తెలంగాణ

telangana

పార్టీ రెండు ముక్కలయ్యాక తొలి ఎన్నికలు- ముంబయి ప్రజలు ఎవరివైపు ఉన్నారో? - Lok Sabha Elections 2024

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 7:47 AM IST

Mumbai Lok Sabha Polls 2024 : లోక్‌సభ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ముంబయిలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో అధికార-ప్రతిపక్ష కూటముల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటుతో ముక్కలైన శివసేన రెండు వర్గాల మధ్య కొన్ని స్థానాల్లో హోరాహోరీ పోరు జరుగుతోంది. ఈ స్థానాల్లో గెలిచి తమదే అసలైన శివసేన అని ప్రజలు భావిస్తున్నారని చాటిచెప్పేందుకు ఆయా పార్టీల అధినాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గాల్లో పోరు ప్రతిష్ఠాత్మకంగా మారింది.

Mumbai Lok Sabha Polls 2024
Mumbai Lok Sabha Polls 2024 (Etv Bharat)

Mumbai Lok Sabha Polls 2024 : దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లోక్‌సభ ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరింది. ముంబయిలో మొత్తం ఆరు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ ఆరు నియోజకవర్గాల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇందులో మూడు నియోజకవర్గాల్లో పోరు మరింత ఉత్కంఠ రేపుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటుతో శివసేనపార్టీ రెండుగా విడిపోగా శిందే, ఉద్ధవ్‌ వర్గాల మధ్యే ఈ మూడు స్థానాల్లో హోరాహోరీ పోరు జరుగుతోంది. శివసేన రెండు వర్గాలుగా ముక్కలైన తర్వాత జరుగుతున్న ప్రధాన ఎన్నికలు కావడం వల్ల ఈ పోరులో గెలిచి ప్రజలంతా తమ వైపే ఉన్నారని చాటాలని ఇరు పార్టీలు పట్టుదలతో ఉన్నాయి.

ముంబయిలో ముంబయి సౌత్, ముంబయి సౌత్-సెంట్రల్, ముంబయి నార్త్, ముంబయి నార్త్ సెంట్రల్, ముంబయి నార్త్-ఈస్ట్, ముంబయి నార్త్-వెస్ట్ నియోజకవర్గాలు ఉన్నాయి. మే 20న ఐదో దశలో ఈ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ముంబయి సౌత్, ముంబయి సౌత్ సెంట్రల్, ముంబయి నార్త్-వెస్ట్ నియోజకవర్గాల్లో శిందే నేతృత్వంలోని శివసేన, ఉద్ధవ్‌ నేతృత్వంలోని శివసేన UBT అభ్యర్థులు అమీతుమీ తేల్చుకుంటున్నారు.

వ్యూహాలు ఇలా!
ముంబయి సౌత్‌లో ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు చెందిన సిట్టింగ్ ఎంపీ అరవింద్ సావంత్ మరోసారి బరిలోకి దిగగా ఇక్కడ శిందే నేతృత్వంలోని శివసేన అభ్యర్థి యామినీ జాదవ్‌ బరిలోకి దిగారు. యామీనీ జాదవ్ ముంబయిలోని బైకుల్లా ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. శివసేన UBT బలంగా ఉన్న ఈ స్థానంలో విజయం సాధించి సత్తా చాటాలని శిందే నేతృత్వంలోని శివసేన పట్టుదలగా ఉంది. ముంబయి సౌత్ సెంట్రల్‌లో ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేనకు చెందిన సిట్టింగ్‌ ఎంపీ రాహుల్ షెవాలే పోటీ చేస్తున్నారు. శివసేన UBT తరపున కీలక నేత అనిల్ దేశాయ్ పోటీ చేస్తున్నారు. అనిల్‌ దేశాయ్‌ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మరోసారి గెలవాలని రాహుల్‌ షెవాలే రాజ్యసభ నుంచి లోక్‌సభలో అడుగుపెట్టాలని అనిల్‌ దేశాయ్‌ వ్యూహాలు రచిస్తున్నారు.

