ETV Bharat / bharat

అఫ్గాన్​పై మోదీ కీలక భేటీ- వారిని తీసుకురావాలని ఆదేశం!

author img

By

Published : Aug 17, 2021, 7:16 PM IST

Updated : Aug 17, 2021, 10:15 PM IST

అఫ్గానిస్థాన్​లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించారు. అఫ్గాన్​లోని భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని ప్రధాని ఆదేశించినట్లు తెలుస్తోంది. భారత్​కు రావాలనుకునే అఫ్గాన్ సిక్కులు, హిందువులకు ఆశ్రయం కల్పించాలని స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.

modi afghan meet
మోదీ మీటింగ్ అఫ్గాన్

పొరుగుదేశం అఫ్గానిస్థాన్​లో ఆందోళనకరమైన పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక భేటీ నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఎస్) సమావేశమైంది.

అఫ్గాన్​లోని భారత పౌరులందరినీ సురక్షితంగా తీసుకురావాలని అధికారులను ప్రధాని ఆదేశించినట్లు తెలుస్తోంది. భారత్​కు రావాలనుకుంటున్న అఫ్గానిస్థాన్ హిందువులు, సిక్కులకు ఆశ్రయం కల్పించాలని స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

"భారత్ సహాయాన్ని కోరే ప్రతి అఫ్గాన్ సోదరసోదరీమణులకు చేయూత అందించాలని మోదీ చెప్పారు. విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈ భేటీకి హాజరుకాలేకపోయారు. అఫ్గాన్​లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మోదీకి అధికారులు వివరించారు. భద్రతా పరమైన అంశాలపై సమాచారం అందించారు. రాయబార కార్యాలయం నుంచి సిబ్బందిని తరలించిన విషయాలనూ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు."

-అధికార వర్గాలు

రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​ ఈ భేటీకి హాజరయ్యారు. విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, మంగళవారమే దిల్లీకి చేరుకున్న అఫ్గాన్​కు భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ సైతం సమావేశంలో పాల్గొన్నారు.

తరలింపు పూర్తి..

అఫ్గాన్​ను తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్న భారత దౌత్యవేత్తలను, అధికారులను ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చింది. 150 మందిని మిలిటరీ విమానంలో దిల్లీకి చేర్చింది. సోమవారం 40 మంది సిబ్బంది భారత్​కు వచ్చారు. దీంతో కాబుల్​ ఎంబసీ నుంచి సిబ్బంది తరలింపు ప్రక్రియ పూర్తైందని విదేశాంగశాక తెలిపింది. ఇక ఆ నగరంలో ఉంటున్న భారతీయుల వివరాలను సేకరిస్తున్నట్లు వెల్లడించింది. వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేసింది.

అఫ్గాన్ నుంచి సిబ్బందిని బయటకు తీసుకురావడం చాలా కష్టంతో కూడుకున్న పని అని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఇందుకోసం సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆయన నాలుగు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాలో ఉన్నారు.

ఇదీ చదవండి: ఎట్టకేలకు స్పష్టత.. తాలిబన్లపై భారత్ వైఖరి ఇదే!

Last Updated : Aug 17, 2021, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.