తెలంగాణ

telangana

అధీర్​ టు అఖిలేశ్​- నాలుగో విడత బరిలో ప్రముఖులు- పై చేయి ఎవరిదో? - Lok Sabha Elections 2024

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 11:09 AM IST

key candidates in 4th phase Elections : లోక్​సభ ఎన్నికల నాలుగో విడతలో పలువురు కేంద్ర మంతులు, మాజీ సీఎంలు, సినీ ప్రముఖులు పోటీ పడనున్నారు. తమ అదృష్టాన్ని ప్రయత్నించుకునే పనిలో కొంతమంది ఉండగా, మరోసారి గెలిచి తమ సత్తాను చాటేందుకు కేంద్ర మంత్రులు ప్రణాళికలు చేస్తున్నారు. మరోవైపు ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్‌స్ర్కీన్‌లోనూ నిరూపించుకోవాలని సినీప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగో విడతలో పోటీ చేస్తున్న ఆ ప్రముఖుల ఎవరో చూద్దాం.

key candidates in 4th phase Elections
key candidates in 4th phase Elections (ETV)

Key Candidates in 4th Phase Elections : సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో పలువురు కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోసారి గెలిచి తమ సత్తాను చాటేందుకు కేంద్ర మంత్రులు ప్రయత్నిస్తుండగా, ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్‌స్ర్కీన్‌లోనూ తమకు పట్టు ఉందని నిరూపించుకోవాలని సినీప్రముఖులు తహతహలాడుతున్నారు. నాలుగో విడతలో ప్రముఖులు పోటీ చేస్తున్న కీలక నియోజకవర్గాలేంటో చూద్దాం.

బిహార్​ మినీ మాస్కోలో పోరు రసవత్తరం
బిహార్‌లో అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఒకటైన బెగూసరాయ్‌ నుంచి కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ తరఫున ఈసారి ఆయనే బరిలో ఉన్నారు. బెగూసరాయ్‌ని బిహార్‌ మినీ మాస్కోగా పిలుస్తారు. ఇక్కడ భూమిహార్‌ వర్గం ప్రజల ప్రాబల్యం ఎక్కువ. గిరిరాజ్‌ సహా ఈ స్థానంలో ఇప్పటిదాకా గెలిచిన ఎంపీల్లో అత్యధికులు ఆ వర్గంవారే. 2019 ఎన్నికల్లో ఇక్కడ సీపీఐ అభ్యర్థిగా బరిలో దిగిన కన్నయ్య కుమార్‌ను గిరిరాజ్‌ 4.2 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. ప్రస్తుతం గిరిరాజ్‌కు సీపీఐ తరఫున పోటీ చేస్తున్న అవధేశ్‌కుమార్‌ రాయ్‌ ప్రధాన ప్రత్యర్థి. 86 శాతం హిందూ జనాభా ఉన్న బెగూసరాయ్‌ ఎన్​డీఏ గట్టి పట్టున్న స్థానం. కాబట్టి తన విజయంపై గిరిరాజ్‌ ధీమాగా ఉన్నారు. వాస్తవానికి గిరిరాజ్‌ పొరుగున ఉన్న లఖీసరాయ్‌ నియోజకవర్గానికి చెందినవారు. తనకు ఇష్టం లేకపోయినప్పటికీ పార్టీ ఆదేశాల మేరకు 2019లో ఇక్కడ బరిలో దిగారు. గెలిచాక నియోజకవర్గాన్ని అంతగా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీనికితోడు స్వపక్షంలో అసమ్మతి సెగలు ఆయనకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఐక్యంగా ఉండటం వల్ల ఇక్కడ బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశం దాదాపుగా లేదు.

అధీర్‌రంజన్‌ పోటీగా మాజీ క్రికెటర్
బంగాల్​లోని బహరంపుర్‌ నియోజకవర్గంలో పోరు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక్కడ వరుసగా అయిదుసార్లు గెలుపొందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, సిటింగ్‌ ఎంపీ అధీర్‌రంజన్‌ చౌధరీ మరోసారి పోటీలో ఉన్నారు. ఆయనపై భారత జట్టు మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ను తృణమూల్‌ కాంగ్రెస్‌ బరిలో దింపింది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉండగా, వాటిలో ఆరు తృణమూల్‌ ఖాతాలోనివే. మరొకటి బీజేపీ సిటింగ్‌ స్థానం. ఈ నియోజకవర్గంలో ముస్లింలు 50% వరకూ ఉన్నారు. వారి అండతో ఈసారి పఠాన్‌ కచ్చితంగా విజయం సాధిస్తారని తృణమూల్‌ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. పఠాన్‌ స్థానికేతరుడని ప్రచారంలో కాంగ్రెస్‌ పదేపదే పేర్కొంటోంది. బీజేపీ ఇక్కడ నిర్మల్‌కుమార్‌ సాహాకు టికెట్‌ కేటాయించింది.

