ETV Bharat / opinion

బాబాయితో ప'వార్' కొత్త కాదు.. గతంలోనూ అజిత్​ది ఇదే తిరుగుబాటు కథ!

author img

By

Published : Jul 2, 2023, 4:44 PM IST

ajit pawar deputy cm
ajit pawar deputy cm

Ajit Pawar VS Sharad Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలకు కేరాఫ్​ అడ్రస్​గా మారారు ఎన్​సీపీ మాజీ నేత అజిత్​ పవార్​. తన అనూహ్య నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆదివారం అనూహ్యంగా మహారాష్ట్రలోని ఎన్​డీఏ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా చేరారు అజిత్. అయితే.. ఇంతకుముందు కూడా ఇలా తన బాబాయ్​, ఎన్​సీపీ అధినేత శరద్​పవార్​ నాయకత్వంపై.. అజిత్​ తిరుగుబాటు చేశారు. మళ్లీ సొంత పార్టీకి తిరిగెళ్లారు.

Ajit Pawar VS Sharad Pawar : అనూహ్య నిర్ణయాలతో మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్​ టాపిక్​గా నిలిచే అజిత్​ పవార్..​ మరోసారి తిరుగుబాటు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్​డీఏలో చేరి.. ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇంతకుముందు కూడా ఇలానే తన బాబాయ్​, ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ నాయకత్వం​పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు అజిత్​ పవార్​. అప్పుడు కూడా ఇలానే బీజేపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చేరారు. ఆ తర్వాత మద్దతు ఉపసంహరించుకుని తిరిగి సొతం పార్టీకి వచ్చారు. ఆరు పదుల అజిత్‌ పవార్​ జీవితంలో ఇలాంటి నాటకీయ పరిణామాలు, అలకలు, పార్టీ వీడటం తిరిగి సొంత గూటికి చేరడం లాంటి సంఘటనలు చాలానే జరిగాయి.

రాజకీయ అరంగ్రేటం ఇలా..
అజిత్​ తండ్రి అనంతరావు పవార్​. ఈయన ప్రముఖ సినీ దర్శకుడు శాంతారారం వద్ద పని చేశారు. అయినా.. అజిత్​ సినిమా రంగంవైపు మళ్లలేదు. రాజకీయాల్లో ఉన్న బాబాయ్‌ శరద్‌ పవార్‌ మార్గాన్ని అనుసరించారు. తన కుటుంబ సభ్యులు మాదిరిగానే సహకార సంఘం ఎన్నికల ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తన సొంత పట్టణమైన బారామతి నుంచి తొలిసారిగా 1991లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఏర్పడిన పి.వి.నరసింహారావు ప్రభుత్వంలో.. శరద్‌ పవార్‌ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం వల్ల అజిత్​ రాష్ట్ర రాజకీయాలకు రావాల్సి వచ్చింది. పిన తండ్రి కోసం ఆరు నెలల్లోనే లోక్‌సభ స్థానానికి రాజీనామా చేసి.. బారామతి అసెంబ్లీ స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. వెంటనే అప్పటి ముఖ్యమంత్రి సుధాకర్‌రావు నాయక్‌ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా నియమితులయ్యారు. ఆ తర్వాత మళ్లీ వెనక్కి చూసుకోలేదు. వరుసగా ఆరు సార్లు బారామతి స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.

బాబాయ్​ వెంటే..
శరద్‌ పవార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. సహాయ మంత్రిగా పలు విభాగాల బాధ్యతలు చూశారు అజిత్​. 1999లో శరద్‌ పవార్‌ కాంగ్రెస్‌ను వీడి ఎన్‌సీపీ స్థాపించినప్పుడు ఆయన వెంటే ఉన్నారు. అదే ఏడాది మహారాష్ట్రలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్‌-ఎన్‌సీపీ పొత్తు పెట్టుకున్నాయి. విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ ముఖ్యమంత్రి కాగా, అజిత్‌ కీలకమైన నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అజిత్​ దాదాపు పదేళ్లపాటు ఆ శాఖను నిర్వహించారు. అశోక్‌ చవాన్‌, సుశీల్‌ కుమార్‌ శిందే హయాంలోనూ పలు పదవులు నిర్వహించారు. ఆ తర్వాత పృథ్వీరాజ్‌ చవాన్‌ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. నీటిపారుదల శాఖను నిర్వహించినప్పుడు ఆయనపై పలు అవినీతి ఆరోపణలు రావడం వల్ల ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు.

