సుప్రీంలో మార్గదర్శికేసు - గాదిరెడ్డి యూరిరెడ్డికి చుక్కెదురు

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 10:00 AM IST

thumbnail

Supreme Court Dismissed Gadireddy Yuri Reddy SLP: షేర్ల బదలాయింపు ఆరోపణలతో మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఛైర్మన్‌ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్‌పై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు దర్యాప్తును నిలిపివేస్తూ.. ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై గాదిరెడ్డి యూరిరెడ్డి దాఖలు చేసిన ఎస్​ఎల్​పీని సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది. తన ఫిర్యాదును ప్రాతిపదికగా తీసుకొని సీఐడీ నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ ఆధారంగా చేపట్టే తదుపరి చర్యలన్నింటిని ఎనిమిది వారాలు నిలిపివేయడంతోపాటు, ప్రతివాదులుగా ఉన్న సీఐడీకి, తనకు హైకోర్టు నోటీసులు జారీ చేయడాన్ని యూరిరెడ్డి సవాల్‌ చేశారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన కేసు సోమవారం జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. 

విచారణ ప్రారంభమైన వెంటనే యూరిరెడ్డి తరఫు న్యాయవాది డి.శివరామిరెడ్డి వాదనలు ప్రారంభిస్తూ హైకోర్టు తమ వాదనలు వినకుండానే మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందని, అలాగే దర్యాప్తుపై స్టే విధించడానికి సహేతుకమైన కారణాలు చెప్పలేదని పేర్కొన్నారు. జోక్యం చేసుకున్న జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌.. ఎన్నిరోజులు స్టే విధించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. 8 వారాలు అని ఆయన చెప్పగా.. ఈ కేసు ఇంకా హైకోర్టు పరిధిలోనే ఉంది కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే తన వాదనలు వినకుండా ఉత్తర్వులు జారీ చేశారని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అవి మధ్యంతర ఉత్తర్వులని న్యాయమూర్తి హృషికేష్‌ రాయ్‌ గుర్తు చేస్తూ.. తదుపరి విచారణ ఎప్పుడుందని ప్రశ్నించారు. డిసెంబరు 6న అని న్యాయవాది తెలిపారు. వెంటనే మీరు ఈ పిటిషనర్‌ ఉపసంహరించుకుంటారా. లేదంటే డిస్మిస్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు రికార్డు చేయమంటారా. అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దాంతో తాము దీన్ని ఉపసంహరించుకుంటామని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఉపసంహరించుకునే అవకాశం ఇస్తూనే కేసును డిస్మిస్‌ చేస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.