తెలంగాణ

telangana

అరటి పండ్లు ఆరోగ్యానికి మంచివే - కాని అతిగా తింటే ఈ ప్రాబ్లమ్స్ గ్యారెంటీ!

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 9:28 AM IST

Banana Side Effects : అరటి పండు.. ధనికులతోపాటు పేదవాళ్లకు అందుబాటులో ఉండే మొదటి పండు ఇది. ఎన్నో పోషకాలుండే ఈ పండు.. అన్ని కాలాల్లోనూ లభిస్తుంది. చిన్నాపెద్దా తేడాలేకుండా.. ప్రతి ఒక్కరూ ఈ పండును ఇష్టపడుతుంటారు. అయితే.. వీటిని అతిగా తింటే మాత్రం ఆరోగ్యానికే మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Banana Side Effects
Banana

Side Effects of Bananas : సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో అందరికీ అందుబాటులో ఉండే పండు.. అరటి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి స్థాయిలను పెంచుతుంది. పేగు ఆరోగ్యాన్ని పెంపొందించి జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అయితే.. ఈ పండును అతిగా తింటే అనర్థాలు తప్పవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ, రోజుకు ఎన్ని అరటిపండ్లు(Bananas) తినాలి? ఎక్కువగా తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రోజుకి ఎన్ని అరటిపండ్లు తీసుకోవాలంటే :హెల్త్‌లైన్ ప్రకారం.. అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ B6 పుష్కలంగా ఉంటాయి. 2014లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం.. అరటిపండ్లను రోజూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని వెల్లడైంది. అదేవిధంగా ఆస్ట్రేలియా పరిశోధకులు చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. జీర్ణక్రియ సంబంధింత ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్, క్రోన్స్ వ్యాధిని దూరం చేయగల సత్తా అరటిపండుకే ఉంది.

అరటిపండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, మితంగా తీసుకోవడం చాలా కీలకమంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా రోజుకు రెండు అరటిపండ్ల కంటే ఎక్కువ తినకూడదని సిఫార్సు చేస్తున్నారు నిపుణులు. అయితే, కఠినమైన శారీరక శ్రమ లేదా సాధారణ వ్యాయామాలలో పాల్గొనే వ్యక్తులు కోల్పోయిన శక్తి స్థాయిలను తిరిగి పొందడానికి డైలీ మూడు అరటిపండ్లను తీసుకోవచ్చని చెబుతున్నారు. మధుమేహం ఉన్న వ్యక్తులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

అరటిపండు ఏ టైమ్​లో తినాలి?.. పరగడుపున తింటే ప్రమాదమా?

అతిగా తింటే వచ్చే ఆరోగ్య సమస్యలు : అరటిపండ్లలో పోషక విలువలు అధికంగా ఉన్నప్పటికీ, వీటిని అధికంగా తీసుకోవడం కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..

  • అరటిపండ్లలో ఉండే సహజ చక్కెరల కారణంగా అతిగా తినడం దంత క్షయానికి కారణమవుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే స్టార్చ్ తినేటప్పుడు దంతల మధ్య సులభంగా అంటుకుంటుంది. కాబట్టి అరటిపండు తిన్న రెండు గంటల్లోపు దంతాలు శుభ్రం చేసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.
  • అంతేకాకుండా, అరటిపండ్లలో విటమిన్ B6 పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని అధికంగా తీసుకోవడం వల్ల నరాలు దెబ్బతినవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
  • ఇక ముఖ్యంగా ఎక్కువగా అరటి పండ్లు తింటే త్వరగా బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది.
  • పచ్చి అరటిపండ్లు ఎక్కువ మొత్తంలో స్టార్చ్‌ను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని అధికంగా తీసుకుంటే మలబద్ధకం, కడుపు నొప్పి, గ్యాస్‌ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కలిగిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
  • అరటిపండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను గ్లైసెమిక్ మూలకాలను కలిగి ఉంటాయి. అందుకే మధుమేహం ఉన్న వాళ్లు వీటిని వైద్యులను సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.
  • కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు అరటిపండు వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించడం బెటర్. ఎందుకంటే వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కిడ్నీ బాధితులు ఈ పండ్లను తినకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

అరటిపళ్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! షుగర్​ పేషెంట్లు తినొచ్చా?

ABOUT THE AUTHOR

...view details