ETV Bharat / bharat

ఎన్నికల వేళ ప్రత్యర్థులపై ప్రైవేటు నిఘా- డిటెక్టివ్​ ఏజెన్సీలకు పెరుగుతున్న గిరాకీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 7:11 AM IST

Lok Sabha Polls Detective Agencies : ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థుల బలాబలాలు, సహాచరుల కదలికలపై రాజకీయ పార్టీలు దృష్టి పెడుతున్నాయి. అందుకోసం ప్రైవేటు డిటెక్టివ్ ఏజేన్సీలను సంప్రదిస్తున్నాయి. దీంతో ఈ డిటెక్టివ్​లకు భారీ గిరాకీ పెరుగుతున్నట్లు సమాచారం.

Lok Sabha Polls Detective Agencies
Lok Sabha Polls Detective Agencies

Lok Sabha Polls Detective Agencies : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడం వల్ల దేశవ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంది. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు, టికెట్లు కోరుతున్న ఆశావహులు, వారి ప్రత్యర్థులు, సహచరుల కదలికలపై రాజకీయ పార్టీలు దృష్టి పెడుతున్నాయి. మరోవైపు ఇతర పార్టీల వ్యూహాలను పసిగట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ప్రైవేటు వ్యక్తులనూ నియమించుకుంటున్నాయి. దీంతో లోక్​సభ ఎన్నికల్లో ప్రైవేటు డిటెక్టివ్‌ ఏజెన్సీలకు భారీ గిరాకీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ ఎన్నికల సమయంలో రాజకీయ ఫిరాయింపులు, క్యాంపులు మార్చడం వంటి వ్యవహారాలు వంటివి జరుగుతుంటాయి. అలాగే కీలక సమాచారాన్ని ప్రత్యర్థులకు అందించే అవకాశం ఉంటుంది. అలాంటి వారిని తెలుసుకునేందుకు, వారిపై నిఘా ఉంచే పనిని డిటెక్టివ్‌ ఏజెన్సీలకు రాజకీయ పార్టీలు అప్పగిస్తున్నాయట. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఎవరు పార్టీలు మారే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తించడం ఈ డిటెక్టివ్​ పని. అనుకూలమైన ఫలితాలు కోసం ఎంత ఖర్చుచేసేందుకైనా రాజకీయ పార్టీలు వెనకాడటం లేదని నిఘా సంస్థలు చెప్పడం గమనార్హం.

అభ్యర్థుల చరిత్రపై నిఘా
ప్రత్యర్థుల అవినీతి, నేర చరిత్ర, కుంభకోణాలు, అక్రమ సంబంధాలు, సంబంధిత వీడియోలు, అనుసరించాల్సిన వ్యూహాలే ప్రధాన అంశాలుగా డిటెక్టివ్‌లను రాజకీయ పార్టీలు నియమించుకుంటున్నాయి. ప్రత్యర్థులతో తమ సహాయకులు, సిబ్బంది కుమ్మక్కు అవుతున్నారా? అనే విషయాన్ని ముందుగానే పసిగట్టేందుకు రాజకీయ నాయకులు, అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. అభ్యర్థుల జాబితాలో పేర్లు లేకపోవడం వల్ల నిరాశకు గురైన వారితోపాటు, సీటు పొందిన వారు తమ ప్రత్యర్థుల బలాలను తెలుసుకునేందుకు డిటెక్టివ్‌లను సంప్రదిస్తున్నారని దిల్లీ కేంద్రంగా పనిచేసే జీడీఎక్స్‌ డిటెక్టివ్స్‌ లిమిటెడ్‌ ఎండీ మహేశ్‌ చంద్ర శర్మ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నిఘా అనేది ఎంతోకాలంగా ఉందన్నారు.

నగదు, మద్యంపై కన్ను
ఎన్నికల తేదీలు ప్రకటించడానికి కొన్ని నెలల ముందు నుంచే రాజకీయ పార్టీలు ఈ ప్రైవేటు డిటెక్టివ్​లను నియమించుకున్నట్లు సిటీ ఇంటెలిజెన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ఎండీ రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. కేవలం ప్రత్యర్థుల సమాచారమే కాకుండా అభ్యర్థుల బలాలు, ఎన్నికల్లో విజయం సాధిస్తే పదవులు నిర్వర్తించే సామర్థ్యాలపైనా నివేదికలు రూపొందించాలని కోరుతున్నట్లు చెప్పారు. వాటితో పాటు పార్టీలకు నగదు, మద్యం ఎక్కడ నుంచి వస్తోంది?, వాటిని ఎక్కడ నిల్వ చేస్తున్నారు? పంపిణీ చేసేందుకు ఎటువంటి పద్ధతులు అనుసరిస్తున్నారు? వంటివి కనిపెట్టే పనులను డిటెక్టివ్‌లకు అప్పగిస్తున్నట్లు రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.

ఎన్నికల ఫలితాల అంచనా
ప్రత్యర్థుల ప్రజాదరణతో పోలిస్తే తమ అభ్యర్థి బలాబలాలు, రాజకీయాల్లో కొత్త ముఖాలను దించే అంశంపైనా తమను ఎక్కువగా సంప్రదిస్తున్నారని దిల్లీ కేంద్రంగా పనిచేసే మరో డిటెక్టివ్‌ ఏజెన్సీ ఎండీ నమాన్‌ జైన్‌ పేర్కొన్నారు. వీటితో పాటు సమగ్ర సర్వేల ద్వారా ఎన్నికల ఫలితాలను కూడా అంచనా వేయడం మరో ముఖ్య అంశమన్నారు. ఇలా ఎన్నికల ప్రచార సమయంలో డిటెక్టివ్‌ల పాత్ర ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగిందని తెలిపారు.

ఎన్నికల కోసం 60+ఏజ్​లో పెళ్లి- లాలూ ప్రసాద్​ కోరికను కాదనలేకపోయిన మాజీ గ్యాంగ్​స్టర్​!

'లీటర్​ పెట్రోల్ రూ. 75, డీజిల్​ రూ.65- టోల్​గేట్ ఫీజు ఉండదు' డీఎంకే మేనిఫెస్టో రిలీజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.