తెలంగాణ

telangana

'ఫ్రీజ్​ అయింది కాంగ్రెస్ పార్టీ ఖాతాలు కాదు, దేశ ప్రజాస్వామ్యం!' - Congress Allegations On BJP

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 2:15 PM IST

Updated : Mar 21, 2024, 3:14 PM IST

Congress Allegations On BJP : లోక్​సభ ఎన్నికల వేళ మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. తమ పార్టీ ఖాతాలను స్తంభింప చేయటం వల్ల ప్రజాస్వామ్యానికి బీజేపీ తీవ్ర నష్టం కలిగించిందని ఆరోపించింది. ఎన్నికల ముందు కావాలనే బీజేపీ కావాలనే చేస్తోందని విమర్శించింది. మరోవైపు, కాంగ్రెస్​కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే అబద్ధాలు ఆడుతోందని బీజేపీ వ్యాఖ్యలు చేసింది.

Congress Allegations On BJP
Congress Allegations On BJP

Congress Allegations On BJP : తమ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింప​ చేసి ప్రజాస్వామ్యానికి కేంద్రం తీవ్ర నష్టం కలిగించిందని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలు కాంగ్రెస్‌ పార్టీపైనే కాక, ప్రజాస్వామ్యంపైనా ప్రభావం చూపనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత సోనియా గాంధీతో కలిసి దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ విమర్శలు కురిపించారు.

ఈసీ కూడా స్పందించటం లేదు
'కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి చేస్తున్నది నేరపూరిత చర్య. మా బ్యాంకు ఖాతాలను స్తంభింప చేశారు. దీని వల్ల మేము ఏమీ చేయలేకపోతున్నాం. ఎన్నికల వేళ ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వలేకపోతున్నాం. మా నేతలను ఎక్కడికీ పంపించలేకపోతున్నాం. సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు ఇలా చేయడం దారుణం. ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం అనేదే లేకుండా పోయింది. అది అబద్ధంగా మారింది. దేశంలో 20శాతం ఓటర్లు మాకు మద్దతుగా ఉన్నారు. కానీ మేం రెండు రూపాయలు కూడా చెల్లించలేకపోతున్నాం. ఈ బ్యాంకు ఖాతాల విషయంపై ఫిర్యాదు చేసినా ఈసీ స్పందించట్లేదు' అని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

కుట్రపూరితమైన చర్యలు
మా పార్టీని దెబ్బతీసేలా కుట్రపూరిత చర్యలకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ ఆరోపించారు. 'తమ పార్టీ ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరించిన నిధులను స్తంభింప చేశారు. అంతేకాకుండా తమ బ్యాంకు ఖాతాల నుంచి బలవంతంగా డబ్బులను తీసుకుంటోంది. ఓవైపు ఎన్నికల బాండ్ల వ్యవహారం, మరోవైపు దేశంలోని ప్రధాన ప్రతిపక్షం ఆర్థిక లావాదేవీలపై దాడి జరుగుతోంది . తీవ్రమైన సవాళ్ల మధ్య కూడా బలంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాం. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు ఇంతకుపూర్వం ఎప్పుడు జరగలేదు' అని సోనియా గాంధీ విమర్శించారు.

'దర్యాప్తు సంస్థల నియంత్రణలో ఉండకూడదు'
సమయం చూసి​ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. 'లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలంటే తమ బ్యాంకు ఖాతాలను అన్‌ఫ్రీజ్‌ చేయాలి. అభ్యర్థులకు ఇచ్చేందుకు డబ్బు లేదు. అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేసేందుకు అనుకూలంగా ఉండాలి. కానీ ఈడీ, ఐడీ ఇతర దర్యాప్తు సంస్థల నియంత్రణతో ఉండకూడదు. సుప్రీం కోర్టు జోక్యం తర్వాత వెలువడిన ఎలక్టోరల్​ బాండ్ల వాస్తవాలు దేశం ప్రతిష్టను దెబ్బతీశాయి' అని మల్లికార్జున ఖర్గే విమర్శించారు.

'ఆర్థికంగా దివాలా కాదు- నైతికంగా కాంగ్రెస్ దివాలా'
మరోవైపు, కాంగ్రెస్ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించబోతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ఆ పార్టీకి చారిత్రక ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు. అందుకే ఆ పార్టీ నాయకులు మీడియాతో భారత ప్రజాస్వామ్యం, సంస్థలపై విరుచుకుపడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ తన అసమర్థతను ఆర్థిక ఇబ్బందులు అంటూ నిందిస్తోందని అన్నారు. కానీ వాస్తవానికి వారు ఆర్థికంగా దివాలా తీయలేదని, నైతికంగా, మేధోపరంగా దివాలా తీశారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ తమ తప్పులను సరిదిద్దుకోవడానికి బదులుగా అధికారులను నిందిస్తోందని నడ్డా ఆరోపించారు. ఐటీఏటీ లేదా దిల్లీ హైకోర్టు నిబంధనలకు లోబడి ఉండాలని, పన్నులు చెల్లించాలని కాంగ్రెస్​ను కోరాయని కానీ ఆ పార్టీ ఎప్పుడూ అలా చేయలేదని అన్నారు. ప్రతి రంగాన్ని, ప్రతి రాష్ట్రాన్ని, చరిత్రలోని ప్రతి క్షణాన్ని దోచుకున్న పార్టీ ఆర్థిక నిస్సహాయత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. జీపు నుంచి హెలికాప్టర్ల వరకు అన్ని కుంభకోణాల నుంచి కూడబెట్టిన సొమ్మును బోఫోర్స్ ద్వారా కాంగ్రెస్ తమ ఎన్నికల ప్రచారానికి వాడుకోవచ్చని నడ్డా ఎద్దేవా చేశారు.

ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా రాహుల్ వ్యాఖ్యలు!
కాంగ్రెస్ సకాలంలో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయలేదని, అందుకే వారి ఖాతాలు స్తంభించిపోయాయని బీజేపీ నేత రవిశంకర్​ ప్రసాద్​ అన్నారు. ఈ విషయంపై రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారని, తమ వ్యాఖ్యలతో ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా చేశారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో కూడా కాంగ్రెస్​కు న్యాయపరమైన ఉపశమనం లభించలేదని, అందుకే అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యలు చేశారు.

వామపక్షాలకు 'డూ ఆర్‌ డై'- లోక్​సభ ఎన్నికల్లో మనుగడ కోసం పోరాటం!

ఎన్నికల వేళ ప్రత్యర్థులపై ప్రైవేటు నిఘా- డిటెక్టివ్​ ఏజెన్సీలకు పెరుగుతున్న గిరాకీ!

Last Updated : Mar 21, 2024, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details