తెలంగాణ

telangana

దేవెగౌడ ఫ్యామిలీ పాలిటిక్స్​- ఒకే కుటుంబం నుంచి బరిలో 9మంది- ఎక్కడ చూసినా వాళ్లే! - Devegowda Family In Politics

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 7:56 AM IST

Updated : Apr 6, 2024, 11:03 AM IST

Devegowda Family Members In Politics : లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి ఇలా చట్టసభల్లో ఎక్కడ చూసినా ఒక కుటుంబానికి ప్రాతినిథ్యం ఉంటోంది. అదే మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవెగౌడ కుటుంబం. కుటుంబ పార్టీగా జేడీఎస్‌కు ముద్రపడినా, ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పించినా, ఎన్నికల్లో ఆ కుటుంబానికి చెందిన వారు పోటీ చేయడం మాత్రం ఆగడం లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా దేవెగౌడ కుటుంబానికి చెందిన ముగ్గురు బరిలో ఉండటం గమనార్హం.

Devegowda Family Members In Politics
Devegowda Family Members In Politics

Devegowda Family Members In Politics :మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవెగౌడకు కుటుంబానికి చెందిన ముగ్గురు కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభస్థానాలు ఉండగా పొత్తులో భాగంగా మూడు స్థానాలను జేడీఎస్‌కు బీజేపీ కేటాయించింది. 25 చోట్ల కమలదళం పోటీ చేస్తోంది. దేవెగౌడ కుమారుడు మాజీ సీఎం HD కుమార స్వామి మండ్య నియోజకవర్గం నుంచి జేడీఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే మండ్య నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటి సుమలత బీజేపీ మద్దతుతో గెలుపొందారు. పొత్తులో భాగంగా ఈసారి మండ్య నియోజకవర్గాన్ని జేడీఎస్‌కు బీజేపీ కేటాయించడం వల్ల సుమలత పోటీ నుంచి తప్పుకున్నారు. బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన సుమలత మండ్యలో కుమారస్వామికి మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు.

దేవెగౌడ కుటుంబంలో 9మంది
దేవెగౌడ అల్లుడు ప్రముఖ కార్డియాలజిస్టు CN మంజునాథ బెంగళూరు రూరల్‌ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. పొత్తు చర్చల్లో భాగంగానే CN మంజునాథ బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవన్న హసన్‌ నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. గతంలో హసన్‌ నుంచే ప్రజ్వల్‌ రేవన్న జేడీఎస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. మొత్తంగా దేవెగౌడ కుటుంబానికి చెందిన 9 మంది రాజకీయాల్లో ఉన్నారు.

అన్నింట్లో ప్రాతినిథ్యం!
మాజీ ప్రధాని దేవెగౌడ కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆయన కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి చన్నపట్న నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. బెంగళూర్‌ రూరల్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి చన్నపట్న వస్తుంది. గత అసెంబ్లీలో కుమారస్వామి భార్య అనిత రామనగర నుంచి ఎమ్మెల్యేగా ఉండేవారు. జేడీఎస్‌ యువజన విభాగం నేతగా ఉన్న కుమారస్వామి కొడుకు నిఖిల్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నుంచి, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దేవెగౌడ పెద్ద కుమారుడు HD రేవన్న హోలెనర్సిపుర నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. HD రేవన్న భార్య భవాని రేవన్న హసన్‌ జిల్లా పరిషత్‌ సభ్యురాలిగా ఉన్నారు. వారి కొడుకు సూరజ్‌ ఎమ్మెల్సీగా ఉన్నారు. లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి ఇలా ఎక్కడ చూసినా దేవెగౌడ కుటుంబానికి ప్రాతినిథ్యం ఉండటం గమనార్హం.

