్నా.. వాటిలో స్పష్టత కొరవడింది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details