తెలంగాణ

telangana

ఇక రోడ్డు మీదనే "డ్రగ్స్" టెస్టులు! - పోలీసులు ఈజీగా ఇలా పట్టేస్తారు! - Drugs and Drive Tests

By ETV Bharat Telangana Team

Published : Apr 16, 2024, 4:56 PM IST

Drugs and Drive Tests : మద్యం తాగి వాహనాలు నడిపేవారిని పట్టుకునేందుకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్​ చేయడం అందరికీ తెలుసు. కానీ.. డ్రగ్స్​ తీసుకుని డ్రైవింగ్ చేసేవాళ్లను పట్టుకునేందుకు కూడా టెస్టులు చేస్తున్నారని మీకు తెలుసా? ఈ కొత్త ప్రయోగంతో డ్రగ్స్​ దందా ఆట కట్టించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధమైంది!

Drugs and Drive Tests
Drugs

Telangana Police Starts Drugs and Drive Tests : మద్యం తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు పోలీసులు 'డ్రంకెన్ డ్రైవ్' పరీక్షలు నిర్వహించడం మనం చూస్తూనే ఉంటాం. ఇందుకోసం బ్రీత్ అనలైజర్ పరికరాన్ని ఉపయోగిస్తుంటారు పోలీసులు. తాగిన వాహనాలు నడపడం ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలిసిందే. ఆ ఘోరాలను అడ్డుకునేందుకే పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు (Druken Drive Tests) నిర్వహిస్తుంటారు. మత్తులో జరిగే ప్రమాదాలను నివారించవచ్చని, మందుబాబుల్లో పరివర్తన తీసుకురావొచ్చనే ఉద్దేశంతో పోలీసులు ఇలా చేస్తుంటారు. అయితే.. ఇప్పుడు ఇదే తరహాలో తెలంగాణ పోలీసులు 'డ్రగ్స్ అండ్ డ్రైవ్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో.. తెలంగాణ పోలీసు యంత్రాంగం ఈ సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. 'డ్రగ్స్ అండ్ డ్రైవ్' పరీక్షలు నిర్వహించడం కోసం తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో(టీఎస్‌న్యాబ్‌) ప్రత్యేకంగా ఓ కిట్​ను కూడా తయారుచేసి పోలీసు యంత్రాంగానికి అందించింది. ఇంతకీ ఏంటి ఆ కిట్? దాని ద్వారా డ్రగ్స్ తీసుకున్న వారిని ఎలా గుర్తిస్తారు? అన్నది చూద్దాం.

బిగ్ అలర్ట్ : మహిళలు మందు తాగితే - ఏం జరుగుతుందో తెలుసా? - Alcohol Health Risks in Women

డ్రగ్స్ వినియోగిస్తున్న వారిని.. ప్రధానంగా గంజాయి తాగే వారిని గుర్తించడం కోసం తెలంగాణ పోలీసులు తీసుకొచ్చిన ఆ కిట్ పేరు.. 'ఎబోన్ యూరిన్ కప్'. ఈ కిట్ సహాయంతో ఎప్పటికప్పుడు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎబోన్ యూరిన్ కప్ కిట్​ను రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు పంపించింది తెలంగాణ పోలీస్ శాఖ. అలాగే ఆ పరికరం సాయంతో డ్రగ్స్‌ వినియోగించే వారిని గుర్తించే విధానంపై సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చింది. రాష్ట్రంలోని కొన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఇప్పటికే 'డ్రగ్స్ అండ్ డ్రైవ్' టెస్టులు నిర్వహిస్తున్నారు.

డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలా గుర్తిస్తారంటే..?

డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో.. ఎవరైనా గంజాయి సహా ఇతర డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులకు అనుమానం వచ్చిన పక్షంలో 'ఎబోన్ యూరిన్ కప్' కిట్ ద్వారా మూత్ర పరీక్ష నిర్వహిస్తారు. అప్పుడు ఆ పరికరంలో రెండు ఎర్ర గీతలు కనిపిస్తే నెగెటివ్​గా, అదే సింగిల్ లైన్ కనిపిస్తే 'పాజిటివ్'గా పరిగణిస్తారు. అలా పాజిటివ్​గా వచ్చిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని తదుపరి పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వంటి ప్రదేశాల్లో అనుమానాస్పదంగా తిరిగే వారిని లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం.

మద్యం మానలేకపోతున్నారా? - కనీసం ఆరోగ్యమైనా ఇలా కాపాడుకోండి!

ABOUT THE AUTHOR

...view details