ETV Bharat / sukhibhava

ఏంటీ పార్ బాయిల్డ్ రైస్? ఇది తింటే నిజంగానే బరువు తగ్గుతారా?

author img

By

Published : May 22, 2023, 7:52 AM IST

Parboilde Rice Health Benefits
పార్ బాయిల్డ్ రైస్ అంటే ఏంటి? ఇది తింటే నిజంగానే బరువు తగ్గుతారా?

బరువు తగ్గేందుకు కొందరు ఏవేవో ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు. తక్కువ తింటే బరువు తగ్గుతామనే అపోహతో కడుపు మాడ్చుకుంటారు. ఇంకొందరేమో అన్నం తింటే బరువు పెరుగుతామని భోజనాన్ని మానేస్తారు. అలాంటి వారికి ఉడకబెట్టిన బియ్యం మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. ఈ బియ్యం తింటే బరువు పెరగరు. అదే సమయంలో బలంగానూ తయారవుతారు. పార్ బాయిల్డ్ రైస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో చాలా మందిని ఊబకాయం సమస్య ఇబ్బంది పెడుతోంది. పెద్దవారితో పాటు యువత కూడా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. జీవన శైలిలో మార్పుల వల్ల వచ్చే సమస్యల్లో ఇదీ ఒకటి. అయితే ఊబకాయాన్ని నియంత్రించకపోతే మధుమేహం లాంటి ఇతర రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. అందుకే అధిక బరువుతో బాధపడేవారు వ్యాయామం చేస్తూ ఆహారాన్ని తగ్గిస్తుంటారు. తెల్ల అన్నం తింటే బరువు పెరుగుతామనే భయంతో దాని జోలికి వెళ్లరు. బ్రౌన్ రైస్ మంచిదే అయినా కొందరికి అది నచ్చకపోవచ్చు. ఇలాంటి వారికి పార్ బాయిల్డ్ రైస్ ఒక మంచి ఎంపికగా చెప్పొచ్చు.

షుగర్​ రోగులకు ఎంతో మేలు!
సాధారణ అన్నం కంటే పార్ బాయిల్డ్ రైస్ (ఉడకబెట్టిన బియ్యం) తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో పీచుతో పాటు పోషక పదార్థాల శాతం ఎక్కువగా ఉంటుంది. మధుమేహంతో బాధపడేవారు పాలిష్ పట్టిన బియ్యం కంటే పార్ బాయిల్డ్ రైస్ తినడం మేలు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పాలిష్ పట్టని బియ్యం తినడం వల్ల గ్లైకమిక్ ఇండెక్స్ 23 శాతం వరకు తగ్గుతుంది. అలాగే ఇన్సులిన్​ స్పందన కూడా వేగవంతం అవుతుంది.

పార్​ బాయిల్డ్​ రైస్​ అంటే ఏమిటి..?
ఉడకబెట్టిన బియ్యంలో క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శారీరక కసరత్తులు ఎక్కువగా చేసేవారు పార్​ బాయిల్డ్ రైస్​ను తీసుకోవడం మంచిది. సాధారణ తెల్ల బియ్యంతో పోలిస్తే ఇందులో థయామిన్, నియాసిన్ శాతం కూడా అధికంగా ఉంటుంది. అసలు పార్ బాయిల్డ్ రైస్ అంటే ఏంటంటే.. పొట్టు తీయని వరి ధాన్యాన్ని ముందు గోరువెచ్చటి నీటిలో నానబెడతారు. ఆ తర్వాత ఈ బియ్యాన్ని కాసేపు ఉడికిస్తారు. ఆరిన అనంతరం ఆ బియ్యాన్ని మిల్లింగ్ చేస్తారు. నానబెట్టడం, ఉడికించడం, ఆరబెట్టడం.. ఇందులో ముఖ్యమైన అంశాలుగా చెప్పొచ్చు. ఇలా ఉడకబెట్టిన బియ్యాన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రముఖ డైటీషియన్ మన్ ప్రీత్​ కల్రా తెలిపారు.

ఎముకలు దృఢం.. జుట్టు పదిలం!
పొట్ట ఆరోగ్యానికి ఉడకబెట్టిన బియ్యం తినడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పొట్టలో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుదలలో ఇది ఎంతగానో దోహదపడుతుంది. అజీర్తి, ఉబ్బరం లాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. మధుమేహంతో బాధపడేవారిలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపర్చడంలోనూ, గ్లైకమిక్ ఇండెక్స్​ను తగ్గించడంలోనూ, రక్తంలో చక్కెర స్థాయులను స్థిరంగా ఉంచడంలోనూ ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పార్ బాయిల్డ్ రైస్​ను తరచూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఈ బియ్యంలో ఐరన్, కాల్షియం శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి జుట్టు సంరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఉడకబెట్టిన బియ్యంలో బీ విటమిన్లు ఎక్కువ శాతంలో ఉంటాయి. ఇది హార్మోన్ల సమతుల్యతకు ఎంతగానో దోహదపడుతుందని డైటీషియన్ మన్ ప్రీత్ కల్రా వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.