తెలంగాణ

telangana

Snake bite: తల్లిదండ్రులు తిడతారని పాము కరిచినా చెప్పని చిన్నారి.. ఏమైందంటే..

By

Published : Jul 26, 2021, 11:00 AM IST

వివాహం జరిగి పదిహేనేళ్లయినా సంతానం కలగకపోవడంతో బంధువుల పాపను దత్తత తీసుకున్నారా దంపతులు. ఏడేళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఎనిమిదో పుట్టిన రోజు అమ్మమ్మ ఇంట్లో జరుపుకోవాలని వెళ్లిన ఆ చిన్నారి అందరికీ దూరమైపోతుందని ఎవరూ ఊహించలేదు. తల్లిదండ్రులు తిడతారనే భయంతో పాము కాటేసిన విషయాన్ని దాచడమే ఆమె పాలిట మృత్యుశాపమైంది.

తల్లిదండ్రులు తిడతారని పాము కరిచినా చెప్పని చిన్నారి
తల్లిదండ్రులు తిడతారని పాము కరిచినా చెప్పని చిన్నారి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉల్వనూరు పంచాయతీ లక్ష్మీదేవిపల్లికి చెందిన బోడ భాస్కర్‌, భారతి దంపతులకు సంతానం కలగకపోవడంతో ఏడేళ్ల క్రితం బంధువుల పాప అఖిలను దత్తత తీసుకున్నారు. ఆర్నెళ్ల ప్రాయం నుంచి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. పాపే ప్రాణంగా ఆ దంపతులు బతికారు. ఆదివారం ఎనిమిదో పుట్టినరోజు వేడుకను అమ్మమ్మ ఇంటి వద్ద జరుపుకోవాలని శనివారం కొత్తగూడెంలోని కారుకొండ రామవరం వెళ్లారు.

సాయంత్రం ఆ చిన్నారి స్నేహితులతో కలిసి ఆడుకుంది. ఆ సమయంలో ఓ విష పాము వేలిపై కాటేసింది. దీంతో అఖిల ఒక్కసారి భయపడి ఇంట్లోకి పరుగున వెళ్లింది. తల్లిదండ్రులు తిడతారనే భయంతో పాము కాటేసిన విషయాన్ని దాచిపెట్టింది. కాలికి మేకు గుచ్చుకుందని అబద్ధం చెప్పింది. ఎలాంటి గాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కొద్దిసేపటికే అఖిల నోట్లోంచి నురగ రావడంతో పాము కాట్లను వేలిపై గుర్తించారు. హుటాహుటిన స్థానిక ఆర్‌ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించి.. మెరుగైన వైద్యం నిమిత్తం కొత్తగూడెం తీసుకెళ్లారు. ఐదారు ఆసుపత్రులకు వెళ్లినా.. చేర్చుకోకపోవడంతో అంబులెన్స్‌లో ఖమ్మం తరలించి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి రాత్రి మృతి చెందింది. ఆదివారం బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు చేశారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన చిన్నారి పుట్టినరోజు వేడుకకు ముందే మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారి రోదన స్థానికులను కంటతడి పెట్టించింది.

ఇదీ చూడండి: father harassment: కన్న బిడ్డలతో అసభ్య ప్రవర్తన..

ABOUT THE AUTHOR

...view details