తెలంగాణ

telangana

అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుజరాత్​ సర్కార్​ కీలక నిర్ణయం

By

Published : Oct 29, 2022, 5:20 PM IST

Updated : Oct 29, 2022, 6:44 PM IST

గుజరాత్‌లో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చేలా భాజపా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఓ ఉన్నత స్థాయి కమిటినీ ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

A high committee will be constituted for Uniform Civil Code in Gujarat
యూనిఫాం సివిల్ కోడ్

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యునిఫామ్‌ సివిల్‌ కోడ్‌ - యూసీసీ)ని అమలు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

'కేబినెట్‌ సమావేశంలో ముఖ్య నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని పరిశీలించేందుకు రిటైర్డ్‌ సుప్రీంకోర్టు/హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని యూసీసీపై ముసాయిదాను సిద్ధం చేస్తుంది' అని గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

గతంలో ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని అక్కడి భాజపా ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ ఏడాది ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భాజపా ఈ హామీని ప్రకటించింది. అన్నట్లుగానే పుష్కర్‌ సింగ్ ధామి సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే యూసీసీని అమలు చేసేందుకు నిపుణులతో కూడిన హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు గుజరాత్‌లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ రాష్ట్రంలోనూ ఉమ్మడి పౌరస్మృతిపై భాజపా కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

గోవాలో ఇప్పటికే ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది. పోర్చుగీస్‌ సివిల్‌ కోడ్‌, 1867ను గోవా అనుసరిస్తోంది. ఇక ఒకసారి ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే.. వివాహం, వారసత్వం, ఆస్తి హక్కులకు సంబంధించి ఒకే చట్టం అమల్లో ఉంటుంది. అంటే హిందూ వివాహ చట్టం, 1955, హిందూ వారసత్వ చట్టం 1956 లేదా భారత వారసత్వ చట్టం 1925, షరియత్‌ చట్టం, 1937 వంటివి ఇక చెల్లుబాటులో ఉండవు. అయితే ఈ ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చే అంశంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు నిపుణులు దీన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

Last Updated : Oct 29, 2022, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details