తెలంగాణ

telangana

ఇంటి ప్రహరీ గోడ కన్నా గేటు ఎత్తుగా ఉండొచ్చా? - వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది? - Vastu Rules For House Gate

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 4:37 PM IST

House Gate Vastu Rules
Gate

House Gate Vastu Rules : ప్రహరీ గోడ ఎత్తు కన్నా.. గేటు ఎత్తు ఎక్కువగా ఉండొచ్చా? వాస్తు ప్రకారం ఎక్కువ ఎత్తులో ఉంటే ఏమవుతుంది? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు? అన్నది ఇప్పుడు చూద్దాం.

Vastu Rules For House Gate :ఇల్లు ఎంత పెద్దగా కట్టుకున్నా.. దానికి కాంపౌండ్ వాల్ లేకపోతే కళ తప్పిపోతుంది. అందుకే.. ఇల్లు ఎంత విస్తీర్ణంలో కట్టుకున్నా కూడా.. దాని చుట్టూ తప్పకుండా ప్రహరీ నిర్మిస్తారు. రకరకాల డిజైన్​లతో నిర్మించుకుంటుంటారు. అయితే.. కొందరు కాంపౌండ్ వాల్ తక్కువ ఎత్తులో నిర్మించుకుంటారు. కానీ.. గేటు మాత్రం ఎక్కువ ఎత్తుతో ఏర్పాటు చేసుకుంటుంటారు. మరి, వాస్తు ప్రకారం ఇలా గేటు ఎత్తుగా పెట్టుకోవచ్చా? ఏ దిక్కులో గేటును అమర్చుకుంటే మంచిది? వంటి సందేహాలకు ఈ స్టోరీలో సమాధానాలు చూద్దాం.

అలా అయితే ఓకేనట!

వాస్తుప్రకారం.. మీరు నిర్మించుకునే గేటు పైన కప్పు లేకపోతే.. గేట్లను ఎలా నిర్మించుకున్నా ఇబ్బందిలేదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా.. ఆ గేటుకు ఇరువైపులా ఉండే దిమ్మెలను కూడా ఎలా రూపొందించుకున్నా.. దోషం ఉండదని అంటున్నారు. సహజంగా.. కాంపౌండ్ వాల్ కన్నా గేటు ఎత్తు ఎక్కువగానే వస్తూ ఉంటుంది. గోపురం ఆకారంలో గేటును నిర్మించినప్పుడు అది ప్రహరి గోడకన్నా ఎత్తులో రావడం మనం గమనిస్తూ ఉంటాం. ఇది డిజైన్​లో భాగమేనని అంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.

అంతేకాదు.. ఆ గేటును ఇంట్లోని వాళ్లు, బయటి వాళ్లు అందరూ ఉపయోగిస్తుంటారు కాబట్టి.. గేటు విషయంలో ఎలాంటి తప్పూ ఉండదంటున్నారు. అదేవిధంగా.. ఎక్కడైనా ఇంటి ఫ్లోర్‌కన్నా గేట్లు ఎత్తుగా ఉండవు. కాబట్టి.. గేటును ఎలా ఏర్పాటు చేసుకున్నా ఇబ్బంది లేదని చెబుతున్నారు. ఎలాంటి సందేహాలూ పడకుండా మీకు నచ్చిన రీతిలో గేటును ఏర్పాటు చేసుకోవచ్చని, అంతా మంచే జరుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్నారా? - అయితే, వాస్తు ప్రకారం ఈ నియమాలు పాటించాల్సిందే!

గేటు ఏర్పాటుకు ఉత్తమ దిశలు :వాస్తుప్రకారం.. ఉత్తర-ఈశాన్యం, తూర్పు-ఈశాన్యం, దక్షిణ-ఆగ్నేయం, పడమర-వాయువ్యం వైపున గేటు ఏర్పాటు చేసుకుంటే మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తర-వాయువ్యం, తూర్పు-ఆగ్నేయం, దక్షిణ-నైరుతి, పడమర-నైరుతి వైపు ఉన్న గేట్లు చెడు ఫలితాన్నిస్తాయని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు. అలాగే గేట్లకు వేసే కలర్స్ విషయంలో కూడా వాస్తును పాటించాలంటున్నారు. వీలైనంత వరకు రేఖా గణితాన్ని అనుసరించి గేటు డిజైన్ చేయించాలని, వాటికి వేసే రంగులు సాధారణంగా నల్లగా ఉండేలా చూసుకోవడం మంచిదని సూచిస్తున్నారు వాస్తుశాస్త్ర పండితులు.

Note :పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఎంత సంపాదించినా అప్పులు తీర్చలేకపోతున్నారా? ఇంట్లో ఈ చిన్న మార్పులు చేస్తే!

ABOUT THE AUTHOR

...view details