దేవెగౌడ కుటుంబానికి చెందిన ముగ్గురు లోక్‌సభ ఎన్నికల బరిలో ఉండటం ఇది వరుసగా రెండోసారి. దక్షిణ కర్ణాటకగా భావించే పాత మైసూర్‌ ప్రాంతంలో జేడీఎస్‌కు పట్టు ఉంది. ఇక్కడ దేవెగౌడకు చెందిన వొక్కళిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దేవెగౌడ తుమ్‌కుర్‌ నుంచి, ప్రజ్వల్‌ రేవన్న హసన్‌ నుంచి, కుమారస్వామి కొడుకు నిఖిల్‌ మండ్య నుంచి పోటీ చేశారు. కానీ ఒక్క ప్రజ్వల్‌ రేవన్న మాత్రమే గెలుపొందారు. 2019లో కాంగ్రెస్‌, జేడీఎస్‌ పొత్తు పెట్టుకుని బరిలోకి దిగగా కాంగ్రెస్‌ నుంచి ప్రస్తుత డిప్యూటీ సీఎం DK శివకుమార్‌ సోదరుడు DK సురేష్‌, జేడీఎస్‌ నుంచి ప్రజ్వల్‌ రేవన్న మాత్రమే విజయం సాధించారు.

కుటుంబ పార్టీ విమర్శలు
2023 శాసనసభ ఎన్నికల్లో చన్నపట్న నుంచి కుమారస్వామి, హోలెనర్సిపుర నుంచి HD రేవన్న, రామనగర నుంచి నిఖిల్‌ కుమారస్వామి పోటీ చేశారు. వీరిలో కుమారస్వామి, HD రేవన్న గెలవగా నిఖిల్‌ ఓడిపోయారు. 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కూడా కుమారస్వామి, HD రేవన్న గెలుపొందారు. ఆ ఎన్నికల్లో రామనగర, చెన్నపట్న రెండు చోట్ల కుమారస్వామి నెగ్గగా ఉప ఎన్నికల్లో రామనగర నుంచి కుమారస్వామి భార్య అనిత గెలుపొందారు. జేడీఎస్‌ పూర్తిగా కుటుంబ పార్టీగా మారిపోవడం విమర్శలకు తావిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కుమారస్వామి మాత్రం తమ కుటుంబసభ్యులు ఎన్నికల్లో పోటీ చేయడాన్ని సమర్థించుకుంటున్నారు. సరైన అభ్యర్థి లేని చోట పార్టీ, కార్యకర్తల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ కుటుంబ సభ్యులు బరిలోకి దిగాల్సి వస్తోందని అన్నారు. ప్రత్యర్థి పార్టీలు మాత్రం జేడీఎస్‌ కుటుంబ పార్టీ అని విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి.

ఆ ఒక్కచోటే
2024 సార్వత్రిక ఎన్నికల్లో దేవెగౌడ కొడుకు, మనవడు, అల్లుడు బరిలోకి దిగడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌ విమర్శలు గుప్పించారు. వారిలో ఒక్కరు కూడా విజయం సాధించరని జోస్యం చెప్పారు. జేడీఎస్‌లో మరో అభ్యర్థే లేరా అంటూ ప్రశ్నించారు. జేడీఎస్‌ బలహీనమైందన్న శివకుమార్‌ దేవెగౌడ అల్లుడు బీజేపీ టికెట్‌పై ఎందుకు పోటీ చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. ముఖ్యంగా వొక్కళిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పాత మైసూరు ప్రాంతం, ఉత్తర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో మినహా జేడీఎస్‌ పెద్దగా ఎదగలేకపోవడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఎన్నికల్లో కుమారస్వామి మండ్య నుంచి గెలిస్తే చెన్నపట్న ఉప ఎన్నికలో ఆయన కుమారుడు నిఖిల్‌ పోటీ చేస్తారనే ఊహాగానాలు ఇప్పటికే మొదలయ్యాయి. గత ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దేవెగౌడ కుటుంబంలో కొన్ని విభేదాలు వచ్చాయి. HD రేవన్న భార్య భవానీ హసన్‌ నుంచి పోటీ చేయాలని భావించారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కుమారస్వామి స్థానిక నేత HP స్వరూప్‌కు టికెట్‌ ఇచ్చారు. ఆయన విజయం సాధించేలా కృషి చేశారు.

Last Updated : Apr 6, 2024, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details