ETV Bharat / state

BJP PROTEST: 'మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావును బర్తరఫ్​ చేయాలి'

author img

By

Published : Aug 8, 2021, 4:33 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కమలాపూర్​లో భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. తమ పార్టీకి చెందిన కమలాపూర్​ ఎంపీపీని ప్రజా కార్యక్రమంలో తెరాస నేతలు అవమానించారంటూ ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు, భాజపా నేతలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది.

BJP PROTEST: 'మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావును బర్తరఫ్​ చేయాలి'
BJP PROTEST: 'మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావును బర్తరఫ్​ చేయాలి'

వరంగల్​ అర్బన్​ జిల్లా కమలాపూర్​ వ్యవసాయ మార్కెట్‌లో శనివారం స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుతో పాటు ప్రభుత్వ విప్​ బాల్క సుమన్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి భాజపాకు చెందిన స్థానిక ఎంపీపీ తడక రాణి హాజరయ్యారు. అయితే కార్యక్రమంలో ప్రోటోకాల్​ పాటించకుండా తెరాస నాయకులు ఎంపీపీని అవమానించారు. పలువురు ఆమెను దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.

దీనిని నిరసిస్తూ మండల కేంద్రంలో నేడు భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. కార్యక్రమంలో భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి ఈటల జమున, మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభ, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమలు పాల్గొన్నారు. తెరాస ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

స్థానిక అంబేడ్కర్‌ కూడలి వద్ద చేపట్టిన ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్​ దిష్టిబొమ్మను దగ్ధం చేసే క్రమంలో పోలీసులు, భాజపా నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఘర్షణలో భాజపాకు చెందిన ఓ సీనియర్‌ నాయకుడు గాయపడటంతో అతడిని ఆందోళన నుంచి పక్కకు తప్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న మంత్రులంతా యథా రాజా తథా ప్రజా అన్నట్లుగా ఉన్నారని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి దుయ్యబట్టారు. మహిళల పట్ల మంత్రులకు కనీస గౌరవం లేదని విమర్శించారు. తెరాస నేతలు మహిళలను కించపరిచినా సీఎం కేసీఆర్‌కు కనబడటం లేదా అంటూ ప్రశ్నించారు. మహిళా ప్రజాప్రతినిధిని అవమానించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు ఈ ఉద్యమం ఆగదని ఆమె హెచ్చరించారు.

రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న మంత్రులంతా ముఖ్యమంత్రి కేసీఆర్​ మాదిరిగానే యథా రాజా తథా ప్రజా అన్నట్లుగా ఉన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు గతంలో ఓ గ్రూప్​-1 అధికారిని కించపరిచిన విషయాన్ని మరచిపోక ముందే మళ్లీ నిన్న మా పార్టీకి చెందిన ఎంపీపీని అగౌరవపరచాడు. పలువురు తెరాస కార్యకర్తలు ఆమెను దూషిస్తూ పోస్టులు పెట్టారు. మహిళా ప్రజాప్రతినిధిని కించపరుస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్​కు కళ్లు కనిపించడం లేదా? నిద్రపోతున్నారా? తెలంగాణ మంత్రివర్గం నుంచి ఎర్రబెల్లిని బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేస్తున్నాం.-గీతా మూర్తి, భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు

ఇదీ చూడండి: MINISTER KTR: దివ్యాంగులకు చేయూతనిద్దాం.. అండగా నిలుద్దాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.