తెలంగాణ

telangana

బంగాల్​లో బిహారీ బాబు Vs సర్దార్ జీ- రెండు పార్టీలూ స్పెషల్ ఫోకస్​- గెలుపెవరిదో? - Lok Sabha Elections 2024

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 8:34 AM IST

Bengal Asansol Lok Sabha Polls 2024 : బంగాల్‌లోని అసన్‌సోల్‌ నియోజకవర్గంపై బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి సారించాయి. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన బీజేపీ మరోసారి అదే దూకుడు ప్రదర్శించాలని చూస్తోంది. 2022లో అసన్‌సోల్‌కు జరిగిన ఉపఎన్నికలో తృణమూల్‌ కాంగ్రెస్ బాలీవుడ్‌ నటుడు శత్రుఘ్న సిన్హాను బరిలో దించి విజయం సాధించింది. దీంతో శత్రుఘ్న సిన్హాకు గట్టి పోటీ ఇచ్చేందుకు సర్దార్‌జీగా పేరొందిన సీనియర్‌ నేత సురేంద్రజీత్‌ సింగ్‌ను బీజేపీ బరిలో దించింది.

Shatrughan Sinha And Surendrajeet Singh
Shatrughan Sinha And Surendrajeet Singh (ETV Bharat)

Bengal Asansol Lok Sabha Polls 2024 : బంగాల్​లో తృణమూల్‌ కాంగ్రెస్‌ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని చూస్తున్న బీజేపీ, లోక్‌సభ ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అసన్‌సోల్‌ స్థానంపై దృష్టి సారించింది. బొగ్గు గనులకు నిలయమైన ఈ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇక్కడి నుంచి టీఎంసీ తరఫున బిహారీ బాబుగా పేరొందిన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శత్రుఘ్నసిన్హా బరిలోఉండగా, సర్దార్‌జీగా పేరొందిన సీనియర్‌ నేత సురేంద్రజీత్‌ సింగ్‌ అహ్లూవాలియాను బీజేపీ బరిలో దింపింది. దీంతో ఈ స్థానంపై తీవ్ర ఆసక్తి నెలకొంది.

బిహార్‌, యూపీ నుంచి వచ్చినవారే!
మైనింగ్‌తో పాటు పరిశ్రమలకు నిలయమైన అసన్‌సోల్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న రాణిగంజ్‌, పాండవేశ్వర్‌, జమురియా అసెంబ్లీ నియోజకవర్గాలు బొగ్గు గనులు, పరిశ్రమలకు ప్రసిద్ధి. ఝార్ఖండ్‌కు సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో హిందీ మాట్లాడేవారే అధికంగా నివసిస్తున్నారు. ఇక్కడి గనులు, పరిశ్రమల్లో పని చేసేవారు ఎక్కువగా బిహార్‌, యూపీ నుంచి వచ్చినవారే. దీంతో వారిని ఆకర్షించేందుకు అధికార, విపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. మూడు దశాబ్దాల పాటు కమ్యూనిస్టుల చేతుల్లో ఉన్న ఈ స్థానాన్ని 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. రెండేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో ఈ స్థానాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌ దక్కించుకుంది.

శత్రుఘ్న సిన్హాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్!
బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శత్రుఘ్న సిన్హా పట్నాకు చెందినవారు. బిహారీ బాబుగా పేరొందిన ఆయనను తృణమూల్‌ కాంగ్రెస్‌ మరోసారి బరిలో నిలిపింది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున రెండుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన బాబుల్‌ సుప్రియో, 2021 చివర్లో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత 2022లో జరిగిన ఉప ఎన్నికలో శత్రుఘ్నసిన్హా భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈసారి మళ్లీ ఆయన్నే టీఎంసీ పోటీలో నిలిపింది. బాలీవుడ్‌ అగ్ర నాయకుల్లో ఒకరైన శత్రుఘ్నసిన్హా 1979లో వచ్చిన "కాలా పత్తర్‌" సినిమాలో అమితాబ్‌తో కలిసి నటించారు. అసన్‌సోల్‌కు సమీపంలో ఉన్న చస్నాలా బొగ్గు గనిలో జరిగిన విషాదం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ ప్రాంతంలో శత్రుఘ్నసిన్హాకు ఇంకా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్నట్లు స్థానిక నేతలు చెబుతున్నారు.

సిన్హాకు పోటీగా సురేంద్ర జీత్
అసన్‌సోన్‌ స్థానికుడైన సురేంద్రజీత్‌ సింగ్‌ అహ్లూవాలియాను బీజేపీ పోటీలో నిలిపింది. రాజ్యసభ మాజీ ఎంపీ అయిన సింగ్‌, 2014లో దార్జీలింగ్‌, 2019లో బర్ధమాన్‌-దుర్గాపుర్‌ నుంచి గెలుపొందారు. ఈసారి తొలుత భోజ్‌పురి గాయకుడు పవన్‌సింగ్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తున్నట్లు బీజేపీ ప్రకటించినప్పటికీ, పోటీ నుంచి ఆయన తప్పుకోవడం వల్ల సర్దార్‌జీకి కేటాయించింది. అయితే ఈ లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు శాసనసభ స్థానాల్లో ఐదు టీఎంసీ చేతిలోనే ఉండటం వల్ల అహ్లూవాలియా గట్టి పోటీ ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది.

సీపీఎం నుంచి ఆయన!
అటు సీపీఎం నుంచి ఎమ్మెల్యే జహనారా ఖాన్‌ బరిలో ఉన్నారు. స్థానికంగా ఉన్న తాగునీటి సమస్యను లేవనెత్తిన ఆయన, శత్రుఘ్నసిన్హా, సుప్రియోలు వీటిపై కనీస శ్రద్ధ వహించలేదన్నారు. ఇక్కడి పరిశ్రమలు ఎంతోకాలంగా మూతపడటం, అక్రమ మైనింగ్‌ జోరుగా సాగుతుండటం వంటి అంశాలను ప్రచారం చేస్తున్నారు. ఎంపీలుగా ఉన్న ఇద్దరు నేతలు వారి సిటింగ్‌ స్థానాలకు ఏం చేశారని ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. నాలుగో విడతలో భాగంగా మే 13న ఇక్కడ పోలింగ్‌ జరగనుంది.

గుజరాత్​ ఎన్నికల్లో కులం కీలకం- 'క్యాస్ట్​ పాలిటిక్స్​'లో ఏ పార్టీ​ సక్సెస్ అయ్యేనో? - lok sabha elections 2024

వారసుల విజయం కోసం కన్నడ 'సీనియర్' నేతల ఆరాటం- ఖర్గే, యడియూరప్పకు చాలా ముఖ్యం! - Lok Sabha Elections 2024

ABOUT THE AUTHOR

...view details