ETV Bharat / bharat

ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆ ముగ్గురి ఆస్తి విలువ రూ.1000- కోటీశ్వరులు ఎంతమందో తెలుసా? - Lok Sabha Election 2024 Phase 5

author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 7:38 PM IST

Lok Sabha Election 2024 Phase 5 : లోక్​ సభ ఐదో దశ ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉంది. మరి ఈ ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ నాయకుల సంపద, వారిపై ఉన్న క్రిమినల్​ కేసులు గురించి మీకు తెలుసా?

General Election 2024 Phase 5
Lok Sabha Election 2024 Phase 5 (ETV Bharat)

Lok Sabha Election 2024 Phase 5 : లోక్​సభ ఐదో దశ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజకవర్గాల్లో మే 20న పోలింగ్‌ జరగనుంది. ఈ ఐదో దశ ఎన్నికల్లో 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 33 శాతం మంది కోటీశ్వరులు కాగా, ముగ్గురు అభ్యర్థుల ఆస్తులు కేవలం రూ.1000 మాత్రమే కావడం గమనార్హం. బరిలో ఉన్న అభ్యర్థుల్లో మహిళలు కేవలం 11.8 శాతమే ఉన్నారు.

రాజకీయ నాయకులు - ఆస్తులు
ఐదో దశలో రాహుల్‌ గాంధీ అభ్యర్థిగా ఉన్న రాయ్‌బరేలీతో పాటు అమేఠీలో పోలింగ్‌ జరగనుంది. మొత్తంగా 695 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ ఐదో దశ ఎన్నికల్లోనే తేలనుంది. ఈ 695 మంది అభ్యర్థుల్లో 33 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. ముగ్గురు అభ్యర్థుల ఆస్తులు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉండటం గమనార్హం. భాజపా నుంచి 40 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారిలో 36 మంది కోటీశ్వరులే. ముగ్గురు భాజపా అభ్యర్థుల ఆస్తుల విలువ రూ.50 కోట్లకు పైమాటే. బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ నుంచి 46 మంది పోటీలో నిలవగా, వారిలో 26 మంది కోటీశ్వరులు ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి 18 మంది అభ్యర్థులు ఉండగా, అందులో 15 మంది కోటీశ్వరులు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మొత్తం 10 మంది అభ్యర్థులు కూడా కోటికిపైగా ఆస్తులు కలిగి ఉన్నారు.

పొలిటికల్ లీడర్స్ - క్రిమినల్ కేసులు
సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థుల్లో ఐదుగురిపై క్రిమినల్‌ కేసులు, నలుగురిపై అతి తీవ్రమైన నేరాల కేసులు ఉన్నాయి. 19 మంది భాజపా అభ్యర్థులకు నేర చరిత్ర ఉండగా, 12 మంది భాజపా అభ్యర్థులు తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో భాజపా అభ్యర్థి అరుణ్‌సింగ్‌పై ఏకంగా 93 క్రిమినల్‌ కేసులున్నాయి. నియోజకవర్గాల పరంగా చూస్తే యూపీలోని మోహన్‌లాల్‌గంజ్‌లో వివిధ పార్టీల అభ్యర్థులపై ఎక్కువ క్రిమినల్‌ కేసులున్నాయి. అయితే అమేఠీలో పోటీ చేస్తున్న ఏ అభ్యర్థిపైనా ఒక్క క్రిమినల్‌ కేసు కూడా లేకపోవడం విశేషం. అమేఠీలో భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ, కాంగ్రెస్‌ అభ్యర్థి కిషోరి లాల్‌ శర్మ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది.

మహిళా నేతలు
మొత్తం 695 మంది అభ్యర్థుల్లో మహిళలు 82 మంది మాత్రమే ఉన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి ఏడుగురు అభ్యర్థులు ఉండగా, అందులో ముగ్గురు మహిళలే ఉండటం గమనార్హం. 46 మంది బీఎస్పీ అభ్యర్థుల్లో కేవలం ఇద్దరే మహిళలు ఉన్నారు. 40 మంది భాజపా అభ్యర్థుల్లో 8 మంది మహిళలు ఉన్నారు. కాంగ్రెస్‌ 18 చోట్ల బరిలో ఉండగా, అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు.

'జూన్​ 4 తరువాత కూటమి విచ్ఛిన్నం ఖాయం' - మోదీ - PM Modi Slams Opposition

లోక్​ సభ ఎన్నికల్లో భారీగా పోలింగ్​ - మొదటి 4 దశల్లో 67% ఓటింగ్​ నమోదు - Lok Sabha Elections Voting Percent

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.