ముంబయి నార్త్‌ వెస్ట్‌లో ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన అమోల్ కీర్తికర్ బరిలో ఉండగా అధికార శిందే వర్గం నుంచి రవీంద్ర వైకర్‌ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇటీవల రవీంద్ర వైఖర్‌ శివసేన UBTను వీడి శిందే వర్గంలో చేరారు. రవీంద్ర వైకర్‌ జోగేశ్వరి తూర్పు శాసనసభ్యుడిగానూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముంబయి నార్త్‌ సెంట్రల్‌ స్థానంలో వరుసగా రెండుసార్లు గెలిచిన సిట్టింగ్‌ ఎంపీ పూనమ్‌ మహాజన్‌ పక్కనపెట్టి ప్రముఖ సీనియర్‌ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌ను బీజేపీ రంగంలోకి దించింది. ధారావి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ అభ్యర్థి వర్షా గైక్వాడ్‌తో ఉజ్వల్‌ నికమ్‌ పోటీ పడబోతున్నారు. నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత ఉద్ధవ్‌ ఠాక్రేను కలిసిన వర్షా గైక్వాడ్‌ మద్దతు కోరారు.

రెండు పార్టీలకు కలిసి వస్తోంది!
వర్షాను ఎంపీగా దిల్లీ పంపుతామని ఉద్ధవ్‌ హామీ ఇచ్చారు. ముంబయి నార్త్‌లో కాంగ్రెస్‌ నేత భూషణ్ పాటిల్‌తో కేంద్రమంత్రి, బీజేపీ అగ్ర నేత పీయూష్ గోయల్ తలపడనున్నారు. ముంబయి నార్త్ ఈస్ట్‌లో శివసేన UBT నుంచి సంజయ్ దిన పాటిల్‌ పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి మిహిర్ కొటేచా పోటీ చేస్తున్నారు. మిహిర్‌ కోటేచా ములుండ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. వీరిద్దరి పోరు కూడా ఆసక్తి రేపుతోంది. 2019 వరకు ముంబయిలో కాంగ్రెస్ శివసేన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి. కానీ ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు ఈ రెండు రాజకీయ పార్టీలను దగ్గర చేశాయి. ముంబయిలో అత్యధిక స్థానాలు గెలుచుకుని శాసనసభ ఎన్నికల నాటికి బలపడాలని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శివసేన UBT, కాంగ్రెస్ శ్రేణులు కలిసి ముందుకు సాగుతుండడం ఈ రెండు పార్టీలకు కలిసి వస్తోంది.

అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ముంబైలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో ఒక్కటి కూడా గెలవలేదు. 2019 శాసనసభ ఎన్నికల్లో ముంబయిలోని 36 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం అయిదు స్థానాల్లో మాత్రమే గెలిచారు. 2019లో జరిగిన అనేక రాజకీయ మార్పుల తర్వాత ఈ ఎన్నికలు జరగనుండడం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ముంబయిని ముంబయి నగరంగా ముంబయి సబర్బన్‌ జిల్లాగా విభజించారు. ముంబయి నగరంలో ముంబయి సౌత్, ముంబయి సౌత్ సెంట్రల్ నియోజకవర్గాలు ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాలు ముంబయి సబర్బన్‌ జిల్లాలో ఉన్నాయి. ముంబయి నగరంలో 24 లక్షల మంది ఓటర్లు ఉండగా, సబర్బన్‌లో 74 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఎవరికి మద్దతిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

కాంగ్రెస్​ కంచుకోటలో యూసఫ్ పఠాన్​​ గెలిచేనా? - Lok Sabha Elections 2024

యూపీలో ఫేజ్​-4పై ఉత్కంఠ- SP, BSP టఫ్​ ఫైట్​- BJP క్లీన్​స్వీప్ రికార్డ్ ఈసారి కష్టమే! - lok sabha elections 2024

ABOUT THE AUTHOR

...view details