తెలంగాణ

telangana

గల్లీ టు దిల్లీ వయా 'యూపీ'- అక్కడ కొడితే కుంభస్థలం బద్దలుగొట్టినట్లే! - Lok Sabha Elections 2024

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 10:17 PM IST

Updated : May 12, 2024, 10:24 PM IST

Uttar Pradesh Lok Sabha Polls 2024 : దేశ రాజకీయ చిత్రపటంలో ఉత్తర్‌ప్రదేశ్ అత్యంత కీలక రాష్ట్రం. దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. అందుకే ఇక్కడ జెండా పాతేందుకు పార్టీలు వ్యూహ రచన చేస్తుంటాయి. ఉత్తర్​ప్రదేశ్‌లో పట్టు నిలుపుకుంటే కేంద్రంలో అధికార పీఠం హస్తగతం చేసుకోవడం తేలికని చరిత్ర కూడా స్పష్టం చేస్తోంది.

Uttar Pradesh Lok Sabha Polls 2024
Uttar Pradesh Lok Sabha Polls 2024 (ETV Bharat)

Uttar Pradesh Lok Sabha Polls 2024 :దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం పతాకస్థాయికి చేరింది. ఈసారి కేంద్రంలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఇండి కూటమి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కేంద్రంలో అధికారం చేపట్టాలంటే దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌ అత్యంత కీలకం. ఈ రాష్ట్రంలో ఎక్కువ స్థానాలను ఏ పార్టీ దక్కించుకుంటే ఆ పార్టీకే కేంద్రంలో విజయావకాశాలు మెండుగా ఉంటాయి. 1951 నుంచి 1971 వరకు ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అత్యధిక సీట్లు గెలుచుకోవడం వల్ల దిల్లీలో సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

అప్పుడు ఒక్క సీటు కూడా!
1975లో ఇందిరాగాంధీ విధించిన ఆత్యయిక పరిస్థితి దేశ రాజకీయ ముఖచిత్రంతోపాటు ఉత్తర్​ప్రదేశ్‌ రాజకీయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. అప్పటివరకు యూపీలో బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ 1977లో అక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు. తొలిసారిగా కేంద్రంలోనూ అధికారంలోకి రాలేదు. నాటి ఎన్నికల్లో భారతీయ లోక్‌దళ్‌ గుర్తుపై పోటీ చేసిన జనతా పార్టీ యూపీలో 85 సీట్లు దక్కించుకుని దేశవ్యాప్తంగా 295 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్‌కు 1977 ఎన్నికల్లో దక్కిన ఎంపీ సీట్లు కేవలం 154 కాగా అందులో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా 41 సీట్లు వచ్చాయి.

చరిత్రలో ఇప్పటి వరకూ!
1977లో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక్క స్థానంలోనూ గెలవకపోయినా 1980 నాటికి మళ్లీ కాంగ్రెస్‌ బలపడింది. 1981 ఎన్నికల్లో హస్తం పార్టీ మళ్లీ 51 స్థానాలు గెలుచుకోవడం వల్ల 353 స్థానాల సంపూర్ణ మెజారిటీతో ఇందిరాగాంధీ నేతృత్వంలో మరోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఏకంగా 83 సీట్లు వచ్చాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ చరిత్రలో ఇప్పటి వరకూ ఒక పార్టీ సాధించిన అత్యధిక ఎంపీ స్థానాలు ఇవే.

ఇతర పక్షాల మద్దతుతో!
1984 ఎన్నికల్లో యూపీలో 83 స్థానాలు రావడం వల్ల కాంగ్రెస్‌ 414 స్థానాలు దక్కించుకుని రాజీవ్‌గాంధీ నేతృత్వంలో స్వతంత్ర భారతదేశంలో అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాజీవ్‌ గాంధీ పరిపాలనపై విమర్శలు, బోఫోర్స్‌ కుంభకోణం ఆరోపణలు చుట్టుముట్టడం వల్ల 1989 నాటికి యూపీలో కాంగ్రెస్‌ 15 స్థానాలకు పడిపోయింది. దేశవ్యాప్తంగా కూడా హస్తం పార్టీకి కేవలం 197 స్థానాలు మాత్రమే రావడం వల్ల కేంద్రంలో సొంతంగా సర్కారును ఏర్పాటు చేయలేని పరిస్థితి వచ్చింది. ఆ ఎన్నికల్లో జనతాదళ్‌ యూపీలో 54 సీట్లు దక్కించుకోగా దేశవ్యాప్తంగా 143 స్థానాలు గెలుచుకుని ఇతర పక్షాల మద్దతుతో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

రెండు వారాల్లోపే ఆ సర్కారు!
1991లో రాజీవ్‌గాంధీ హత్యకు ముందు జరిగిన లోక్‌సభ ఎన్నికల నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ బలం క్రమంగా పెరుగుతూ వచ్చింది. 1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ యూపీలో కేవలం 5 సీట్లకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో కమలం పార్టీ 51 స్థానాల్లో విజయం సాధించింది. కానీ రాజీవ్‌ హత్య తర్వాత మరికొన్ని స్థానాల్లో ఎన్నికలు జరగగా కాంగ్రెస్‌ మొత్తంగా 232 సీట్లు గెల్చుకొని పీవీ నరసింహారావు నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1996 ఎన్నికల్లోనూ ఉత్తర్​ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ మరోసారి 5 సీట్లకే పడిపోయింది. దేశవ్యాప్తంగానూ కాంగ్రెస్‌ కేవలం 140 స్థానాలే దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ యూపీలో ఏకంగా 52 స్థానాలు గెల్చుకొని దేశవ్యాప్తంగా 161 స్థానాలతో వాజ్‌పేయీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రెండు వారాల్లోపే ఆ సర్కారు కూలిపోయింది. తర్వాత దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ నాయకత్వంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

వాజ్‌పేయీ నాయకత్వంలో!
1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ మరోసారి యూపీలో 50కిపైగా సీట్లు గెల్చుకుంది. 182 సీట్లతో దేశంలో వరుసగా రెండోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. నాడు వాజ్‌పేయీ నేతృత్వంలో ఏర్పడ్డ సర్కారు ఏడాదిన్నరలోపే కూలిపోవడం వల్ల 1999లో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆ ఎన్నికల్లో యూపీలో కమలదళం బలం 29కే పరిమితమైనా, మిగిలిన రాష్ట్రాల్లో బలం పుంజుకుంది. దానికితోడు తెలుగుదేశం పార్టీ వంటి మిత్రపక్షాల మద్దతుతో ఎట్టకేలకు వాజ్‌పేయీ నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమైంది. 1999 ఎన్నికల్లో యూపీలో సమాజ్‌వాదీ పార్టీ 29, బీఎస్పీ 14, కాంగ్రెస్‌ 10 సీట్లు గెల్చుకున్నాయి.

మోదీ హవా కారణంగా!
2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ యూపీలో 9 స్థానాలు దక్కించుకుంది. అయినా యూపీలోని ప్రధాన పార్టీలుగా అవతరించిన ఎస్పీ, బీఎస్పీల సహకారంతో మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ యూపీలో 10 సీట్లే సాధించి దేశవ్యాప్తంగా కూడా 138 స్థానాలకే పరిమితమైంది. 2009లో యూపీలో 21 సీట్లు దక్కించుకుని. కాంగ్రెస్‌ మరోసారి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేయగలిగింది. కానీ మోదీ హవా కారణంగా 2014లో 71 స్థానాలు 2019లో 62 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ సంపూర్ణ మెజార్టీతో కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది.

Last Updated : May 12, 2024, 10:24 PM IST

ABOUT THE AUTHOR

...view details