తెలంగాణ

telangana

కోర్టుగా మారిన అసెంబ్లీ.. జైలుకు 6గురు పోలీసులు.. 19 ఏళ్ల తర్వాత MLCకు న్యాయం!

By

Published : Mar 3, 2023, 8:42 PM IST

Updated : Mar 3, 2023, 8:57 PM IST

అసెంబ్లీలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది! చట్టాలు చేసే సభే న్యాయస్థానంగా మారింది. 19 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఆరుగురు పోలీసులకు ఒక రోజు జైలు శిక్ష విధించింది. అసలేం జరిగిందంటే?

UP Assembly Turned To Court And Arrested Police
కోర్టుగా మారిన యూపీ అసెంబ్లీ పోలీసులు అరెస్టు

సాధారణంగా ప్రజలు ఏదైనా నేరం చేస్తే పోలీసులు అరెస్టు చేసి.. ఆపై కోర్టులో హాజరుపరుస్తారు. అనంతరం దోషిగా తేలితే శిక్ష విధిస్తుంది న్యాయస్థానం. మరి మనం తప్పు చేస్తే నిలదీసే పోలీసులే తప్పు చేస్తే..? సందేహమే లేదు.. చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి వారినీ కోర్టులు శిక్షిస్తాయి. మరికొందరికి జరిమానా విధిస్తాయి. కానీ, ఉత్తర్​ప్రదేశ్​లో శాసనసభే కోర్టుగా వ్యవహరించింది. అక్కడి ప్రజాప్రతినిధులే న్యాయమూర్తులుగా మారారు. సరిగ్గా 58 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి దృశ్యమే కనిపించింది యూపీ విధానసభలో. మరి ఈ కోర్టులో ఎవరి కేసు విచారణకు వచ్చింది. విచారణ తర్వాత అక్కడి నేతలు ఏం తీర్పు ఇచ్చారంటే?

2004లో ఎమ్మెల్యేగా ఉన్న సలీల్​ బిష్ణోయ్​ పట్ల ఆరుగురు పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారన్నది ప్రధాన అభియోగం. అయితే దీనిపై విచారణ చేపట్టింది అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ. సలీల్ బిష్ణోయ్​ పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని నివేదిక ఇచ్చింది. దీంతో ఆరుగురు పోలీసులను దోషులుగా నిర్దారించారు శాసనసభ స్పీకర్​ సతీశ్ మహనా. వీరికి ఒక్కరోజు జైలు శిక్షను విధించారు. అంటే శుక్రవారం(మార్చి 3) అర్ధరాత్రి 12 గంటల శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన తాత్కాలిక జైలులో ఉంచారు. వీరికి కనీస అవసరాలను అందించాలని అసెంబ్లీ కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం యూపీ అసెంబ్లీలో బడ్జెట్​ సమావేశాలు జరుగుతున్నాయి.

ఇదీ కథ..
అయితే శుక్రవారం సభ ప్రారంభం కాగానే శాసనసభ వ్యవహారాల మంత్రి సురేష్ కుమార్ ఖన్నా పోలీసుల ప్రత్యేక హక్కుల ఉల్లంఘన కేసులో వారికి జైలుశిక్షను విధించాలని ప్రతిపాదించారు. ఇక ఈ విషయంలో ప్రివిలేజెస్ కమిటీ చేసిన సమగ్ర విచారణ అనంతరం నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం సభా స్పీకర్​కే ఉంటుందని అప్నాదళ్ పార్టీ నేత ఆశిశ్​ పటేల్ అన్నారు. కాగా, ఈ కేసులో దోషులకు స్పీకర్​ తీసుకున్న ఒకరోజు జైలు శిక్ష నిర్ణయానికి సభలోని దాదాపు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. ప్రజాప్రతినిధులను గౌరవించడం మనందరి బాధ్యతని.. వారిని దూషించే హక్కు ఎవరికీ లేదన్నారు మంత్రి సురేశ్‌ ఖన్నా. అందుకని మరోసారి జరగకుండా బాధ్యులకు కనీస శిక్ష కింద ఒక రోజు జైలు శిక్ష విధించాలని ప్రతిపాదించానని మంత్రి చెప్పారు. సరిగ్గా 58 ఏళ్ల క్రితం అంటే 1964లో యూపీ విధానసభలో ఓ కేసు విచారణ జరిగింది. అప్పుడు కూడా యూపీ విధానసభ కోర్టుగా మారింది.

ఒక్కరోజు జైలు శిక్ష పడింది వీరికే..
అధికార ఉల్లంఘన చేశారనే కేసులో ఆరుగురు పోలీసులను దోషులుగా నిర్ధారించింది అసెంబ్లీ కోర్టు. అరెస్టయిన ఆరుగురు పోలీసు అధికారుల బృందంలో అబ్దుల్ సమద్, కిద్వాయ్ నగర్ ఎస్‌హెచ్‌ఓ రిషికాంత్ శుక్లా, సబ్ ఇన్‌స్పెక్టర్ త్రిలోకీ సింగ్, కానిస్టేబుళ్లు ఛోటే సింగ్ యాదవ్, వినోద్ మిశ్రా, మెహర్బన్ సింగ్ యాదవ్ ఉన్నారు. 19 ఏళ్ల నాటి(2004)ఈ కేసులో దోషులైన పోలీసులకు శిక్ష విధించడం ప్రతి ఒక్కరికి ఓ గుణపాఠం అని ఎమ్మెల్సీ సలీల్​ బిష్ణోయ్ అన్నారు. 2004లో జరిగిన ఈ ఘటనలో అప్పుడు సలీల్​ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 3, 2023, 8:57 PM IST

ABOUT THE AUTHOR

...view details