ఖూంటీ బరిలో అర్జున్​ ముండా
ఝార్ఖండ్‌లోని ఖూంటీ స్థానంలో సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న అర్జున్‌ ముండా బీజేపీ అభ్యర్థిగా మరోసారి అక్కడే పోటీకి దిగారు. మూడుసార్లు ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. స్వరాష్ట్రంలోనే కాకుండా బిహార్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలోనూ గిరిజన దిగ్గజ నేతల్లో ఒకరిగా ఈయనకు పేరుంది. 2019లో కాంగ్రెస్‌ అభ్యర్థి కాళీచరణ్‌ ముండాపై 1,445 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ప్రస్తుతం హస్తం పార్టీ మళ్లీ కాళీచరణ్‌కే టికెట్‌ కేటాయించింది. దీంతో మరోసారి హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఖూంటీ ఎస్టీ రిజర్వుడు సీటు. 1984 తర్వాత బీజేపీ ఇక్కడ ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది.

లోకల్​ vs నాన్​లోకల్​
బాలీవుడ్‌ బిహారీ బాబుగా అందరికీ సుపరిచితులైన కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా ప్రస్తుతం బంగాల్​లోని అసన్సోల్‌ స్థానంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 50% మంది బెంగాలీయేతరులే. అందులోనూ అత్యధికులు బిహారీలే. అందుకే 2022 ఉప ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ఇక్కడ శత్రుఘ్నకు తృణమూల్‌ టికెట్‌ ఇచ్చింది. నాడు విజయం సాధించిన ఆయనే మళ్లీ ఇప్పుడు బరిలో దిగారు. ఆయన్ను బయటి వ్యక్తిగా ప్రచారం చేస్తున్న బీజేపీ, స్థానిక నేత, సర్దార్‌జీగా అందరూ పిలుచుకునే కేంద్ర మాజీ మంత్రి సురేంద్రజీత్‌సింగ్‌ అహ్లువాలియాకు టికెట్‌ కేటాయించింది. స్థానికుడికి, స్థానికేతరుడికి మధ్య పోరుగా ఇక్కడి ఎన్నికలను మార్చింది. సీపీఎం అభ్యర్థిగా జహనారా ఖాన్‌ బరిలో ఉన్నప్పటికీ, పోటీ ప్రధానంగా బిహారీ బాబు, సర్దార్‌జీల మధ్యే కనిపిస్తోంది. తాగునీటి కొరత, నిరుద్యోగిత వంటివి ఈ నియోజకవర్గ ప్రజల ప్రధాన సమస్యలు.

భార్య ఓటమికి రివెంజ్ ప్రణాళికలు
సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ప్రస్తుతం కన్నౌజ్‌ నుంచి బరిలో నిలిచారు. తొలుత ఇక్కడ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ అల్లుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించిన ఎస్పీ, తర్వాత మనసు మార్చుకుంది. అఖిలేశ్‌ స్వయంగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. 2000, 2004, 2009 ఎన్నికల్లో ఆయన కన్నౌజ్‌ ఎంపీగా గెలిచారు. 2012లో యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఈ స్థానాన్ని వీడారు. అప్పుడు ఉప ఎన్నికల్లో అఖిలేశ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014లో కన్నౌజ్‌లో గెలిచిన ఆమె, 2019లో బీజేపీ అభ్యర్థి సుబ్రత్‌ పాఠక్‌ చేతిలో ఓడిపోయారు. ఈసారి డింపుల్‌ మైన్‌పురి బరిలో నిలవగా అఖిలేశ్‌ కన్నౌజ్‌లో పోటీ చేస్తున్నారు. బీజేపీ ఇక్కడ సిటింగ్‌ ఎంపీ సుబ్రత్‌ పాఠక్‌కు మరోసారి టికెట్‌ ఇచ్చింది. అయిదేళ్ల కిందట తన భార్యను ఓడించిన సుబ్రత్‌పై బదులు తీర్చుకోవాలని అఖిలేశ్‌ ప్రణాళికలు రచిస్తున్నారు.

ఈసారి ఆ వర్గం మద్దతునిస్తుందా?
బిహార్‌లోని ఉజియార్‌పుర్‌ నుంచి కేంద్ర మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ మరోసారి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. డీలిమిటేషన్‌ తర్వాత 2008లో ఏర్పాటైన ఉజియార్‌పుర్‌లో జేడీయూ, బీజేపీలే గెలుస్తూ వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆర్‌ఎల్‌ఎస్​పీ తరఫున పోటీ చేసిన ఉపేంద్ర కుశ్వాహా రెండో స్థానంలో నిలిచారు. ఈసారి ఆర్​జేడీ తరఫున సీనియర్‌ నేత అలోక్‌ మెహతా మరోసారి బరిలోకి దిగారు. గత రెండు ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించడంలో తమకు ఎవరూ సాయం చేయడం లేదనే అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో ఉంది. బీజేపీ ఓబీసీలపై, ఆర్​జేడీ ముస్లిం-యాదవ్‌ సమీకరణాలపై ఆధారపడుతున్నాయి. అయితే గత ఎన్నికల్లో యాదవ్‌ వర్గానికి చెందిన నిత్యానంద్‌ రాయ్‌ వెంట యాదవులు నడిచారు.

బిహార్‌పైనే ఆ ఏడుగురి ఆశలు- ఫేజ్​4లో కీలక నేతలు- ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు రప్పించడమే పెద్ద సవాల్! - Lok sabha elections 2024

పార్టీ రెండు ముక్కలయ్యాక తొలి ఎన్నికలు- ముంబయి ప్రజలు ఎవరివైపు ఉన్నారో? - Lok Sabha Elections 2024

ABOUT THE AUTHOR

...view details