తెలంగాణ

telangana

కర్తార్​పుర్​ వేదికగా.. 74 ఏళ్ల తర్వాత కలుసుకొని..

By

Published : Nov 24, 2021, 12:38 PM IST

friends
స్నేహం

దోస్త్ మేరా దోస్త్.. తూ హై మేరీ జాన్ అంటూ 20ఏళ్ల వయసులో కలసి పాటలు పాడుకున్నారు. అప్పటివరకు తాపీగా సాగిపోతున్న వారి స్నేహం అనూహ్య పరిణామాల వల్ల దూరమైంది. కానీ.. 74ఏళ్ల తర్వాత విధి వారిని తిరిగి మళ్లీ కలిపింది. దీనికి కర్తార్​పుర్ కారిడార్ వేదికైంది. ఆ పాత స్నేహితుల గురించి మీరూ తెలుసుకోండి..

కరోనా కారణంగా మూతబడిన కర్తార్​పుర్​ కారిడార్ (kartarpur sahib corridor) ఇటీవలే తెరచుకుంది. ఈ నేపథ్యంలో కర్తార్​పుర్​కు పర్యటకులు తరలివస్తున్నారు. వారిలో ఇద్దరు మాత్రం ప్రత్యేకంగా నిలిచారు. జీవితంలో మళ్లీ కలుసుకుంటామని అనుకోని వారు.. ఆత్మీయంగా పలకరించుకుని మురిసిపోయారు. దేశవిభజన సమయంలో విడిపోయి.. 74 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఈ స్నేహితులిద్దరిపై ప్రత్యేక కథనం..

పాత రోజులను నెమరవేసుకుని..

గోపాల్ సింగ్- బషీర్‌లు స్నేహితులు. వీరిద్దరూ 1947 దేశ విభజన సమయంలో తలెత్తిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో దూరమయ్యారు. అయితే.. తరువాత కలుసుకోవాలని భావించినప్పటికీ సాధ్యపడలేదు. అనేక సంవత్సరాల అనంతరం.. కర్తార్‌పుర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ సందర్శనలో అనుకోకుండా తారసపడ్డారు. దీనితో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాత రోజులను గుర్తు చేసుకుంటూ చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండిపోయారు.

తమ చిన్ననాటి రోజులను నెమరు వేసుకున్న వారు.. అప్పట్లో బాబా గురునానక్ గురుద్వారాకు వెళ్లి భోజనం చేసేవారమని గుర్తుచేసుకున్నారు. కర్తార్‌పుర్ నడవా నిర్మాణం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. భారత్-పాక్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వీరిలో.. 94 ఏళ్ల సర్దార్ గోపాల్ సింగ్ భారత్​కు చెందినవారు కాగా.. 91 ఏళ్ల మహమ్మద్ బషీర్‌ పాకిస్థాన్‌లోని నరోవల్​లో స్థిరపడ్డారు.

74ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకున్న స్నేహితులు

స్ఫూర్తి..

మరోవైపు.. ఏళ్ల తర్వాత కలుసుకున్న పాత స్నేహితుల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. వీరిది.. అపూర్వమైన కలయిక అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. గోపాల్‌-బషీర్​లు పడిన బాధను ఈ తరం అర్థం చేసుకోవాలని.. హృదయానికి హత్తుకునే వీరి కథ భావితరాలకు స్పూర్తి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మాట్లాడుకుంటున్న అలనాటి స్నేహితులు

ఫలించిన ఎదురుచూపులు..

పాక్‌లోని పంజాబ్‌లోని నరోవాల్‌ జిల్లాలో ఉన్న దర్బార్‌ సాహిబ్‌ను పంజాబ్‌లోని గురుదాస్‌పుర్‌ జిల్లాలో ఉన్న డేరా బాబా నానక్‌ ఆలయాన్ని కలుపుతూ కర్తార్‌పుర్‌ కారిడార్‌ను నిర్మించారు.

కర్తార్​పుర్​లోని సాహిబ్ గురుద్వారా

1522 సంవత్సరంలో గురునానక్‌ దేవ్‌ కర్తార్‌పుర్‌ వద్ద సాహిబ్‌ గురుద్వారాను నెలకొల్పారు. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పూజ్యనీయ స్థలాన్ని వీసా లేకుండా దర్శించుకోవడానికి సిక్కు మతస్థులు దశాబ్దాలుగా ఎదురుచూశారు. చివరికి వారి ఎదురుచూపులు ఫలించి.. కారిడార్‌ నిర్మాణానికి ఇరు దేశాలు అంగీకరించి 2019లో పూర్తిచేశాయి.

కరోనాతో.. మూత

కరోనా రెండో దశ విజృంభణ కారణంగా కర్తార్‌పుర్ కారిడార్​ను 2020 మార్చిలో మూసేశారు. సిక్కు మత స్థాపకులు శ్రీ గురునానక్​ జయంతిని (Guru nanak jayanti) పురస్కరించుకొని.. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఈ కారిడార్​ను​ తెరిచారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details