తెలంగాణ

telangana

జేసీబీ డ్రైవర్​కు​ సాహిత్య అకాడమీ అవార్డ్​.. 28 ఏళ్లకే ప్రతిష్ఠాత్మక పురస్కారం

By

Published : Jul 23, 2023, 7:22 PM IST

Kerala Sahitya Akademi Award Winner Akhil : ఆయనో జేసీబీ డ్రైవర్​. చదివింది కేవలం 12వ తరగతి మాత్రమే. కానీ ప్రతిష్ఠాత్మక కేరళ సాహిత్య అకాడమీ అవార్డ్​కు ఎంపికయ్యారు. ఎన్నో కష్టాలు అనుభవించి.. సాహిత్య రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

jcb-driver-akhil-won-kerala-sahitya-akademi-award-2022
జేసీబీ డ్రైవర్‌ అఖిల్​కు కేరళ సాహిత్య అకాడమీ అవార్డు

Kerala Sahitya Akademi Award Winner Akhil : కేరళకు చెందిన ఓ జేసీబీ డ్రైవర్​.. ప్రతిష్ఠాత్మక సాహిత్య అకాడమీ అవార్డ్​కు ఎంపికయ్యారు. కేవలం 12వ తరగతి మాత్రమే చదివిన ఆయన్ను.. కేరళ సాహిత్య అకాడమీ పరిధిలోని గీతా హిరణ్య ఎండోమెంట్ అవార్డ్​-2022 వరించింది. కుటుంబం కోసం చదువును మధ్యలోనే మానేసిన ఆయన.. సాహిత్యంపై మమకారంతో ఈ స్థాయికి ఎదిగారు. పొట్టకూటి కోసం ఎన్నో పనులు చేస్తూ.. వీలు చిక్కినప్పుడుల్లా తన కలానికి పని చెప్పేవారు అఖిల్​. ప్రస్తుతం కేరళ ప్రతిష్ఠాత్మక అవార్డ్​ను సొంతం చేసుకుని.. జీవిత అనుభవాల నుంచి గొప్ప పుస్తకాలు పుట్టుకొస్తాయని నిరూపించారు. ఆయనే కన్నూరు ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల అఖిల్​.

ఇటీవలె కేరళ సాహిత్య అకాడమీ పలు విభాగాల్లో ఆవార్డులను ప్రకటించింది. ఈ క్రమంలోనే ​గీతా హిరణ్య ఎండోమెంట్ అవార్డ్​-2022కు అఖిల్​ను ఎంపిక చేసింది అకాడమీ. 2020లో ప్రచురితం అయిన చిన్న కథల సంకలనం 'నీలచడయాన్‌'కు ఈ అవార్డ్​ వచ్చింది. కుటుంబ ఆర్థిక సమస్యలతో టీనేజ్​లో ఉన్నప్పుడు రోజూ న్యూస్ పేపర్ వేసేవారు అఖిల్​. రాత్రి సమయాల్లో ఇసుక తవ్వేందుకు వెళ్లి.. అర్థరాత్రి వరకు అక్కడే పని చేసేవారు. ఆ తరువాత జేసీబీ ఆపరేటర్​గాను అఖిల్​ పనిచేశారు. ఇటువంటి క్లిష్ట సమయాల్లోనూ.. వీలు చిక్కినప్పుడల్లా రచనలు చేస్తుండేవారు అఖిల్. పని చేసే సమయంలో ఒంటరితనాన్ని అధిగమించేందుకు సమాజంలో నుంచి గ్రహించిన విషయాల ఆధారంగా తనలో తాను కథలు ఊహించుకునేవాడినని అఖిల్ వెల్లడించారు. తన జీవితంలో చాలా మందిని కలిశానని.. వారి అనుభవాలను, ఇతర అంశాలను గ్రహించానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అవార్డ్​ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపిన అఖిల్​..​ ఇది తాను అస్సలు ఊహించలేదని చెప్పారు.

"ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న నా కుటుంబం కోసం నేను పని చేయాల్సి వచ్చింది. అందుకే చదువును మధ్యలోనే ఆపేశాను. నా రచనలను పబ్లిష్​​ చేయడానికి దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఇబ్బంది పడ్డాను. పుస్తక ప్రచురణల కోసం చాలా మంది పబ్లిషర్స్​ను సంప్రదించాను. నా కథలు వారికి నచ్చినప్పటికీ.. వాటిని పబ్లిష్​ చేసేందుకు వారు ముందుకు వచ్చేవారు కాదు."

--అఖిల్​, అవార్డ్ గ్రహీత

తన పేరు చాలా మందికి తెలియని కారణంగా.. అమ్మకాలు జరపడం చాలా కష్టమని ప్రచురణకర్తలు చెప్పేవారని ఆయన వివరించారు. "నేను ఒకసారి ఫేస్​బుక్​లో ఓ ప్రకటన చూశాను. రచయితలెవరైనా పుస్తకాలు ప్రచురణ చేయాలనుకుంటే.. కేవలం రూ.20,000 చెల్లిస్తే తాము ఆ పని చేసి పెడతామని అందులో ఉంది. దీంతో నేను కూడా నా ''నీలచడయాన్‌'' రచనను ప్రచురణ చేయాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు నా వద్ద రూ.10,000 మాత్రమే ఉన్నాయి. మా అమ్మ రోజూ కూలీకెళ్లి దాచుకున్న మరో 10వేల రూపాయలను నాకు ఇచ్చింది. ఆ మొత్తంతో నేను పుస్తకం పబ్లిష్​ చేశాను." అని అఖిల్ తెలిపారు. కానీ ఆ పుస్తకాలు ఆన్​లైన్​లోనే అమ్మకాలు జరిగాయని.. బుక్​స్టోర్​లో అందుబాటులో ఉండేవి కావని ఆయన వెల్లడించారు. దీంతో ఆ పుస్తకం సమాజంలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది అఖిల్​ వివరించారు.

అఖిల్​ రచించిన పుస్తకాలు

'నీలచడయాన్‌' పుస్తకాన్ని ప్రముఖ సినిమా రచయిత బిపిన్ చంద్రన్ చదివారని.. అనంతరం దానిపై ఫేస్​బుక్​లో పాజిటివ్​గా స్పందిస్తూ పోస్ట్​ పెట్టారని అఖిల్​ వెల్లడించారు. దీంతో 'నీలచడయాన్‌' పుస్తకానికి బాగా ప్రాచుర్యం లభించిందని ఆయన పేర్కొన్నారు. ఆ తరువాత చాలా మంది బుక్​స్టోర్​లలో 'నీలచడయాన్‌' పుస్తకం కోసం ఆరా తీశారని.. దీంతో పబ్లిషర్లు తన పుస్తకాన్ని ప్రచురించేందుకు ముందుకు వచ్చారని అఖిల్​ తెలిపారు.

కొత్తగా వచ్చే రచయితలకు పుస్తక పబ్లిషింగ్​ కోసం ప్రచురణకర్తలను ఒప్పించడం, పాఠకులను ఆకర్షించడం చాలా కష్టమైన పని అని అఖిల్ వివరించారు. సాహిత్య అకాడమీ సేవలు వర్ధమాన రచయితలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని ఆయన వెల్లడించారు. 2021లో 'స్టోరీ ఆఫ్​ లయన్​' పుస్తకాన్ని అఖిల్ రచించారు. ఉత్తర కేరళలో ఆచరించించే 'థెయ్యం' అనే సంప్రదాయం ఆధారంగా ఈ కథ రూపొందిద్దుకుంది. 2022 'తారకంఠన్' అనే రామయణం ఆధారిత పుస్తకాన్ని అఖిల్​ రచించారు. ప్రస్తుతం ఈ పుస్తకాలు మాతృభూమి బుక్స్​ ద్వారా ప్రచురితం అయ్యాయి. జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నప్పటికి..​ ఈ స్థాయిలో గుర్తింపు పొంది ఎంతో మంది యువ సాహితీవేత్తలకు ఆదర్శంగా నిలిచారు అఖిల్.

ABOUT THE AUTHOR

...view details