తెలంగాణ

telangana

ఉత్కంఠగా 'మహా' పాలిటిక్స్​.. శరద్​​​కు కాంగ్రెస్​ మద్దతు.. శిందే సర్కార్‌పై MVA పోరు!

By

Published : Jul 4, 2023, 7:00 PM IST

Maharashtra Political Crisis : మహారాష్ట్ర రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. శివసేన, ఎన్​సీపీలో తిరుగుబాటుతో మహావికాస్‌ అఘాడీ కూటమి అడ్రస్‌ గల్లంతని ప్రచారం జరుగుతున్న వేళ.. ఆసక్తికర పరిణామం జరిగింది. శరద్‌ పవార్‌ను కలిసి సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్‌ నేతలు.. భాజపా-శివసేన సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంవీఏ సారథ్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. శివసేన కూడా ఎంవీఏలో కొనసాగే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. తమ బలాన్ని చాటుకునేందుకు శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌ వర్గాలు రేపు ఎమ్మెల్యేల సమావేశం నిర్వహిస్తున్నాయి.

Maharashtra Political Crisis
Maharashtra Political Crisis

Maharashtra Political Crisis : ఎన్​సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరడం వల్ల.. శరద్ పవార్ వర్గం తీవ్ర ఆలోచనలో పడింది. పార్టీపై పట్టునిలుపుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహా వికాస్ అఘాడి-ఎంవీఏ మరోసారి ఏకం కానున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో శివసేన-భాజపా సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది.

MVA Maharashtra Crisis : అజిత్‌ పవార్‌ తిరుగుబాటు నేపథ్యంలో.. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానాపటోల్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు నసీం ఖాన్.. ఎన్​సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. భాజపా-శివసేన ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ఎంవీఏతో కలిసి కాంగ్రెస్ పనిచేయనున్నట్లు తెలిపారు. ఆ విషయంలో శరద్ పవార్ మార్గనిర్దేశం చేస్తారని చెప్పారు. ఎన్​సీపీలో తిరుగుబాటుకు బీజేపీ కారణమని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు.. దాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. మాతోశ్రీలో సమావేశమైన ఉద్ధవ్ ఠాక్రే వర్గం.. మహా వికాస్ అఘాడీలో కొనసాగాలా లేదా అనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఉద్ధవ్‌ ఠాక్రే ఈ మేరకు పార్టీ నేతల అభిప్రాయం కోరినట్లు సమచారం. ఎంవీఏలో కొనసాగాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు, కేబినెట్ సమావేశం అనంతరం మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి, ఎన్​సీపీ తిరుగుబాటు నేత అజిత్‌ పవార్‌.. తానేం కొత్త వ్యక్తులతో పనిచేయట్లేదని పేర్కొన్నారు. సీఎం శిందే, బీజేపీకి చెందిన కొందరు మంత్రులతో గతంలో కలిసి పనిచేసినట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యకలాపాలు సవ్యంగా సాగుతున్నయని చెప్పిన అజిత్ పవార్.. మెజారిటీ ఎన్​సీపీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉన్నట్లు పునరుద్ఘాటించారు.

శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌ వర్గాలు బుధవారం తమ మద్దతుదారులతో సమావేశం నిర్వహించనున్నాయి. తమకే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఇరువర్గాలు ప్రకటించాయి. తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్‌ పవార్‌ ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది. అయితే శరద్‌ పవార్‌ వర్గం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అజిత్‌ పవార్‌తోపాటు మంత్రులుగా పనిచేసిన 8 మంత్రులపై అనర్హత వేటు వేయాలని మహారాష్ట్ర స్పీకర్‌కు లేఖ రాసింది. మెజార్టీ ఎమ్మెల్యేలు ఏ వర్గానికి మద్దతు ఇస్తున్నాయో బుధవారం జరిగే సమావేశాల్లో తేలనుంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో.. శరద్ పవార్ న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ద్రోహం చేసిన వారు నా ఫొటో ఉపయోగించుకోవద్దు : శరద్​ పవార్​
Sharad Pawar vs Ajit Pawar : తన సిద్ధాంతాలకు ద్రోహం చేసిన వారు.. తనతో సైద్ధాంతికి విబేధాలు ఉన్నవారు తన ఫొటోలను ఉపయోగించుకోవద్దని శరద్​ పవార్​ అన్నారు. అయితే, మంగళవారం దక్షిణ ముంబయిలో ప్రారంభించిన అజిత్​ పవార్​ వర్గం కార్యాలయంలో శరద్​ ఫొటో కనిపించింది.

మోదీ లాంటి నాయకుడు మరొకరు లేరు : అజిత్​ పవార్​
Ajit Pawar On Modi : మోదీ లాంటి నాయకుడు మరొకరు లేరని.. ఆయనకు ప్రత్యామ్నాయ నేత లేరని తన వర్గం కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా అజిత్​ పవార్​ అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తోందని.. ఆయన్ను సపోర్ట్​ చేయడానికి ప్రభుత్వంలో చేరామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details