బాబాయితో మనస్పర్థలు ఎందుకు?
Ajit Pawar Rebel : శరద్‌ పవార్‌కు మగపిల్లలు లేరు. ఏకైక కుమార్తె సుప్రియా సూలే వివాహం చేసుకొని సింగపూర్‌లో స్థిరపడ్డారు. ఆ తర్వాత ఆమె ఎంపీ గెలిచినా.. దిల్లీకే పరిమితమయ్యారు. ఆమె రాష్ట్ర రాజకీయాల్లోకి రారని శరద్‌ పవార్​ పలు సందర్భాల్లో చెప్పారు. దాంతో శరద్‌ రాజకీయ వారసుడు అజిత్‌ అని అందరూ భావించారు. పార్టీలోనూ ఆయనకు గౌరవం కూడా లభించింది.

అయితే, 2019లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు అజిత్​. తన బాబాయి శరద్‌ పవార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులు నమోదు చేయడాన్ని ఆయన ఇందుకు కారణంగా చూపారు. సహకార బ్యాంకు కుంభకోణంలో తనపైనా ఈడీ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.

2019 తిరుగుబాటు.. బీజేపీ ప్రభుత్వంలో 4 రోజులు..
2019లో ఎన్​సీపీ అధినేతపై తిరుగుబాటు ప్రకటించారు అజిత్​ పవార్. నాటి ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడణవీస్​ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికి.. ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కానీ.. నాలుగు రోజుల్లోనే ఆ పదవికి రాజీనామా చేసి.. మద్దతు ఉపసంహరించుకున్నారు. సొంత పార్టీ ఎన్​సీపీకి తిరిగొచ్చిన అజిత్ పవార్.. ఇలా చేయడం తిరుగుబాటు కాదని అప్పట్లో సమర్థించుకున్నారు.
అయితే, రాజకీయాల్లో శరద్​ కుమార్తె సుప్రియా సూలే చురుగ్గా వ్యవహరిస్తుండడం అజిత్​ ఇబ్బందిగా మారిందని.. తనకు, తన కుమారుడు పార్థ్‌కు పార్టీలో సముచిత స్థానం ఉండదేమోనన్న ఉద్దేశం అజిత్‌కు ఉండటం వల్లే బీజేపీకి అజిత్​ మద్దతిచ్చారని అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి.

ఠాక్రే ప్రభుత్వం.. మళ్లీ కీలక పాత్ర
Ajit Pawar Deputy CM : మెజారిటీ లేనందువల్ల 2019లో నాలుగు రోజులకే భాజపా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత.. అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన పార్టీల కూటమి 'మహా వికాస్​ అఘాడీ' అధికారం చేపట్టింది. ఈ ప్రభుత్వంలో కూడా డిప్యూటీ సీఏంగా పని చేశారు అజిత్​ పవార్​.

2022లో అజిత్ అలక.. అప్పటి నుంచే ఊహాగానాలు..
ఇక 2022లో అజిత్ పవార్​ మళ్లీ అలిగారు. అప్పుడు జరిగిన పార్టీ జాతీయ స్థాయి సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ సమయంలో అజిత్ కంటే ముందుగా జయంత్‌ పాటిల్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. తర్వాత అజిత్ పవార్ వంతు వచ్చే సరికి ఆయన తన సీటు నుంచి లేచి వెళ్లిపోయారు. అప్పట్లో ఈ సంఘటన చర్చనీయాంశమైంది. ఎన్​సీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని అజిత్ ఆశించినా.. ఆ పదవిని శరద్​ పవార్​ చేపట్టడమే నాటి అసంతృప్తికి కారణమనే ఊహాగానాలు జోరుగా వినిపించాయి. అజిత్ పవార్​ను బుజ్జగించేందుకు సుప్రియా సూలే రంగంలోకి దిగారన్న వార్తలు వచ్చాయి.

శరద్​ పవార్​ రాజీనామా.. అజిత్​లో మళ్లీ అసంతృప్తి.. చివరకు తిరుగుబాటు..
Ajit Pawar Latest News : ఈ ఏడాది ఏప్రిల్​లోనూ అజిత్​ పవార్​ ఎన్​సీపీ వీడుతున్నట్లు.. 40 ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించారని ఈహాగానాలు వినిపించాయి. వీటిని ఖండించిన పవార్​.. తాను ఎన్​సీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆ తర్వాత కొన్నిరోజులకు శరద్​ పవార్​ పార్టీ అధ్యక్ష స్థానానికి రాజీనామా ప్రకటించగా.. ఎన్​సీపీ అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందని చర్చ జరిగింది. కానీ తర్వాత శరద్​ పవార్​ తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఈ పరిణామంతో అసంతృప్తిగా ఉన్న అజిత్​.. ఇప్పుడు మళ్లీ ఎన్​సీపీపై తిరుగుబాటు ప్రకటించి ఎన్​డీఏ ప్రభుత్వంలో చేరారని చర్చ జరుగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.