తెలంగాణ

telangana

Telangana Rains : తెలంగాణలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

By

Published : Jul 20, 2023, 8:09 PM IST

Heavy Rains In Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉద్ధృతి కారణంగా పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది. హైదరాబాద్‌లో రెండ్రోజులుగా వీడని ముసురుతో నగరవాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. నగరంలో పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వరుణుడి జోరుతో పట్టణ ప్రాంతాల్లో జనం కాస్త కష్టాలు పడుతున్నా.. అన్నదాతలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Telangana rains
Telangana rains

తెలంగాణలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

Rains In Across Telangana : ఉపరితల ఆవర్తనం, షియర్‌జోన్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా ఏకధాటిగా పడుతున్న వానలకు రాష్ట్రం తడిసి ముద్దయింది. హైదరాబాద్‌ను ముసురు కమ్మేసింది. ఏకధాటిగా కురుస్తున్న వానలకు నగరంలో జనజీవనం స్తంభించింది. పనుల కోసం వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లుపై నీరు నిలిచిపోవటంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. లింగంపల్లి రైల్వే అండర్‌పాస్‌ మెుత్తం నీట మునగటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. నగర శివారుల్లోని బోడుప్పల్‌, మేడిపల్లి, ఘట్‌కేసర్‌, పీర్జాదిగూడ, పోచారం తదితర ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్న కాలనీల్లో సౌకర్యాలు లేకపోవటంతో వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తాండూరు, కొడంగల్, పరిగి, వికారాబాద్ ప్రాంతాల్లో వానలకు పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. తాండూరులో రహదారులు జలమయమయ్యాయి. పెద్దేముల్ మండలం గాజీపూర్ వాగు పొంగుతుండటంతో ఆ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. యాలాల మండలం గోవిందరావు పేట చెక్‌డ్యాం నిండిపోయింది. దారురు మండలం దోర్నాల వాగు ఉప్పొంగటంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచి పోయాయి.

చెరువులను తలపిస్తున్న కాలనీలు : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వసంత్ విహార్, ఆదర్శనగర్, డ్రీంవ్యాలీ కాలనీలో వర్షపు నీటితో చెరువులను తలపిస్తున్నాయి. మొగుడంపల్లి మండలం మాడిగి-ధనసిరి మార్గంలో వాగు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. కోహీర్, జహీరాబాద్ మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు జాడి మల్కాపూర్ జలపాతాల వద్ద ఉద్ధృతి పెరిగింది. జలపాతాల అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. కొత్తూరు(బి) ప్రాజెక్టుకు వరద పెరగడంతో నిండుకుండలా మారింది. మెదక్‌లో వర్షం కారణంగా డయాలసిస్ కేంద్రంలో సీలింగ్ కూలిపోయింది. మధ్యతరహా వనదుర్గ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.

పెద్దపల్లి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ : ఎగువ నుంచి వస్తున్న వరదతో సిద్దిపేట జిల్లా బస్వాపూర్ వద్ద మోయతుమ్మెద వాగు ఉప్పొంగుతోంది. సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపైనున్న వంతెన మీద నుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. బస్వాపూర్, పోరెడ్డిపల్లి, నాగసముద్రాల మీదుగా హనుమకొండకు.. వాహనాలను దారి మళ్లించారు. పెద్దపల్లి జిల్లాలో అధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో మంథనిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోనూ ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. కామారెడ్డి పట్టణంతో పాటు తాడ్వాయి, సదాశివనగర్‌, లింగంపేట, గాంధారి తదితర మండలాల్లో అధిక వర్షాలు కురిశాయి. కామారెడ్డి-బ్రహ్మణపల్లి మధ్య తాత్కాలిక రోడ్డు తెగిపోవటంతో జిల్లా కేంద్రం నుంచి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లింగపూర్ వాగు ఉద్ధృతికి రహదారి ధ్వంసమైంది. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో భవనం వర్షాలకు నానిపోయి పైపెచ్చులు ఊడిపడ్డాయి. శస్త్రచికిత్స విభాగం పోస్ట్ ఆపరేటివ్ వార్డులో పెచ్చులు కూలిపోగా.. వార్డులో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ చెరువు అలుగుపారుతోంది.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో లోటు వర్షపాతం : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండ్రోజులుగా ముసురు పట్టింది. సాధారణ వర్షపాతంతో పోల్చితే ఇప్పటికీ ఎక్కువ మండలాల్లో లోటు వర్షపాతమే నమోదై ఉంది. నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో సాధారణంతో పోల్చితే లోటు వర్షపాతం నమోదుకాగా.. మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో మాత్రమే సాధారణ వర్షపాతాలు కురిశాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 76 మండలాల్లో సగానికంటే అధికంగా 38మండలాల్లో లోటు వర్షాలు కురిశాయి. ఉమ్మడి పాలమూరులో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు.. రైతులకు కొంత ఊరటనిస్తున్నా, భారీ వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం సాగుచేసిన పంటలకు ఉపయోగ పడకపోవచ్చని రైతులు అభిప్రాయపడుతున్నారు.

యాదాద్రి క్షేత్రంలో ప్రసాదాల కౌంటర్‌లోకి నీరు :ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తున్నాయి. పట్టణాలవాసులకు ఇబ్బందులు ఎదురైనా.. గ్రామాలలో అన్నదాతలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఆలేరులోని పెద్దవాగులో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఏకధాటిగా కరుస్తున్న వానలకు యాదాద్రీశుడి దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రసాదాల కౌంటర్‌లోకి సైతం నీరు చేరింది. భక్తుల రాక తగ్గడంతో.. యాదాద్రి క్షేత్ర పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి.

సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి : వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పలు గనుల్లో ఓపెన్ కాస్ట్‌ల్లోకి వరదనీరు చేరడంతో.. బొగ్గు వెలికితీయడం కష్టంగా మారింది. రోడ్లన్నీ బురదమయం కావటంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నిరంతరాయంగా వర్షం కురుస్తుండడంతో.. సింగరేణికి భారీ నష్టం జరిగిందని సింగరేణి అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details